STOCKS

News


మార్కెట్‌ ర్యాలీకి 5 కారణాలు

Friday 2nd November 2018
Markets_main1541143588.png-21663

- ఇంట్రాడేలో 600 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌
- 10,584 పాయింట్లకు చేరిన నిఫ్టీ
- 1.80 శాతం మేర లాభాలు

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్‌లో శుక్రవారం బుల్‌ రంకెలు వేసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 600 పాయింట్లకు మించి లాభాలను నమోదుచేసింది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయానికి సెన్సెక్స్‌ 601 పాయింట్లు (1.72 శాతం) లాభంతో 35,032 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయానికి నిఫ్టీ 182 పాయింట్లు (1.76 శాతం) లాభంతో 10,562 దగ్గర ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 10,584 పాయింట్ల గరిష్టస్థానికి నమోదుచేసింది. మొన్నటి వరకు భారీ పతనాలకు, ఒడిదుడుకులకు లోనైన సూచీలు శుక్రవారం ఇంతటి లాభాలను నమోదుచేయడానికి ప్రధానంగా 5 కారణాలు ఉన్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు చెబుతున్నాయి. అవేంటంటే..

మార్కెట్‌కు జోష్‌ ఇచ్చిన ట్రంప్‌ ట్వీట్‌
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో గురువారం ఫోన్‌లో మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. జిన్ పింగ్‌తో ఒక మంచి, సుదీర్ఘ సంభాషణ జరిగిందని ట్వీట్‌లో పేర్కొన్న ట్రంప్‌.. వాణిజ్య అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు ట్వీట్‌ ఇచ్చారు. ఉత్తర కొరియా అంశంపై కూడా చర్చించామని వెల్లడించారు. త్వరలోనే అర్జెంటీనాలో జరగనున్న జీ-20 సమావేశానికి సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయని ట్రంప్‌ వెల్లడించిన నేపథ్యంలో మార్కెట్లలో సానుకూల వాతావరణం అలుముకుంది. వాణిజ్య యుద్ధ భయాలు తొలగనున్నాయనే పాజిటీవ్‌ అంశంతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఈ ఉదయం ఒక శాతానికి మించి లాభాల్లో ముగిశాయి. ఆసియా సూచీలు 3 శాతం మేర లాభాలను నమోదుచేశాయి. 

ఒక్కసారిగా పతనమైన క్రూడ్‌ ధరలు
క్రమంగా ముడిచమురు ధరలు దిగివస్తున్నాయి. గడిచిన ఐదు సెషన్లలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 6 శాతం మేర పతనమైంది. అత్యధి స్థాయిలో క్రూడ్‌ను ఉత్పత్తి చేస్తున్న దేశాల నుంచి సప్లై పెరిగిన కారణంగా బ్యారెల్‌ బ్రెంట్‌ ధర ఒకస్థాయిలో 72.65 డాలర్లకు దిగివచ్చింది. సరిగ్గా నెల కిందట ఈధర 86 డాలర్లుగా ఉన్న విషయం తెలిసిందే. ఇంతటి భారీ పతనం నేపథ్యంలో ఈరోజు బీపీసీఎల్‌ ఆరున్నర శాతానికి మించి లాభ పడింది. ఐఓసీ 5 శాతం, హెచ్‌పీసీఎల్‌ 4 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి.

పడిపోయిన బాండ్‌ ఈల్డ్‌
వడ్డీ రేట్లు పెంపునకు అటు అమెరికా, ఇటు భారత్‌ స్పీడు తగ్గించిన నేపథ్యంలో బాండ్‌ ఈల్డ్‌ దిగివస్తోంది. గత నెలలో 8 శాతం వద్ద ఉన్నటువంటి 10 ఏళ్ల బెంచ్‌మార్క్‌ బాండ్‌ ఈల్డ్‌.. ఇవాళ 7.79 శాతానికి పడిపోయింది. ఈ సానుకూల అంశం ప్రధాన సూచీలకు మరింత ఉత్సాహానిచ్చింది.

ఒక్కసారిగా బలపడిన రూపాయి
సరిగ్గా నెల రోజుల కిందట 74 వద్దకు పడిపోయిన రూపాయి మారకం విలువ శుక్రవారం ప్రారంభంలో 35 పైసలు బలపడింది. ఇంటర్‌ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో 73.10 దగ్గర ప్రారంభమయ్యింది. డాలరు విలువ బలహీనపడడం, ముడిచమురు ధరలు ఒక్కసారిగా పతనం కావడం వంటి సానుకూల అంశాలతో రూపాయి 73 స్థాయికి సమీపించింది. ఈ అంశం సూచీలకు ప్రోత్సాహానిచ్చిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

రూ.లక్ష కోట్లకు జీఎస్‌టీ వసూళ్లు
అక్టోబర్‌లో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు రూ. 1,00,710 కోట్లకు చేరుకున్నాయి. ఐదు నెలల తర్వాత మళ్లీ లక్షకోట్లు దాటాయి. పండుగల సీజన్, పన్ను ఎగవేత నిరోధక చర్యల తీవ్రతరం వంటి అంశాల నేపథ్యంలో వసూళ్లు ఈస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటున నెలకు లక్ష కోట్ల జీఎస్‌టీ వసూళ్లు జరగాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం కాగా, ఇందుకు అనుగుణంగా వసూళ్లు ఊపందుకోవడంతో మార్కెట్‌లో బుల్స్‌ బలాన్ని పుంజుకున్నాయి. 



You may be interested

26 రెట్లు పెరిగిన డీఎల్‌ఎఫ్‌ లాభం

Friday 2nd November 2018

రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో 26 రెట్లు పెరిగింది. గత క్యూ2లో రూ.14 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.375 కోట్లకు పెరిగిందని డీఎల్‌ఎఫ్‌ తెలిపింది. అనుబంధ కంపెనీల, జాయింట్‌ వెంచర్ల కార్యకలాపాల ద్వారా రూ.239 కోట్ల లాభం వచ్చిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.1,751 కోట్ల నుంచి రూ.2,305 కోట్లకు పెరిగిందని పేర్కొంది. గుర్గావ్‌లో కమర్షియల్‌ ప్రాజెక్ట్‌

ఏవియేషన్‌కు ఈ ఏడాది కష్టమే: క్రిసిల్‌

Friday 2nd November 2018

- 2018-19లో భారీ నష్టాలు రావచ్చు - దశాబ్ద కాలంలోనే ఇదే అత్యధికం - ధరల పెంపుతో బయటపడే అవకాశం - రేటింగ్స్‌ సంస్థ క్రిసిల్‌ నివేదిక ముంబై: ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలు మూటగట్టుకోనున్నాయని రేటింగ్స్‌ సంస్థ క్రిసిల్‌ అంచనా వేసింది. ఇంధన ధరలు గరిష్ట స్థాయికి చేరడం, రూపాయి విలువ జీవిత కాలంలోనే కనిష్ట స్థాయికి పడిపోవడం నష్టాలకు కారణాలుగా తెలిపింది. విమాన టికెట్‌ చార్జీలను 12 శాతం

Most from this category