STOCKS

News


మార్కెట్లను కుదిపేసిన ‘సెల్‌ ద ర్యాలీ’ వ్యూహం

Wednesday 5th December 2018
Markets_main1543990563.png-22657

  • అమెరికా, చైనాల మధ్య సంధి కుదిరిన 24 గంటల్లోగానే మార్కెట్‌ ర్యాలీ ఆవిరి

అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ ఎయిర్స్‌లో జరిగిన జీ–20 సదస్సు సందర్భంగా అమెరికా, చైనాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం తొలుత మార్కెట్ల ర్యాలీకి సహకరించినప్పటికీ.. ఇప్పుడు అదే ఒప్పందం సూచీలు కుప్పకూలేలా చేసింది. కనీసం 24 గంటలు కూడా గడవక ముందే ర్యాలీ చల్లబడిపోయింది. అదనపు సుంకాల విధింపులను 90 రోజుల పాటు నిలిపివేయాలని ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం వెనక రాజకీయ కుట్రలు ఏమైనా ఉండి ఉంటాయా అనే అనుమానాల నేపథ్యంలోనే అంతర్జాతీయంగా దాదాపు అన్ని దేశాల స్టాక్‌ మార్కెట్లు నేలచూపులు చూసినట్లు తేటతెల్లమవుతోంది. దీంతో మార్కెట్‌లో మొదలైన యూఎస్‌-చైనా సంధి ర్యాలీ కేవలం ఒక్కరోజుకు మాత్రమే పరిమితమైంది. మార్కెట్‌ వర్గాలు కొంతకాలం కొనసాగుందని భావించిన ర్యాలీ కాస్తా మరుసటి రోజుకే ఆవిరైపోయింది. ఇందుకు ప్రధాన కారణం.. కొనసాగుతున్న వాణిజ్య యుద్ధంలో స్వల్ప విరామం వచ్చిందే తప్పించి యుద్ధ విరమణ జరగలేదనే హెచ్చరికలపై మార్కెట్‌ వర్గాలు మరింత లోతుగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలు ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడానికి దోహదపడేలా ఉన్నాయన్న అంచనాల నేపథ్యంలో మంగళవారం అమెరికా మార్కెట్లు ఏకంగా 3 శాతానికి మించి పతనమయ్యాయి. డోజోన్స్‌ 799 పాయింట్లు (3.10 శాతం) నష్టపోయి 25,027 పాయింట్లకు పతనమైంది. నాస్‌డాక్‌ 283 పాయింట్లు (3.80 శాతం) కోల్పోయి 7,158 వద్దకు చేరుకుంది. ఎస్‌ అండ్‌ పీ 90 పాయింట్లు నష్టపోయి (3.24 శాతం) 2,700 వద్ద ముగిసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా సైతం ఇదే వాతావరణం అలముకుంది. యుద్ధ ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదనే అంచనాల కారణంగా ఇన్వెస్టర్లు ‘సెల్‌ ద ర్యాలీ’ వ్యూహన్ని అనుసరించి లాభాల స్వీకరణకు పాల్పడ్డారని వెల్లడైంది. 

