STOCKS

News


అంతర్జాతీయంగా ఆందోళనే

Monday 24th December 2018
Markets_main1545627278.png-23196

మార్కెట్లలో ఎగుడుదిగుళ్లు సహజమేనని, జరగబోయే పరిణామాల్ని మనం పూర్తిస్థాయిలో ఊహించలేం కాబట్టి... కంపెనీల రాబడులను, వాటి భవిష్యత్తునే పెట్టుబడులకు ప్రాతిపదిక చేసుకోవాలని ఎడెల్‌వీస్‌ అసెట్‌ మేనేజిమెంట్‌ కంపెనీ సీఈఓ రాధికా గుప్తా సూచించారు. అంతర్జాతీయ పరిణామాలు కొంత ఆందోళనకర స్థాయిలోనే ఉన్నా... దేశీయంగా మాత్రం అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయన్నారు. దేశంలో ఫండ్‌ మేనేజర్లుగా రాణిస్తున్న అతికొద్ది మంది మహిళల్లో రాధికది ప్రత్యేక స్థానం. ఫోర్‌ఫ్రంట్‌ క్యాపిటల్‌ పేరిట సొంత ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ఏర్పాటు చేసి... 2014 నుంచీ ఎడెల్‌వీస్‌లో సేవలందిస్తున్నారామె. హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఆమె ‘సాక్షి’ బిజినెస్‌ ప్రత్యేక ప్రతినిధితో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...
ప్ర. మార్కెట్లిపుడు అంత ఆశాజనకంగా లేవు. తీవ్రమైన ఒడిదుడుకులున్నాయి. మరి ఇన్వెస్టర్లు మ్యూచ్‌వల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెడుతున్నారా?
జ. అలాంటిదేమీ లేదు. బహుశా! ఇలాంటి పరిస్థితుల్లో ఈక్విటీల్లో నేరుగా ఇన్వెస్ట్‌ చేసేవారు తగ్గతారేమో!!. కానీ మ్యూచ్‌వల్‌ ఫండ్లలో ఇన్వెస్ట్‌ చేసేవారు పెరుగుతారు. ఎందుకంటే వారు తక్కువ ధరల వద్ద ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లే కదా? ఇపుడు మన ఇన్వెస్టర్ల ఆలోచనా విధానం మారింది. అన్నీ తెలిసిన వారిలా స్పందిస్తున్నారు. కాబట్టి ఫండ్లలో పెట్టుబడులేమీ తగ్గటం లేదు. వాస్తవానికి పెరుగుతున్నాయి. 
ప్ర. అలాగైతే మీ ఫండ్‌లోకి కూడా పెట్టుబడులు పెరిగాయా? ఏ మేరకు?
జ. కొన్నాళ్లుగా మా ఫండ్లలోకి వస్తున్న పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి. 2016లో మేం జేపీ మోర్గాన్‌కు చెందిన దేశీ మ్యూచ్‌వల్‌ ఫండ్‌ వ్యాపారాన్ని ఏకమొత్తంగా కొనుగోలు చేసినపుడు మా ఫండ్లలో ఉన్న పెట్టుబడుల విలువ దాదాపుగా రూ.1,600 కోట్లు. ఇక జేపీ మోర్గాన్‌ నిర్వహణలోని దేశీ ఫండ్ల ఆస్తుల విలువ రూ.7,057 కోట్లు. ఈ డీల్‌ జరిగింది 2016 ఏప్రిల్‌లో. మొత్తంగా చూసుకుంటే అప్పుడు మా సామర్థ్యంలోని ఫండ్ల ఆస్తుల విలువ దాదాపుగా రూ.9వేల కోట్లకు చేరింది. కానీ ఈ రెండున్నరేళ్లలో ఇది ఏకంగా రూ.19,000 కోట్లకు చేరింది. అంటే రెట్టింపుకన్నా అధికం. దీన్నిబట్టే ఫండ్లలోకి వస్తున్న పెట్టుబడులు ఎలా పెరుగుతున్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ వృద్ధికి తగ్గట్టే మా కేంద్రాలను కూడా పెంచుతున్నాం. గత ఏడాది చివరికి దేశంలో ఎడెల్‌వీస్‌కు 7 కేంద్రాలుండగా... ఇపుడవి ఏకంగా 23కు చేరాయి. 
ప్ర: మన బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లైన నిఫ్టీ, సెన్సెక్స్‌ గరిష్ఠం నుంచి చూస్తే ఇప్పటికి 10 శాతం మాత్రమే పతనమయ్యాయి. కానీ పలు షేర్లు 50 శాతానికన్నా ఎక్కువ పడిపోయాయి. అవి మళ్లీ పెరుగుతాయా? 
జ: నిజమే! గడిచిన ఏడాదిగా చూస్తే దాదాపు అన్ని మ్యూచ్‌వల్‌ ఫండ్లూ ప్రతికూల (నెగెటివ్‌) రిటర్న్‌లే ఇచ్చాయి. మరి అన్ని షేర్లూ అలా పడిపోతున్నపుడు అదే తీరు ఫండ్లలోనూ కనిపిస్తుంది కదా!! ఇక ఇండెక్స్‌ల విషయానికి వస్తే సెన్సెక్స్‌, నిఫ్టీలో రిలయన్స్‌తో సహా ఐదారు షేర్లు మాత్రమే ఆ స్థాయిలో పెరుగుతున్నాయి. ఎందుకంటే వాటి ఫలితాలు బాగున్నాయి. నా ఉద్దేశం ప్రకారం రాబడుల్లో వృద్ధి కనబరుస్తూ, మంచి ఫలితాలనిస్తున్న కంపెనీలు మున్ముందు తప్పనిసరిగా పెరుగుతాయి. కాకపోతే మార్కెట్లు సెటిల్‌ కావటానికి కొంత సమయం పట్టొచ్చు.
ప్ర: అంటే స్మాల్‌, మిడ్‌క్యాప్‌ షేర్లు పెరగటానికి చాలా సమయం పడుతుందా?
జ: ఎంత సమయమనేది ఇదమిత్థంగా చెప్పలేం. కాకపోతే స్మాల్‌ క్యాప్‌ షేర్లు ఇప్పటికే బాగా పడి ఉన్నాయి. చక్కని రాబడులనిచ్చే కంపెనీలు వీటిలో చాలా ఉన్నాయి. అవి ఇంతకు మించి పడకపోవచ్చు. అందుకే మేం ఇలాంటి వాటిని వెతికిపట్టుకోవటానికి వచ్చేనెల్లో (జనవరిలో) స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ను కొత్తగా మార్కెట్లోకి తెస్తున్నాం. నిజానికి చాలా కంపెనీలు స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలోకి ఏకమొత్తం పెట్టుబడుల్ని తీసుకోవటం మానేశాయి. కానీ విలువలు ఆకర్షణీయంగా ఉన్నాయి కనక ఇప్పుడైతేనే ఇన్వెస్టర్లకు సరైన రాబడులను ఇవ్వగలమన్న నమ్మకంతో మేం కొత్త ఫండ్‌ను ఆరంభిస్తున్నాం.
ప్ర: మరి వచ్చే ఏడాది మార్కెట్లు ఎలా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు?
జ: అంతర్జాతీయ పరిణామాలు అంత సానుకూలంగా ఉంటాయని చెప్పలేం. కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. కానీ దేశీయంగా మన కంపెనీలు రాబడుల్లో చక్కని వృద్ధిని చూపిస్తున్నాయి. కాబట్టి మన మార్కెట్లు మరీ అంతలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. ఇన్వెస్టర్లకు మంచి రాబడులే వస్తాయి.
ప్ర: నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులే వస్తాయా? అలా చేయాలనుకోవటం కరెక్టేనా?
జ: ఒంట్లో బాగులేకుంటే సొంత వైద్యం చేసుకోం కదా! ఇదీ అంతే!! హైదరాబాద్‌ వరకే తీసుకుంటే... ఇక్కడ నిపుణులకు కొదవ లేదు. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి. మార్కెట్లు ఇంత హెచ్చుతగ్గుల్లో తిరుగుతున్నపుడు నేరుగా ఈక్విటీల్లో భారీ పెట్టుబడులు పెడితే ఆందోళన పెరిగి అది ఆరోగ్యంపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అందుకే మంచి మ్యూచ్‌వల్‌ ఫండ్లు ఎంచుకుని పెట్టుబడి పెట్టాలన్నది నా సూచన. 
ప్ర: మరి ఉన్నదంతా ఫండ్లలో పెడితే ఇలాంటి పరిస్థితుల్లో అక్కడైనా నష్టమే కదా?
జ: అందుకే నేనెప్పుడూ ఈక్విటీ పథకాల్లో పెట్టుబడి పెట్టేవారికి సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) విధానమే ఉత్తమమని చెబుతాను. ఏకమొత్తం పెట్టుబడి పెట్టాలనుకుంటే అందుకు వేరే సాధనాలు, వేరే ఫండ్లు ఉన్నాయి. You may be interested

