STOCKS

News


వాణిజ్య యుద్ధం, రూపాయి కదలికలపై దృష్టి

Monday 10th September 2018
Markets_main1536556947.png-20116

స్థూల గణాంకాల వెల్లడి ఈ వారంలో సూచీల దిశానిర్థేశం చేయనున్నట్లు మార్కెట్‌ పండితులు భావిస్తున్నారు. పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడి, అమెరికా-చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ పరిణామాలు సూచీలకు కీలకంకానున్నాయని డెల్టా గ్లోబల్‌ పాట్నర్స్‌ ప్రిన్సిపల్‌ పాట్నర్‌ దేవేంద్ర నెవ్గి వివరించారు. ఈ సమాచారం ఆధారంగానే అక్టోబరులో సమావేశంకానున్న ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) పాలసీ సమీక్షను వెల్లడించనుందన్నారు. వడ్డీ రేట్ల ప్రకటనకు కీలకంగా ఉన్న ద్రవ్యోల్బణ సమాచారం ఈవారంలోనే సూచీలకు ఒక దిశను ఇవ్వనుందని విశ్లేషించారు. ఇక గురువారం (సెప్టెంబరు 13న) గణేశ్ చతుర్థి సందర్భంగా మార్కెట్లకు సెలవు కాగా, ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది.

గణాంకాలే కీలకం: ఎపిక్‌ రీసెర్చ్‌
ఆగస్టు నెలకు సంబంధించిన వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) బుధవారం వెల్లడికానుంది. ఇదే రోజున జూలై పారిశ్రామికోత్పత్తి డేటా వెలువడనుంది. వీటితోపాటు ఈవారంలో ఆగస్టు టోకు ధ‌ర‌ల ఆధారిత సూచీ(డ‌బ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం శుక్రవారం రోజున వెల్లడికానుండగా.. మార్కెట్‌కు ఈ గణాంకాలు కీలకంగా ఉన్నాయని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. వడ్డీ రేట్లను నిర్ణయించే ఈ డేటాతో పాటు.. శుక్రవారం ఆర్‌బీఐ నుంచి వెల్లడికానున్న సమాచారంపై కూడా ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు మార్కెట్‌ పండితులు చెబుతున్నారు. సెప్టెంబరు 7 నాటికి ఉన్నటువంటి విదేశీ మారక నిల్వలు.. ఆగస్టు 31 వారాంతానికి డిపాజిట్లు, బ్యాంకు రుణాల వృద్ధి రేటు సమాచారాన్ని శుక్రవారం ఆర్‌బీఐ వెల్లడించనుంది. 

రూపాయి కదలికల ప్రభావం
‘ముడిచమురు ధర మరోసారి 80 డాలర్ల దిశగా ప్రయాణం చేస్తూ రూపాయి మారకం విలువను కుంగదీస్తోంది. 80 శాతం దిగుమతిపైనే ఆధారపడుతున్న భారత్‌కు క్రూడ్‌ ధరలో ర్యాలీ ప్రతికూల ప్రభావమే చూపనుంది. మరోవైపు అమెరికా జాబ్‌ డేటా సానుకూలంగా ఉన్నందున డాలరు విలువ మరింత బలపడి రూపాయి విలువ క్షీణతకు దారి తీస్తోంది.’ అని కొటక్‌ సెక్యూరిటీస్‌ కరెన్సీ విభాగం డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌ అనింద్య బెనర్జీ వెల్లడించారు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ గతవారం ఒకదశలో 72.11 జీవిత కాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. వారాంతానికి 71.73 వద్ద నిలిచింది. ఏడాదిలో 13 శాతం క్షీణతను నమోదుచేసింది. వాణిజ్య యుద్ధంలో భాగంగా చైనా ఉత్పత్తులపై మరోసారి తాజా ట్యారిఫ్‌ ప్రకటన ఉండనుందని అమెరికా అధ్యక్షడు ట్రంప్‌ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో రూపాయి స్పాట్‌ స్థాయిని 71.60-72.60 మధ్య అంచనావేస్తున్నట్లు తెలిపారు. ‘10- ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌ గతవారంలో 8 శాతానికి చేరుకోవడం, ద్రవ్య లోటు భయాల ఆధారంగా చూస్తే త్వరలోనే ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచేందుకు అవకాశం ఉంది.’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధన విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు.  

