STOCKS

News


బంధన్‌ బ్యాంక్‌ ...ఇన్వెస్టర్లూ జాగ్రత్త..

Tuesday 2nd October 2018
Markets_main1538462248.png-20790

లైసెన్స్‌ నిబంధనలు పాటించని కారణంగా... కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్‌ రంగ బంధన్‌ బ్యాంకుపై ఆర్‌బీఐ శుక్రవారం కఠిన చర్యలకు దిగింది. కొత్త శాఖలు ఏర్పాటు చేయవద్దని ఆదేశించడంతో పాటు, బ్యాంకు సీఈవో చంద్రశేఖర్‌ ఘోష్‌ పారితోషికాన్ని స్తంభింపజేసింది. దీంతో బంధన్‌ బ్యాంక్‌ ఇన్వెస్టర్లు ఎగ్జిట్‌ అవుతున్నారు. యూనివర్సల్‌ బ్యాంకింగ్‌ నిబంధనలకు అనువుగా బంధన్‌ బ్యాంకులో నాన్‌-ఆపరేటివ్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్‌ కంపెనీ (ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ) వాటాను మూడేళ్లలో (2015 ఆగస్ట్‌ నుంచి) 82 శాతం నుంచి 40 శాతానికి తగ్గించుకోనందుకు ఆర్‌బీఐ ఈమేరకు చర్యలు తీసుకుంది. బంధన్‌ బ్యాంక్‌ ఇకపై ఏ ఒక్క శాఖ ఏర్పాటు చేయాలన్నా ఆర్‌బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎండీ, సీఈవో పారితోషికాన్ని మాత్రం తదుపరి నోటీసు జారీ అయ్యే వరకు నిలిపివేయడం జరుగుతుందని ఆర్‌బీఐ పేర్కొంది. కోల్‌కతా కేంద్రంగా 2001లో ఏర్పాటైన మైక్రోఫైనాన్స్‌ సంస్థ బంధన్‌కు యూనివర్సల్‌ బ్యాంకు లైసెన్స్‌ను 2014 ఏప్రిల్‌లో ఆర్‌బీఐ మంజూరు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ బ్యాంకుకు 937 శాఖలున్నాయి. 

ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు శుక్రవారం మార్కెట్లు ముగిసిన తర్వాత బయటకు వచ్చాయి. బ్యాంకులో ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ వాటాను 40 శాతానికి తీసుకొచ్చే లైసెన్స్‌ షరతును పాటించేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ఆర్‌బీఐకి సహకరిస్తామని బంధన్‌ బ్యాంకు శనివారం ప్రకటించింది. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం కలుగలేదు. బంధన్‌ బ్యాంక్‌ షేరు సోమవారం మార్కెట్‌ ప్రారంభంలోనే భారీగా పతనమైంది. స్టాక్‌ 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌లోకి వెళ్లింది. తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి నెలకొంది. సోమవారం బంధన్‌ బ్యాంక్‌ షేరు ధర ఎస్‌ఎస్‌ఈలో 20 శాతం క్షీణతతో రూ.452కు పడిపోయింది. 

బంధన్‌ బ్యాంక్‌ షేరుపై కొంత కాలం ఒత్తిడి కొనసాగవచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేశారు. ఆర్‌బీఐ నిబంధనలను చేరుకోడానికి బ్యాంక్‌ చాలా దూరంలో ఉందని పెద్ద ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారని ఒక ఫండ్‌ మేనేజర్‌ తెలిపారు. రానున్న ట్రేడింగ్‌ సెషన్లలో ఈ స్టాక్స్‌ మరింత పతన కావడం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రమోటర్లు వారి వాటాను తగ్గించుకునే వరకు ఇన్వెస్టర్లు కొత్తగా బంధన్‌ బ్యాంక్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇష్టపడకపోవచ్చని తెలిపారు. బ్యాంక్‌కు సంబంధించిన రిటర్న్‌ రేషియో, లాభదాయకత వంటి అంశాలపై ప్రస్తుత పరిస్థితుల ప్రభావం మధ్యస్థ కాలం నుంచి దీర్ఘకాలంలో ఉండొచ్చని పేర్కొన్నారు. ఇతర బ్యాంక్‌తో విలీనం లేదా కొనుగోలు లేదా ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ ఇతర నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల వైపు వెళ్లడం వంటి వాటి వల్ల వాటా తగ్గింపు జరిగితే.. అప్పుడు బ్యాంక్‌ ఎర్నింగ్స్‌, రిటర్న్‌ రేషియోపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడొచ్చని వివరించారు. 

ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అనలిస్ట్‌లు బంధన్‌ బ్యాంక్‌ 2021 నాటి భవిష్యత్‌ ప్రైస్‌-టు-బుక్‌ వ్యాల్యు అంచనాలను 6 రెట్లు నుంచి 4.7 రెట్లుకు తగ్గించారు. మేనేజ్‌మెంట్‌ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు స్టాక్‌ కరెక‌్షన్‌కు గురౌతూ వస్తుందని పేర్కొన్నారు. వచ్చే రెండు త్రైమాసికాల్లో బ్యాంక్‌ కార్యకలాపాలపై తీవ్రమైన ఒత్తిడి నెలకొనవచ్చని తెలిపారు. కొత్త బ్రాంచ్‌ల ఏర్పాటుకు ఆర్‌బీఐ అనుమతి తప్పనిసరి కావడంతో బంధన్‌ బ్యాంక్‌.. వృద్ధి కోసం తన ప్రస్తుత బ్రాంచ్‌లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా బంధన్‌ బ్యాంక్‌ ఒక బ్రాంచ్‌ ద్వారా 3,000 మంది కస్టమర్లకు సేవలందిస్తోంది. ఇతర వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే ఇది చాలా తక్కువ స్థాయి. ఇతర బ్యాంకులు ఒక బ్రాంచ్‌ ద్వారా 20,000-25,000 కస్టమర్లకు సేవలందిస్తున్నాయి. 

బంధన్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు ఎత్తివేసే వరకు ఇన్వెస్టర్లు స్వల్ప కాలంలో జాగ్రత్తగా ఉండాలని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. దీర్ఘకాల ఇన్వెస్టర్లు వారి ఎర్నింగ్స్‌ అంచనాలను సవరించుకోవాలని తెలిపారు.    You may be interested

టెంప్ట్‌ అయి ‘యస్‌’ అనవద్దు!

Tuesday 2nd October 2018

యస్‌బ్యాంకు షేరుకు దూరం నిపుణుల సూచన రాణాకపూర్‌ నిష్క్రమించాల్సిందేనని ఆర్‌బీఐ తేల్చిచెప్పినప్పటి నుంచి మార్కెట్లో యస్‌ బ్యాంక్‌ షేరు కుప్పకూలుతూ వస్తోంది. షేరు పతనాన్ని అడ్డుకునేందుకు మేనేజ్‌మెంట్‌ ఎన్ని యత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. తాజాగా కపూర్‌ వారసుడి ఎంపికకు సెర్చ్‌ కమిటీని నియమిస్తున్నట్లు మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. దీంతో పాటు విశ్వాసం చూరగొనే దిశగా ఉన్నట్లుండి ఫలితాలను ప్రకటించింది. బ్యాంకు డిపాజిట్లలో 41 శాతం వృద్ధి నమోదు చేశామని, అడ్వాన్సుల్లో 65

ప్రతి ఐదు స్టాక్స్‌లో ఒక్కటే లాభాల్లో...

Tuesday 2nd October 2018

ప్రస్తుత ఏడాది ప్రతి ఐదు స్టాక్స్‌లో ఒక్కటి మాత్రమే లాభాలను అందించింది. నష్టపోయిన షేర్లతో పోలిస్తే లాభపడినవి ఇంత తక్కువగా వుండటం గత ఏడేళ్లలో చూస్తే ఇదే ప్రధమం. ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో ఉండటం కారణం. అడ్వాన్స్‌-డిక్లెన్‌ రేషియో 0.3 శాతానికి తగ్గింది. ఈ ఏడాది ఇప్పటి దాకా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-500 ఇండెక్స్‌లో 113 స్టాక్స్‌ లాభపడితే.. 380 స్టాక్స్‌ నష్టపోయాయి.  ఇండియా బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ నిఫ్టీ-50.. ఈ ఏడాది

Most from this category