మెటల్‌ షేర్ల పతనం

Monday 24th December 2018

నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా సోమవారం మార్కెట్లో మెటల్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేడు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 1.50శాతం క్షీణించింది. అమెరికా - చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ఇప్పట్లో ముగియదనే వార్తలు మరోసాని తెరపైకి రావడం కూడా సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. నేడు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3,158.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ ఇండెక్స్‌లోని

పెన్షన్‌ కోసం... మీ ‘ప్లాన్‌’ ఏంటి?

Monday 24th December 2018

ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెన్షన్‌ లేక ఎన్‌పీఎస్‌లో (జాతీయ పెన్షన్‌ విధానం) చేరి... దాన్నుంచి పెన్షన్‌ అందుకునే పరిస్థితి ఉంది. ఇక ప్రయివేటు ఉద్యోగులో..? ఏదో కొద్ది మందికి ఆయా సంస్థలు సొంత ట్రస్టుల్ని పెట్టుకుని పెన్షన్‌ ఇస్తున్నాయి తప్ప 90 శాతానికిపైగా ఇలాంటి సౌకర్యం లేనివారే. ఇక స్వయం ఉపాధి పొందుతున్న వారి గురించి చెప్పనే అక్కర్లేదు. మరి వీళ్లందరికీ రిటైరయ్యాక కూడా

Most from this category