24-గంటల్లోనే పెను మార్పులు..
ప్రస్తుతానికైతే కొత్త టారిఫ్‌లు విధించేది లేదని రెండు రోజుల కిందట అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హామీ ఇవ్వగా.. అంతకుముందు నుంచే ఇటువంటి ప్రకటనలు వెలువడవచ్చనే అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాలను నమోదుచేసిన సంగతి తెలిసిందే. ప్రకటన జరిగిన రోజైన సోమవారం ఒక్కరోజే 520 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఆసియా మార్కెట్‌లోకి వచ్చిచేరాయి. అయితే, ఆ తరువాత ట్రంప్‌ వ్యాఖ్యలను పూర్తిగా పరిశీలించిన మార్కెట్‌ వర్గాలు వచ్చిన లాభాలతో సరిపెట్టుకుని ర్యాలీ నుంచి బయటపడడమే బెటరనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇరు దేశాలు 90 రోజులలోపు ఒక అంగీకారానికి రాలేకపోతే, అమెరికా విధిస్తున్న 10 శాతం సుంకాలు 25 శాతానికి పెరిగే అవకాశం ఉండడంతో ఇన్వెస్టర్లు సెల్‌ ద ర్యాలీ వ్యూహాన్ని అనుసరించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఎంఎస్‌సీఐ ఆసియా పసిఫిక్ ఇండెక్స్ రెండు నెలల గరిష్టస్థాయి నుంచి మంగళవారం పడిపోయిందని, టోక్యో స్టాక్ ప్రైస్ ఇండెక్స్ 2.4 శాతం తగ్గిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో ఉత్పత్తి అయిన కార్లపై చైనా దిగుమతి సంకాలను గణనీయంగా తగ్గించడానికి అంగీకరించిందని ట్రంప్‌ ప్రకటించినప్పటికీ.. ఇరు దేశాల మధ్య ఈ అంశంపై రాత పూర్వక ఒప్పందం ఏమీ లేకపోవడంతో రెండో రోజే అమెరికాలోని కార్ల కంపెనీల షేర్లు పెరిగిన మేరకు పడిపోయాయి. ఈ నాటకీయ పరిణామాల మధ్య భారత మార్కెట్లు కూడా మంగళవారం ప్రభావితమయ్యాయి. నిఫ్టీ 49 పాయింట్ల నష్టంతో 10,820 వద్ద ప్రారంభమైంది. 10,781 పాయిం‍ట్ల వద్ద ఇంట్రాడే కనిష్టస్థాయిని నమోదుచేసింది. సెన్సెక్స్‌ 99 పాయింట్ల నష్టంతో 36,035 దగ్గర ప్రారంభమైంది.

మరి తరువాత ఏంటి..?
అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి తాత్కాలిక బ్రేకులు పడడం అనేది రిస్కీ అసెస్ట్స్‌కు సానుకూల అంశమని సొసైటీ జనరల్ స్ట్రాటజిస్ట్‌ ఫ్రాంక్ బెంజిమ్రా విశ్లేషించారు. అయితే, భవిష్యత్‌ మంతనాలు ఏమంత సజావుగా ఉండవని తాను భావిస్తున్నట్లు చెప్పారు. వచ్చే మూడునెలల్లో ఒడిదుడుకులు అధికంగా ఉంటాయని, ఇది ట్రేడర్లకు శుభవార్తని అన్నారు. ఇక ప్రస్తుత పరిణామాలు పూర్తి అనుమానాస్పదంగా ఉన్నట్లు అబెర్డీన్ స్టాండర్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఫండ్ మేనేజర్ భరత్ జోషి వ్యాఖ్యానించారు. సంధి ర్యాలీ ఒక కుదుపు వంటిదని అభివర్ణించారు. 


 You may be interested

కళ తప్పిన మెటల్‌ షేర్లు

Wednesday 5th December 2018

అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లో బుధవారం మెటల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇటీవల అమెరికా-చైనా దేశాల కుదిరిన వాణిజ్య యుద్ధ సం‍ధి ప్రశ్నార్థకంగా మారడంతో లండన్‌ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లో మెటల్‌ ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అలాగే ప్రపంచ అతిపెద్ద మెటల్‌ వినియోగదారుగా పేరోందిన చైనా మెటల్‌ డిమాండ్‌ పై ఆందోళనలు రేకెత్తాయి. ఈ ప్రతికూలాంశాలు దేశీయ మెటల్‌ స్టాక్స్‌ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో

ఆర్‌ఈసీ చేతికి పీఎఫ్‌సీనా? పీఎఫ్‌సీ చేతికి ఆర్‌ఈసీనా?

Wednesday 5th December 2018

కేంద్ర ప్రభుత్వం తొలిగా ఆర్‌ఈసీ చేత పీఎఫ్‌సీని కొనుగోలు చేయించాలని భావించింది. అయితే ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) చేత రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ)ను కొనుగోలు చేయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీని వల్ల కేంద్రానికి రూ.14,000 కోట్లు లభించొచ్చని ప్రముఖ ఆంగ్ల పత్రిక తెలియజేసింది. కాగా ఈ కొనుగోలు ప్రతిపాదినకు క్యాబినెట్‌ ఆమోదం లభించాల్సి ఉంది. డిసెంబర్‌ 5 ఈ విషయంపై స్పష్టత

Most from this category