News


1500 శాఖలు మూతపడ్డాయ్‌!

Saturday 10th November 2018
news_main1541829569.png-21856

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం అటు కస్టమర్లు, ఇటు బ్యాంకు ఉద్యోగులకు చేటు చేస్తుందని ఆల్‌ఇండియా స్టేట్‌బ్యాంక్‌ ఆఫీసర్స్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ జీ. సుబ్రమణ్యం ఆందోళన వ్యక్తం చేశారు. విలీనాలతో కస్టమర్లకు అందించే సేవలపై, బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగుల జీవితాలపై పెను ప్రభావం పడుతుందన్నారు. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకును విలీనం చేయడంతో దేశవ్యాప్తంగా దాదాపు 1500 శాఖలు మూతపడ్డాయని, 15,000మందికి పైగా ఉద్యోగులు రిటైర్‌మెంట్‌ తీసుకున్నారని వివరించారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 200కు పైగా శాఖలను మూసివేయడం జరిగిందని, దీంతో ఆయా ప్రాంతాల్లో కస్టమర్లకు బ్యాంకింగ్‌ సేవలు అందకుండా పోయాయన్నారు. ఎప్పుడూ లాభాల్లో ఉండే ఎస్‌బీఐ వరుసగా మూడు త్రైమాసికాలు నష్టాలు ప్రకటించడానికి విలీనమే కారణమని విమర్శించారు. ఇతర పీఎస్‌బీలను విలీనం చేసినా ఇదే విధంగా పలు శాఖలు మూతపడతాయని, విలీనం చేసుకున్న బ్యాంకు నష్టాలను చవిచూస్తుందని చెప్పారు. ఎస్‌బీఐ ఫలితాల్లో ఎప్పుడూ కార్యనిర్వాహక లాభం క్షీణించలేదని, మొండిపద్దుల కేటాయింపుల కారణంగా నికర లాభం మాత్రం హరించుకుపోయిందని వివరించారు.
ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వాల దొంగాట
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వం, ఆర్‌బీఐ అని సుబ్రమణ్యం ఆరోపించారు. బడాబడా కార్పొరేట్లకు లోన్లను బ్యాంకు అధికారులు మంజూరు చేయలేరని, కేవలం బ్యాంకు బోర్డు మాత్రమే వేల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వగలదని వివరించారు. బ్యాంకు బోర్డుల్లో ఉద్యోగుల తరఫున డైరెక్టర్‌ లేకపోవడంతో ఆర్‌బీఐ, కేంద్రం నియమించిన డైరెక్టర్ల కన్నుసన్నల్లో భారీ రుణాల మంజూరీ జరిగిందన్నారు. అలాంటి రుణాలు మొండిపద్దులుగా మారడంతో ఇప్పుడు కేంద్రం, ఆర్‌బీఐ ఒకరినొకరు విమర్శించుకుంటూ దొంగాట ఆడుతున్నాయన్నారు. ఈ విషయం తెలియక ‘చిన్న లోను కోసం వస్తే వెయ్యి రూల్స్‌ చెబుతారు, పెద్ద కంపెనీలకు అప్పణంగా రుణాలిస్తారు’అని సామాన్యులు బ్యాంకు అధికారులపై మండిపడుతున్నారని వాపోయారు. బ్యాంకు అధికారుల పర్యవేక్షణలో మంజూరయిన రుణాల్లో కేవలం 5-6 శాతమే ఎన్‌పీఏలుగా మారాయన్నారు. దీనికితోడు ప్రభుత్వాలు ఓట్ల కోసం చేసే రుణమాఫీలు అంతిమంగా బ్యాంకులను కుంగదీస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రభుత్వం, ఆర్‌బీఐకి నిజంగా మొండిపద్దులు వసూలు చేయాలని ఉంటే ఎన్‌పీఏల జాబితా బహిర్గతం చేసేందుకు బ్యాంకులకు అనుమతినివ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.
రేపు ఎస్‌బీఐ ఓఏహెచ్‌సీ 32వ సాధారణ సమావేశం
ఈ నెల 11న ఎస్‌బీఐ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌(హైదరాబాద్‌ సర్కిల్‌) 32వ జనరల్‌బాడీ మీటింగ్‌ నిర్వహిస్తున్నామని సమాఖ్య జనరల్‌సెక్రటరీ సుబ్రమణ్యం చెప్పారు. ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ స్వామినాధన్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా, హైకోర్టు న్యాయమూర్తి ఏవీ శేషసాయి గౌరవ అతిధిగా హాజరవుతారన్నారు. ఎస్‌బీఐలో ఆరు బ్యాంకుల విలీనం అనంతరం జరుగుతున్న ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యం ఉందన్నారు. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసే దిశగా ప్రభుత్వం చేస్తున్న యత్నాలను అడ్డుకోవడం, వేతన సవరణలకు సంబంధించి ప్రభుత్వం ఇంతవరకు ప్రకటన చేయకపోవడంపై సమావేశంలో చర్చిస్తామన్నారు. ఎన్‌పీఏలు, రిక్రూట్‌మెంట్లు, బ్యాంకుబోర్డుల్లో ఉద్యోగుల తరఫున డైరెక్టర్‌ నియామకం తదితర అంశాలను సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. తెలుగు సంస్కృతిని ప్రోత్సహించేలా సమావేశారంభంలో పలు జానపద కళారూపాల ప్రదర్శన ఉంటుందని చెప్పారు. 
రైటప్‌: సమావేశంలో మాట్లాడుతున్న సుబ్రమణ్యంYou may be interested

భవనం ఎత్తు పెరిగితే?

Saturday 10th November 2018

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో జనాభా పెరుగుతుండటంతో ఐదంతస్తుల భవనాలు సర్వసాధారణమయ్యాయి. పాత భవనాలను కూల్చేసి మరీ కొత్త అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్న బిల్డర్లున్నారు. వీటికి తోడు 20, 34 అంతస్తుల ఆకాశహర్మ్యాలు సైతం నగరంలో దర్శనమిస్తున్నాయి. వీటిల్లో ఐదంతస్తుల వరకు చ.అ.కు ఒక రకమైన ధర ఉంటే ఆ తర్వాత ప్రతి అంతస్తుకు ధర పెరుగుతుంటుంది. నిర్మాణ వ్యయం పెరుగుతుంది కాబట్టి చ.అ. ధరల్లోనూ మార్పులుంటాయని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. బాల్కనీ నుంచే

జూన్‌లో ఏఐఎం నుంచి కొత్త స్కీమ్‌

Saturday 10th November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గ్రామీణ, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ (ఏఐఎం) వచ్చే జూన్‌ నుంచి మరొక సరికొత్త పథకంతో రానుంది. దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎస్‌ఎంఈ), స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు లఘు వ్యాపార ఆవిష్కరణలు (స్మాల్‌ బిజినెస్‌ ఇన్నోవేషన్‌) పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు నీతి ఆయోగ్‌ అడిషనల్‌ సెక్రటరీ, అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ డైరెక్టర్‌ ఆర్‌ రామనన్‌ రామనాథన్‌ తెలిపారు.

Most from this category