STOCKS

News


రుణాలు ఎగ్గొట్టిన విద్యుత్‌ కంపెనీలకు చుక్కెదురు!

Tuesday 28th August 2018
news_main1535434088.png-19715

న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలను ఎగవేసిన విద్యుత్‌ కంపెనీలపై దివాలా చర్యలు చేపట్టేందుకు బ్యాంకులకు మార్గం సుగమం అయింది. మొండి బకాయిలుగా (ఎన్‌పీఏ) మారి 180 రోజుల్లోపు పరిష్కారం లభించని ఖాతాలను బ్యాంకులు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదించాలని ఆర్‌బీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 12న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. మార్చి 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రాగా, దీనికి వ్యతిరేకంగా విద్యుత్‌ కంపెనీలు అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించాయి. అయితే, ఈ దశలో మధ్యంతర ఆదేశాల జారీ కుదరదని కోర్టు సోమవారం స్పష్టం చేసింది. వాస్తవాలను నమోదు చేసిన తర్వాత ఈ అంశంలో ప్రత్యేకంగా కోర్టును ఆశ్రయించొచ్చని పిటిషన్లకు అవకాశం ఇచ్చింది. ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ)లోని సెక్షన్‌ 7 కింద రుణదాతలు చర్యలు చేపట్టకుండా ఈ ఆదేశాలు నిరోధించవని కూడా కోర్టు స్పష్టం చేసింది. మార్చి 1 నాటికి మొండి బకాయిలుగా మారి పరిష్కారం లభించని ఖాతాలను ఎన్‌సీఎల్‌టీకి నివేదించాల్సిన గడువు ఆగస్ట్‌ 27తో ముగిసింది. అయితే, చట్టంలోని సెక్షన్‌ 7 కింద ఆర్‌బీఐతో సంప్రదింపులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అలహాబాద్‌ హైకోర్టు కోరింది. ఈ సెక్షన్‌ కింద ప్రజాప్రయోజనాల కోణంలో ఆర్‌బీఐకి కేంద్రం ఆదేశాలు జారీ చేయగలదు.  విద్యుత్‌ రంగానికి సంబంధించి ఎన్‌పీఏలు, రుణ ఎగవేతలు మార్చి నాటికి రూ.1.8 లక్షల కోట్లుగా ఉన్నాయని విద్యుత్‌ రంగానికి సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నివేదిక తెలియజేస్తోంది. అయితే, విద్యుత్‌ కంపెనీల రుణ భారం వెనుక డిస్కంల చెల్లింపులు ఆలస్యం కావడం, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల లేమి, బొగ్గు సరఫరా సక్రమంగా లేకపోవడం తదితర కారణాలుగా కంపెనీలు, విద్యుత్‌ శాఖ పేర్కొంటుండడం గమనార్హం. ఈ కారణాల నేపథ్యంలో 180 రోజుల గడువును పొడిగించాలన్నది విద్యుత్‌ కంపెనీల డిమాండ్‌. కాగా, కోర్టు ఆదేశాల పట్ల నిరాశ చెందామని ప్రభుత్వరంగ రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పీవీ రమేష్‌ పేర్కొన్నారు. 

ప్రొవిజనింగ్‌పై ప్రభావమేమీ ఉండదు: ఎస్‌బీఐ
దాదాపు 70 భారీ మొండిపద్దుల పరిష్కారంపై ఆర్‌బీఐ విధించిన డెడ్‌లైన్ ముగిసినప్పటికీ.. బ్యాంకుల ప్రొవిజనింగ్‌పై పెద్ద ప్రభావమేమీ ఉండదని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. బ్యాంకులు ఇప్పటికే ఆయా ఖాతాలకు సంబంధించి తగినంత కేటాయింపులు చేశాయని, పరిష్కార ప్రక్రియ కొనసాగిస్తున్నాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. దాదాపు రూ.1.74 లక్షల కోట్లు బాకీ పడిన 34 మొండిపద్దుల్లో .. 16 ఖాతాలను ఇప్పటికే ఎన్‌సీఎల్‌టీకి నివేదించినట్లు, మరో ఏడు పద్దుల పరిష్కార ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు రజనీష్ చెప్పారు. ఎన్ని మొండి బాకీల సంస్థలను ఎన్‌సీఎల్‌టీకి నివేదించాలన్నది ఖరారు చేయడానికి బ్యాంకులకు 15 రోజుల వ్యవధి ఉందని, ఈలోగా చర్చించి, నిర్ణయం తీసుకుంటామని యూనియన్ బ్యాంక్ ఎండీ రాజ్‌కిరణ్ రాయ్ చెప్పారు. 

త్వరలో ఆర్‌బీఐతో కేంద్రం సంప్రదింపులు
అలహాబాద్‌ హైకోర్టు సూచన మేరకు కేంద్ర విద్యుత్‌ శాఖ త్వరలోనే విద్యుత్‌ కంపెనీల ఎన్‌పీఏల విషయమై ఆర్‌బీఐతో సంప్రదింపులు జరపనుంది. ఎన్‌పీఏ ఖాతాలకు 180రోజుల్లోగా పరిష్కారం కొనుగొనాలని  లేని పక్షంలో ఎన్‌సీఎల్‌టీకి నివేదించాలన్న ఆర్‌బీఐ ఆదేశాలను సవరించాలని కోరే అవకాశం ఉందని ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. 



You may be interested

జెట్‌ ఎయిర్‌వేస్‌ నష్టాలు 1,323 కోట్లు

Tuesday 28th August 2018

ముంబై: జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీకి  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,323 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఇంధన వ్యయాలు బాగా పెరిగిపోవడం, రూపాయి పతనం కారణంగా ఇతర ఖర్చులు కూడా అధికం కావడం వల్ల ఈ స్థాయిలో ఈ కంపెనీకి నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.54 కోట్ల నికర లాభం వచ్చిందని జెట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది.  ఈ కంపెనీకి వరుసగా

హజీరా ఎల్‌ఎన్‌జీ నుంచి ‘టోటల్‌’ నిష్క్రమణ

Tuesday 28th August 2018

న్యూఢిల్లీ: హజీరా ఎల్‌ఎన్‌జీ టర్మినల్‌ నుంచి ఫ్రాన్స్‌ ఇంధన సంస్థ, టోటల్‌ ఎస్‌ఏ వైదొలగింది. హజీరా ఎల్‌ఎన్‌జీలో 26 శాతం వాటాను భాగ‍స్వామ్య సంస్థ, షెల్‌కు విక్రయించామని టోటల్‌ ఎస్‌ఏ తెలిపింది. ఈ మేరకు షెల్‌ కంపెనీతో ఆసక్తి వ్యక్తీకరణ ఒప్పందం కుదుర్చుకున్నామని, ఈ వాటా విక్రయానికి వివిధ నియంత్రణ సంస్థలు ఆమోదాలు పొందాల్సి ఉందని పేర్కొంది.  షెల్‌ అనుబంధ సంస్థ, షెల్‌ గ్యాస్‌ బీవీ ఈ 26 శాతం

Most from this category