అంతర్జాతీయ గణాంకాలు ఏం చెబుతాయి..?
అమెరికా ఆగస్టు కోర్‌ సీపీఐ గురువారం, రిటైల్‌ అమ్మకాల డేటా శుక్రవారం వెల్లడికానున్నాయి. ఫెడ్‌ తదుపరి సమావేశానికి కీలకంకానున్న ఈ డేటాపై మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించాయి. మరోవైపు సోమవారం చైనా ఆగస్టు వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం, శుక్రవారం పారిశ్రామికోత్పత్తి డేటాలను వెల్లడించనుంది. ప్రపంచ రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా గణాంకాలు సైతం మార్కెట్‌పై ప్రభావం చూపనున్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. గురువారం జరగనున్న యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ) సమావేశం సైతం వడ్డీరేట్ల నిర్ణయానికి కీలకంగా ఉంది. 

11,760 వద్ద తక్షణ నిరోధం 
‘టెక్నికల్‌గా గతవారంలో నిఫ్టీ దిద్దుబాటును నమోదుచేసింది. చార్టుల ఆధారంగా అప్‌ట్రెండ్‌ కనిపిస్తోంది. నిఫ్టీకి అత్యంత కీలక నిరోధం 11,760 పాయింట్ల వద్ద ఉంది. దిగువస్థాయిలో 11,393-11,340 శ్రేణిలో మద్దతు ఉంది.’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జసని విశ్లేషించారు. 

నిరాశపరిచిన విదేశీ నిధుల ప్రవాహం
ముడిచమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ క్షీణత కారణంగా గడిచిన ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి రూ.5,600 కోట్లను వెనక్కుతీసుకున్నారు. డిపాజిటరీ డేటా ప్రకారం సెప్టెంబరు 3-7 మధ్యకాలంలో ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.1,021 కోట్లు.. డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.4,628 కోట్లు ఎఫ్‌పీఐలు వెనక్కుతీసుకున్నారు. ఏప్రిల్‌-జూన్‌ కాలంలో రూ.61,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్న విదేశీ ఇన్వెస్టర్లు ఆ తరువాత నికర కొనుగోలుదారులుగా నిలిచినప్పటికీ.. తాజాగా మరోసారి నికర అమ్మకందారులుగా నిలిచారు. 


 



You may be interested

చైనా స్టీల్‌పై యాంటీ డంపింగ్‌ సుంకం

Monday 10th September 2018

న్యూఢిల్లీ: చైనా నుంచి చౌకగా వచ్చి పడుతున్న స్టీల్‌ ఉత్పత్తుల నుంచి దేశీయ కంపెనీలను కాపాడేందుకు కేంద్రం యాంటీ డంపింగ్‌ సుంకం విధించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రకాల చైనా స్టీల్‌పై ఒక్కోటన్నుకు 185.51 డాలర్ల వరకు ఈ యాంటీ డంపింగ్‌ సుంకాన్ని ఐదేళ్ల పాటు విధించనుంది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ఫ్లాగ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌, ఉషా మార్టిన్‌, గెర్డావ్‌ స్టీల్‌ ఇండియా, వర్ధమాన్‌ స్పెషల్‌ స్టీల్స్‌, జయస్వాల్‌ నెకో

రిటైర్మెంట్ కాదు.. వారసత్వ ప్రణాళికే..

Monday 10th September 2018

బీజింగ్‌: ఆలీబాబా గ్రూప్‌ చైర్మన్‌ జాక్‌ మా సోమవారం రిటైర్మెంట్‌ ప్రకటిస్తారంటూ వచ్చిన వార్తలను ఆ కంపెనీ ఖండించింది. తన వారసుడి ఎంపిక ప్రణాళిక గురించి మాత్రమే ఆయన ప్రకటన చేయనున్నారని, రాబోయే రోజుల్లోనూ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా జాక్‌ మానే కొనసాగుతారని కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశారు. సోమవారం 54వ పుట్టినరోజు సందర్భంగా  జాక్‌ మా రిటైర్మెంట్‌ ప్రకటించనున్నారని, ఇకపై దాతృత్వ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నారని ది న్యూయార్క్‌ టైమ్స్‌

Most from this category