టాటా మోటార్స్ మళ్లీ వెలిగిపోతుంది: అగర్వాల్
By Sakshi

టాటా మోటార్స్ స్టాక్ ఈ ఏడాది 40 శాతం తగ్గిపోయింది. టాటా గ్రూపులో భాగమైన ఈ బ్లూచిప్ కంపెనీ ఇలా పడిపోవడంతో చాలా మందికి భవిష్యత్తుపై సందేహాలు తలెత్తాయి. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి వారిలో ఉంది. అయితే, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకుడు రామ్‌దియో అగర్వాల్ మాత్రం టాటా మోటార్స్ పతనం కేవలం ధరల పరంగా జరిగిందేనని, దాని అంతర్గత విలువ తగ్గిపోవడం వల్ల కాదని, తిరిగి వెలుగులోకి వస్తుందని తెలియజేశారు. ఈ స్టాక్‌తోపాటు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను కూడా ఆయన సిఫారసు చేశారు. ఈ ఏడాది మొదట్లో టాటా మోటార్స్‌లో రూ.10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, దాని విలువ ఇప్పుడు (జూలై 6 నాటికి) రూ.6,339గా ఉండేది. సెన్సెక్స్ కంపెనీల్లో బాగా నష్టపోయిన వాటిలో ఇదీ ఒకటి. 36 శాతం కరెక్షన్కు గురైంది. గతేడాది డిసెంబర్ 29న ఈ స్టాక్ ధర రూ.431.20. ఈ ఏడాది జూలై 6న రూ.273.35. దేశీయ అమ్మకాలు తగ్గడం, అదే సమయంలో యూరోప్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం వంటి పరిణామాలు ప్రభావం చూపించాయి. అయినప్పటికీ ఆందోళన చెందక్కర్లేదని, ఇది శాశ్వత విలువను కోల్పోవడం కాదని అంటున్నారు అగర్వాల్. కేవలం ధరల పరంగా నష్టపోవడమేనని తేల్చేశారు. కంపెనీ తిరిగి విలువను సంతరించుకుంటుందని చెప్పారు. ఓ కంపెనీ వ్యాపార విలువ తుడిచిపెట్టుకుపోవడం కారణంగా స్టాక్ ధర పతనం అవడాన్ని పర్మినెంట్ క్యాపిటల్ నష్టంగా పేర్కొంటారు. అదే కొటేషనల్ లాస్ అన్నది ఓ కంపెనీ వ్యాపార విలువ చెక్కుచెదరకపోయినప్పటికీ, స్టాక్ ధర పతనం కావడం. టాటా మోటార్స్‌లో కరెక్షన్ను కొటేషనల్ లాస్గానే అగర్వాల్ పేర్కొన్నారు. విలువ ఏకపక్షంగా తగ్గిపోవడంతో కొనుగోలుకు అద్భుతమైన అవకాశమని వాటాదారులకు అగర్వాల్ సూచించారు. ‘‘టాటా మోటార్స్‌ను గమనిస్తే ప్రాథమికంగా ఇది ధరల పరంగా నష్టమే. ఎందుకంటే దీనికి విస్తృతమైన ఫ్రాంచైజీ నెట్వర్క్ ఉంది. విలువ తిరిగి సంతరించుకుంటుంది. మార్కెట్ వాటాను పెంచుకోవడంలో టాటా మోటార్స్ ఇటీవలి కాలంలో చాలా దూకుడుగా ఉంది. మేం ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయకపోయినప్పటికీ, కేవలం ధరల పరంగా దిద్దుబాటే ఇది. తిరిగి విలువను సంతరించుకుంటుంది’’ అని పేర్కొన్నారు. అధిక చమురు ధరలతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్ల ధరలు కూడా ఈ ఏడాది ఇప్పటి వరకు 40 శాతం వరకు పడిపోయాయని, చూస్తుంటే ఇది కూడా కొటేషనల్ లాస్గానే కనిపిస్తోందన్నారు. ‘‘ఓఎంసీల ఫ్రాంచైజీ బలంగా ఉంది. ప్రభుత్వం మూడింట ఒక వంతు లాభాన్నే ప్రభావితం చేయగలదు. కానీ, నిరాశావాద వాతావరణంలో మార్కెట్లు అసహజంగానే స్పందిస్తాయి’’ అని అగర్వాల్ వివరించారు.
You may be interested
పన్ను రిటర్నుల్లో ఈ ఆదాయాన్ని విస్మరించొద్దు
Wednesday 11th July 2018ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారిలో చాలా మంది తమకు వచ్చే కొన్ని ఆదాయాలను రిటర్నుల్లో వెల్లడించరు. బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీ, బాండ్లు, పలు పోస్టాఫీసు పథకాలపై వచ్చే ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ‘ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్’ అనే సెక్షన్లో ఈ ఆదాయాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. కానీ రిటర్నులు దాఖలు చేసే వారిలో 80 శాతం మంది ఈ ఆదాయాన్ని చూపించకపోవడం వాస్తవ పరిస్థితిని తెలియజేస్తోంది.
స్టాక్ ఎంపికకు మార్కెట్ క్యాప్‌తో పనేంటి?
Tuesday 10th July 2018మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఈ ఏడాది ధరల పరంగా ఎక్కువ దిద్దుబాటుకు గురయ్యాయి. అంతకుముందు వరుసగా మూడేళ్ల పాటు ఇవి భారీ ర్యాలీ చేశాయి మరి. కార్పొరేట్ గవర్నెన్స్ అంశాలు, కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం, ఎఫ్ఐఐల అమ్మకాలు ఇలా ఎన్నో అంశాలు కరెక్షన్ వెనుక ఉన్నాయి. కొనుగోలుకు మంచి అవకాశంగా భావించిన మార్కెట్ పార్టిసిపెంట్స్ మాత్రం బాగా పడిపోయిన స్మాల్, క్యాప్ స్టాక్స్‌లో విలువైన వాటి కోసం