STOCKS

News


విదేశీ ఇన్వెస్టర్ల ఆధీనంలోకి భారత కంపెనీలు

Thursday 28th March 2019
Markets_main1553760399.png-24844

విదేశీ ఇన్వెస్టర్ల ఆధీనంలోకి భారత కంపెనీలు
2018లో 1.64 లక్షల కోట్ల వ్యూహాత్మక పెట్టుబడులు
వాటాల తగ్గింపు లేదా పూర్తిగా తప్పుకుంటున్న ప్రమోటర్లు

న్యూఢిల్లీ: అననుకూల పరిస్థితులతో ప్రమోటర్లు కఠిన నిర్ణయాలకు మొగ్గు చూపుతున్నారు. పరిస్థితులను అధిగమించేందుకు కంపెనీల్లో తమ వాటాలను పూర్తిగా విక్రయించేందుకు ముందుకు వస్తున్నారు. నిధుల పరంగా తీవ్ర ఒత్తిళ్లు, అదే సమయంలో బ్యాంకులు పటిష్ట ఎన్‌పీఏ నిబంధనల కారణంగా కఠినంగా వ్యవహరిస్తుండడం వంటి పరిణామాలతో... ప్రమోటర్లు తమ వాటాలను తగ్గించుకోవడం లేదా తమ వాటాలను పూర్తిగా అమ్మేసి బయటకు వెళ్లిపోయేందుకు విదేశీ ఇన్వెస్టర్లతో డీల్స్‌ కుదర్చుకుంటున్నారు. బ్లూంబర్గ్‌ డేటా ప్రకారం గతేడాది (2018) విదేశీ వ్యూహాత్మక కొనుగోలుదారులు (కంపెనీలు, పీఈ ఫండ్స్‌) భారత్‌లో 23.45 బిలియన్‌ డాలర్ల(రూ.1.64 లక్షల కోట్లు)ను ఇన్వెస్ట్‌ చేశారు. తద్వారా ఇక్కడి కంపెనీల్లో నియంత్రిత వాటాను సొంతం చేసుకున్నారు. విలీనాలు, కొనుగోళ్ల పరంగా మన దేశానికి 2018 రికార్డు సంవత్సరంగా నిలుస్తుంది. గత మూడేళ్లలో (2016, 17, 18) విదేశీ ఇన్వెస్టర్లు 52.6 బిలియన్‌ డాలర్ల నిధులతో భారత కంపెనీల్లో నియంత్రిత వాటాలను దక్కించుకోవడం గమనార్హం. 2013-15 కాలంలో వచ్చిన 25.6 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే రెట్టింపైనట్టు తెలుస్తోంది.
సంక్షోభంలో పడకుండా...
ప్రమోటర్లు తమ వాటాలను అమ్మేసుకోవడం వెనుక ఉన్న కారణాల్లో ప్రధానంగా తమ గ్రూపు రుణాలను తగ్గించుకోవడమే. దివాలా ప్రక్రియకు కిందకు వెళితే తాము పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందన్న భయం వారిని ఈ నిర్ణయాల దిశగా నడిపిస్తోంది. ఉదాహరణకు... అనిల్‌ అంబానీ గ్రూపులోని రిలయన్స్‌ క్యాపిటల్‌ తన అనుబంధ రిలయన్స్‌ నిప్పన్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఆర్‌నామ్‌)లో తనకున్న 42.88 శాతం వాటాను పూర్తిగా అమ్మేయాలని నిర్ణయించడమే. రిలయన్స్‌ క్యాపిటల్‌కు ఉన్న రూ.18,000 కోట్ల అప్పుల్లో సగం వరకు అయినా తగ్గించుకోవాలని ఈ నిర్ణయం తీసుకుంది. తన వాటాను మరో భాగస్వామి నిప్పన్‌ లైఫ్‌కు విక్రయించేందుకు ఆసక్తి కూడా తెలియజేసింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రమోటర్లు కూడా గ్రూపు రుణ భారాన్ని తగ్గించుకునేందుకు తమ వాటాల్లో సగం మేర వ్యూహాత్మక ఇన్వెస్టర్‌కు విక్రయించనున్నట్టు ప్రకటించారు. కంపెనీల్లో తమ వాటాలను తనఖా పెట్టి మరీ వీరు భారీగా రుణాలు తీసుకున్న విషయం తెలిసిందే. తీసుకున్న రుణాలన్నీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై వెచ్చించి సంక్షోభంలో చిక్కుకున్నారు. దీంతో దీన్నుంచి బయటపడేందుకు వీరు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. 
విలువైన ఆస్తులు...
విదేశీ ఇన్వెస్టర్లు ఇంత భారీ మొత్తాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారత కంపెనీలను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపించడం వెనుక... ఆ వ్యాపారాలను విలువైన ఆస్తులుగా ప్రమోటర్లు తీర్చిదిద్దడమే కారణమంటున్నారు విశ్లేషకులు. ఇందుకు ఒక నిదర్శనం ఈ కామర్స్‌ దేశీయ అగ్రగామి కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌. దీన్ని 16 బిలియన్‌ డాలర్లు వెచ్చించి మరీ వాల్‌మార్ట్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు వ్యవస్థాపకులు తమ వాటాలు వాల్‌మార్ట్‌కు విక్రయించి రూ.5,000 కోట్లకు పైగా సంపదతో బయటకు వెళ్లిపోవడం గమనార్హం. అంతకుముందు ఎన్నో విడతలుగా వీరు విదేశీ నిధుల సేకరణతో వ్యాపారాన్ని విస్తరించుకంటూ తమ వాటాలను తగ్గించుకుంటూ వచ్చినవారే. 2016లో రష్యా ఇంధన దిగ్గజం రోజ్‌నెఫ్ట్‌, దాని భాగస్వాములు కలసి ఎస్సార్‌ ఆయిల్‌ను 13 బిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకున్నాయి. తద్వారా ప్రమోటర్లు రుయాలు గ్రూపు రుణ భారంలో పెద్ద మొత్తాన్ని చెల్లించేశారు. దేశంలో మరిన్ని కంపెనీల ప్రమోటర్లు తమ నియంత్రిత వాటాలను విక్రయించేందుకు ఆసక్తి చూపిస్తున్న వాతావరణం నెలకొంది. ప్రముఖ ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్‌ (పీఈ) డేటా ప్రకారం... ఐదు టాప్‌ పీఈ డీల్స్‌ విలువ 2017లో 700 మిలియన్‌ డాలర్లుగా ఉంది. 2018లో కేకేఆర్‌ ఒక్కటే 1.2 బిలియన్‌ డాలర్లతో భారత కంపెనీల్లో వాటాలను సొంతం చేసుకుంది. ఇందులో మ్యాక్స్‌ ఇండియాలో మెజారిటీ వాటా, రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌లో 60 శాతం వాటా కూడా ఉన్నాయి. 

