News


ఈ మార్కెట్లో కొనతగిన షేర్లు ఏవి...?

Thursday 14th February 2019
Markets_main1550085850.png-24182

మన ఈక్విటీ మార్కెట్లు చూడ్డానికి బలంగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇండెక్స్‌లోని ప్రధాన షేర్లతోపాటు కొన్ని లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల అండతో సూచీలు ఒక నిర్ణీత పరిధిలో చలిస్తున్నాయి. కానీ, మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌ మాత్రం ఎప్పటికప్పుడు కనిష్టాలకు పడిపోతూనే ఉన్నాయి. చాలా స్టాక్స్‌ వాటి 52 వారాల గరిష్ట స్థాయి నుంచి 40 శాతానికి పైగా నష్టపోయినవే. ఇండెక్స్‌ కాకుండా విడిగా స్టాక్స్‌ను పరిశీలిస్తే కొన్ని లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ సైతం 30-50 శాతం మధ్య నష్టపోయాయంటే... దిద్దుబాటు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే దీన్ని అనలిస్టులు ప్రైస్‌ వైజ్‌ కరెక్షన్‌గా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడులకు అవకాశం ఉన్న స్టాక్స్‌ వివరాలతో సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ఓ నివేదిక రూపంలో తెలియజేసింది. 

 

సెంట్రమ్‌ బ్రోకింగ్‌ గ్రీన్‌ షూట్స్‌, ఎవర్‌గ్రీన్‌ అని రెండు విభాగాలుగా స్టాక్స్‌ను వర్గీకరించింది. గ్రీన్‌ షూట్స్‌ విభాగంలో... గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌, వారోక్‌ ఇంజనీరింగ్‌, సెరా శానిటరీ వేర్‌, కెన్‌ఫిన్‌ హోమ్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, థైరోకేర్‌, కేఈసీ ఇంటర్నేషనల్‌, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌, టాటా ఎలెక్సి ఉన్నాయి. ఎవర్‌గ్రీన్‌ విభాగంలో... మారుతి సుజుకీ, కన్సాయ్‌ నెరోలాక్‌, పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, నెస్లే, పేజ్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఆర్‌బీఎల్‌ బ్యాంకు, లార్సెన్‌ అండ్‌ టుబ్రో, టెక్‌ మహీంద్రా ఉన్నాయి. గ్రీన్‌ షూట్స్‌ అంటే.. వృద్ధికి అవకాశం ఉన్న కంపెనీలు. కాకపోతే కొన్ని సమస్యల కారణంగా ధరల పరంగా నష్టపోతున్నాయి. మంచి కంపెనీలు అయిన ఇవి ప్రతికూల మార్కెట్‌ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని సెంట్రమ్‌ తెలిపింది. ఎవర్‌గ్రీన్‌ విభాగంలోని కంపెనీలు స్థిరమైన పనితీరుతో, బలంగా నిలదొక్కుకునేవి. బలమైన వ్యాపారాలు కలిగి, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రమాణాల విషయంలో తామేంటో నిరూపించుకున్న ప్రధాన స్టాక్స్‌ ఇవని, పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్ల అవగాహన కోసం ఈ వివరాలు ఉపయోగపడతాయని సెంట్రమ్‌ పేర్కొంది. ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే మూడు, నాలుగు విడతలుగా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని, మూడు నాలుగేళ్ల కోసం వీటిని పరిశీలించొచ్చని సూచించింది. 


మంచి యాజమాన్యాలు, పరిమిత రుణ భారంతో, మూలధన నిధులపై తక్కువ ఒత్తిళ్లు ఉన్నవి, విలువ పరంగా సౌకర్యంగా ఉన్న మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ తిరిగి బలంగా పైకి రాగలవని ఈక్వినామిక్స్‌ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ వ్యవస్థాపకుడు జి.చొక్కలింగం తెలిపారు. ఈ ప్రమాణాలు లేని కంపెనీల్లో సంపద ధ్వంసం అవుతుందన్నారు. ఆంధ్రా షుగర్‌, కర్ణాటక బ్యాంకు, బోంబే బర్మా, ఎంఆర్‌ఎఫ్‌ కంపెనీల పట్ల తాము బుల్లిష్‌గా ఉన్నట్టు చెప్పారు. స్టాక్స్‌ విలువల్లో భారీ పతనాల నేపథ్యంలో మంచి స్టాక్స్‌లో పెట్టుబడులకు ఇది సరైన సమయమని అంతర్జాతీయ బ్రోకరేజీ సం‍స్థ మోర్గాన్‌స్టాన్లీ పేర్కొంది. ఇంద్రప్రస్థ గ్యాస్‌, ఇండియన్‌ హోటల్స్‌, సైయంట్‌, ఇప్కా ల్యాబ్స్‌, జస్ట్‌ డయల్‌, అమరరాజా బ్యాటరీస్‌, ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌, జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌, ఒబెరాయ్‌ రియాలిటీ, ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ను మంచి కొనుగోలు అవకాశాలుగా మోర్గాన్‌ స్టాన్లీ సూచించింది.You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 62 పాయింట్లు డౌన్‌

Thursday 14th February 2019

ప్రపంచ మార్కెట్లతో సంబంధంలేకుండా వరుస నష్టాల్ని చవిచూస్తున్న భారత్‌ సూచీలు గురువారం సైతం ప్రతికూలంగా ప్రారంభయ్యే సంకేతాల్ని సూచిస్తూ ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 62 పాయింట్లు తగ్గింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.40  గంటలకు 10,761 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,823 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు  అమెరికా ప్రభుత్వ షట్‌డవున్‌కు తెరపడుతుందన్న వార్తలు, అమెరికా, చైనా

ప్రమోటర్ల వాటాల తాకట్టుతో చిక్కులే!

Thursday 14th February 2019

ప్రమోటర్లు కంపెనీల్లో తమకున్న వాటాలను తాకట్టు పెట్టే ధోరణి మన మార్కెట్లో క్రమంగా విస్తరిస్తోంది. ప్రమోటర్లు వ్యాపార అవసరాల కోసం తీసుకునే రుణాలకు తమ షేర్లను తనఖాగా ఉంచడం ఒక కోణం అయితే... తమ వ్యక్తిగత వ్యాపారాల కోసం ఒక కంపెనీలో వాటాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం మరో కోణం. అయితే, ఇక్కడ ప్రమోటర్ల సామర్థ్యం, మార్కెట్‌ పరిస్థితులు, భవిష్యత్తులో వారి వ్యాపారాలు ఎదుర్కొనే సమస్యలు ఇవన్నీ కూడా

Most from this category