STOCKS

News


వడ్డీరేటు తగ్గిస్తున్న బ్యాంకులు

Thursday 11th July 2019
news_main1562821249.png-26968

  • ఎస్‌బీఐ రేటు తగ్గించింది!!
  • రుణ రేటు 5 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు
  • అదే బాటలో ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌
  • 10 బేసిస్‌ పాయింట్ల రుణ రేటు కోత
  • ఆర్‌బీఐ గవర్నరు పిలుపునకు స్పందన

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అందిస్తున్న రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు వేగంగా బదలాయించాలన్న గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకటనకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ) స్పందించాయి. రుణ రేటును స్వల్పంగా తగ్గించాయి. ఈ విషయంలో ఎస్‌బీఐ 5 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తే, ఓబీసీ 10 బేసిస్‌ పాయింట్ల రేటును తగ్గించింది. 100 బేసిస్‌ పాయింట్లంటే ఒక శాతం. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటే రెపో. ప్రస్తుతం ఈ రేటు 5.75 శాతంగా ఉంది. 
ఆర్‌బీఐ గవర్నర్‌ ఏమన్నారంటే...
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సోమవారం నాడు జరిగిన బడ్జెట్‌ అనంతర సంప్రదాయక సమావేశం సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ మాట్లాడుతూ, ‘‘జూన్‌ 6వ తేదీకి ముందు పాలసీ నిర్ణయం వరకూ చూస్తే, రెపో రేటు 50 బేసిస్‌ పాయింట్లు తగ్గింది (నాటి నిర్ణయం కూడా కలుపుకుంటే 75 బేసిస్‌ పాయింట్లు). అయితే బ్యాంకర్లు మాత్రం ఇందులో కేవలం 21 బేసిస్‌ పాయింట్ల రేటును కస్టమర్లకు బదలాయించారు. ఈ విధానం మారాలి. వేగంగా రెపో ప్రయోజనం కస్టమర్‌కు అందాలి. వృద్ధికి ఇది అవసరం. ఏది ఏమైనా ఇప్పుడు ఒక సానుకూల అంశం ఉంది. రేటు బదలాయింపునకు ఇంతక్రితం ఆరు నెలల కాలం పట్టేది. ఇప్పుడు రెండు, మూడు నెలల సమయం మాత్రమే పడుతోంది’’ అని అన్నారు.
ఎస్‌బీఐ... ఆర్థిక సంవత్సరంలో మూడవసారి...
- ఎస్‌బీఐ తగ్గించిన తాజా ఐదు బేసిస్‌ పాయింట్ల రుణ రేటు తగ్గింపు బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ మూడుసార్లు రుణ రేటును తగ్గించింది. ఇంతక్రితం ఏప్రిల్‌, మే నెలల్లో కూడా ఎస్‌బీఐ రుణ రేటు ఐదు బేసిస్‌ పాయిం‍ట్ల మేర తగ్గించింది. మొత్తంగా ఈ కాలంలో గృహ రుణాలపై ఎస్‌బీఐ వడ్డీరేటు 20 బేసిస్‌ పాయింట్ల వరకూ తగ్గింది. 
- నిధుల సమీకరణ వ్యయభారం ప్రాతిపదికన ఉండే మార్జినల్‌ కాస్ట్‌ లెండింగ్‌ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) ప్రస్తుతం 8.45 శాతం నుంచి 8.40 శాతానికి తగ్గింది. 
- జూలై 1 నుంచే బ్యాంక్‌ రెపో ఆధారిత గృహరుణ పథకాలను ప్రవేశపెట్టింది. 

ఇప్పటికే కొన్ని బ్యాంకులు...
జూన్‌ 6 పాలసీ సమీక్ష, పావుశాతం రేటు కోత అనంతరం బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కార్పొరేషన్‌ బ్యాంక్‌, ఓరియెంటల్‌ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌లు కూడా తమ ఎంసీఎల్‌ఆర్‌ను 5 నుంచి 10 బేసిస్‌ పాయింట్లు తగ్గించాయి. 

మరో రేటు కోత!
ఆగస్టు 5  నుంచి 9వ తేదీల మధ్య ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) తాజా విధాన సమీక్ష జరపనుంది. ఈ సందర్భంగా వృద్ధే లక్ష్యంగా మరో పావుశాతం రెపో రేటు కోత ఉంటుందని అంచనా. ఇదే జరిగితే, రెపో రేటు 5.5 శాతానికి తగ్గుతుంది. 

నేటి నుంచీ తగ్గిన ఓబీసీ రేటు అమలు

వివిధ కాలపరిమితుల రుణ రేట్లను ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ) 10 బేసిస్‌ పాయింట్ల వరకూ తగ్గించింది. తాజా రేట్లు మంగళవారం నుంచీ అమల్లోకి వస్తాయి. బ్యాంక్‌ తాజా  నిర్ణయం ప్రకారం- ఓవర్‌నైట్‌, నెల ఎంసీఎల్‌ఆర్‌ 10 బేసిస్‌ పాయింట్ల చొప్పున తగ్గి 8.20 శాతం, 8.25 శాతానికి తగ్గాయి. అలాగే మూడు, ఆరు, ఏడాది రేట్లు ఐదు బేసిస్‌ పాయింట్లు తగ్గి 8.45 శాతం, 8.55 శాతం, 8.65 శాతాలకు దిగివచ్చాయి.



You may be interested

ఇండిగో మరో 7 శాతం క్రాష్‌

Thursday 11th July 2019

ఇంటర్‌ గ్లోబల్‌ ఏవియేషన్‌ షేరు వరుసగా రెండవ రోజు కూడా నష్టాల్లో ట్రేడవుతోంది. క్రితం రోజు భారీగా నష్టపోయిన ఈ షేరు గురువారం(జులై 11) ట్రేడింగ్‌లో 7.57 శాతం నష్టపోయి రూ.1,294.40 కు పడిపోయింది. ఇండిగో ప్రమోటర్లు రాహుల్‌ భాటియా, రాకేష్‌ గంగ్వాల్‌ మధ్య వివాదం సెబీ వరకు వెళ్లడంతో బుధవారం(జులై 10) ట్రేడింగ్‌లో ఇంటర్‌ గ్లోబల్‌ ఏవియేషన్‌ షేరు విలువ 17 శాతం నష్టపోయిన విషయం తెలిసినదే. ఇండిగో

28 పైసలు బలపడిన రూపీ

Thursday 11th July 2019

 ఫెడ్‌ వడ్డి రేట్ల కోత ఉండవచ్చనే నేపథ్యంలో రూపీ డాలర్‌ మారకంలో 28 పైసలు బలపడి 68.30 వద్ద గురువారం(జులై 11) ప్రారంభమైంది. బంగారం ధరలు పెరగడంతో డాలర్‌ బలహీనపడుతోంది. గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 68.58 వద్ద ముగిసింది. 

Most from this category