విదేశీ ఇన్వెస్టర్ల నియంత్రిత వాటాల కొనుగోళ్లు
సంవత్సరం    విలువ (బిలియన్‌ డాలర్లలో)
2013    6.1
2014    10.2
2015    9.4
2016    21.8
2017    7.3
2018    23.4



You may be interested

15 శాతం తగ్గిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు

Thursday 28th March 2019

లక్ష్య సాధన కోసం సీబీడీటీ చర్యలు  న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు 15 శాతం మేర తగ్గడంతో ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్‌(సీబీడీటీ) తదుపరి చర్యలకు ఉపక్రమిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.12 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రాబట్టాలని సీబీడీటీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ నెల 23 నాటికి రూ.10.21 లక్షలు(85 శాతం) మాత్రమే వసూళ్లయ్యాయి. దీంతో పన్ను రికవరీ ప్రక్రియను మరింత పెంచాలని  ప్రిన్సిపల్‌ చీఫ్‌

యూబీహెచ్‌ఎల్‌ షేర్లను విక్రయించిన డీఆర్‌టీ

Thursday 28th March 2019

విజయ్‌మాల్యా రుణాల రికవరీలో ముగిసిన తొలిఘట్టం న్యూఢిల్లీ: తన షేర్లను తనఖా పెట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ అధినేత విజయ్‌ మాల్యా యునైటెడ్‌ బ్రేవరీస్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (యూబీహెచ్‌ఎల్‌)కు చెందిన 74లక్షల షేర్లను రూ. 1008కోట్లకు ఈడీ విక్రయించింది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) బుధవారం మీడియాకు వెల్లడించింది. విజయ్‌ మాల్యాపై మనీ లాండరింగ్‌ విచారణలో భాగంగా ఈడీ ఈ షేర్లను అటాచ్‌ చేసిన సంగతి

Most from this category