STOCKS

News


సెన్సెక్స్‌ లాభం 718 పాయింట్లు

Monday 29th October 2018
Markets_main1540808968.png-21567

34 వేల పైకి సెన్సెక్స్‌
10250 మార్కును అందుకున్న నిప్టీ

ముంబై:- ప్రభుత్వరంగ బ్యాంకు, ఫార్మా షేర్ల ర్యాలీ అండతో సూచీలు సోమవారం భారీగా లాభపడ్డాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి సాగిన కొనుగోళ్లకు అంతర్జాతీయ సానుకూల పరిస్థితులు తోడవ్వడంతో సెన్సెక్స్‌ 34 వేల మార్కును, నిఫ్టీ 10250 మార్కును అందుకున్నాయి.  చివరకు సెన్సెక్స్‌ 718 పాయింట్ల లాభంతో 34067 వద్ద నిఫ్టీ 221 పాయింట్లు పెరిగి 10250 వద్ద ముగిశాయి. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ 538 పాయింట్లు లాభపడి  24,959.70 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలకు చెందిన ఇండెక్స్‌లు లాభాలతోనే ముగిశాయి. అత్యధికంగా ప్రభుత్వరంగ ఇండెక్స్‌ 8శాతం లాభపడింది.
సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ లాభాల షురా..!
ఆసియా మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్‌ను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ గతవారం నష్టాల ముగింపు స్వస్తి పలుకుతూ నేడు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగిరావడం కూడా సూచీల లాభాల ప్రారంభానికి మరో కారణమైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200 పాయింట్ల లాభంతో 33,550 వద్ద, నిఫ్టీ 48 పాయింట్ల పెరుగుదలతో 10,078 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికి స్వల్ప నష్టాల్లోకి సూచీలు జారుకున్నప్పటికీ, వెనువెంటనే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సూచీలు అటుపై స్థిరమైన ర్యాలీని చేశాయి.
10250 పాయింట్లకు నిఫ్టీ:-
ఆరంభలాభాలను అందిపుచ్చుకున్న సూచీలు ప్రభుత్వ రంగ బ్యాంక్‌, ఫార్మా షేర్ల ర్యాలీ అండతో మిడ్‌సెషన్‌ సమయాని కల్లా సెన్సెక్స్‌ 500 పాయింట్ల లాభాల్ని  ఆర్జించగా, నిఫ్టీ 150 పాయింట్ల పెరిగి 10150 పాయింట్లను అందుకున్నాయి. బాండ్ల కొనుగోలు ద్వారా బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి ఈ నవంబర్‌లో రూ.40 వేల కోట్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు శుక్రవారం ఆర్‌బీఐ ప్రకటించింది. మరోవైపు దివాలా చట్టం అమలు ద్వారా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో రూ.1.80లక్షల కోట్ల ఎన్‌పీఎలు రికవరీ కాగలని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఈ సానూకూల అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల ప్రభుత్వ బ్యాంకింగ్‌ షేర్లు భారీ ర్యాలీ చేశాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 8.50శాతం లాభపడింది. చివరకు 8శాతం లాభంతో 2,778.40 వద్ద ముగిసింది. మరో ఫార్మా షేర్లలో అధిక వెయిటేజ్‌ కలిగిన సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, దివీస్‌ ల్యాబ్స్‌ షేర్ల ర్యాలీ అండతో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ ఇంట్రాడేలో 4శాతం లాభపడింది. చివరకు 5శాతం లాభంతో 9,590.40 వద్ద ముగిసింది. మిడ్‌ సెషన్‌ అనంతరం మెదట నష్టాలతో ప్రారంభమైన యూరప్‌ మార్కెట్ల క్రమంగా లాభాల్లోకి మళ్లడం, చివరి గంటలో ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్లకు పూనుకోవడం తదితర సానుకూలాంశాలు కలిసొచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్‌ సూచీ 806 పాయింట్ల లాభంతో 34,154 వద్ద నిఫ్టీ సూచీ 245 పాయింట్ల లాభంతో 10,275 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. చివరకు సెన్సెక్స్‌ 34,067 వద్ద, నిఫ్టీ సూచీ 10,250 వద్ద స్థిరపడింది.
తీపెక్కిన షుగర్‌ షేర్లు:-
ఇండియన్‌ షుగర్‌ మానుఫ్యాక్చర్స్‌ అసోసియేట్స్‌(ఐఎస్‌ఐఏ) వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో చక్కెర ఉత్పత్తి అంచనాలను 35.5 మిలియన్‌ టన్నుల నుంచి 32 టన్నులకు తగ్గించడంతో ఇంట్రాడేలో షుగర్స్‌ ర్యాలీ చేశాయి. చక్కెర ఉత్పత్తి తగ్గనుండంతో చక్కెర షేర్లు ర్యాలీ చేయవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోళ్లకు తెరలేపారు. ఫలితంగా ఇంట్రాడేలో చక్కెర షేర్లు 12శాతం ర్యాలీ చేశాయి.
వెలుగులోకి విద్యుత్‌ షేర్లు:-
అదానీ, ఎస్సార్‌, టాటా పవర్‌ కంపెనీల విద్యుత్‌ కొనుగోలు ఒప్పంద సవరణలకు గల అభ్యంతరాలకు వచ్చే 8వారాల్లోగా తమకు తెలియజేయాలని సెంట్రల్‌ ఎలక్ట్రిసిటి రెగ్యూలేటరీ కమీషన్‌ను సుప్రీం కోర్టు ఆదేశించండంతో ఈ కంపెనీల షేర్లు నేడు వెలుగులోకి వచ్చాయి. అదానీ పవర్‌ అత్యధికంగా 20శాతం, టాటా పవర్‌ 14శాతం లాభపడ్డాయి. బీఎస్‌ఈలో విద్యుత్‌ సూచీ ఇంట్రాడేలో 2.50శాతం ర్యాలీ చేసింది.
12శాతం లాభపడిన ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు:-
ప్రస్తుత ఆర్థిక సంవత్సంతరం రెండో త్రైమాసిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకోవడంతో  ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు షేరు ఇంట్రాడేలో 12శాతం లాభపడి రూ.351.90ల గరిష్టాన్ని అందుకుంది. క్యూ2లో ఐసీఐసీఐ బ్యాంక్‌ నికర లాభం 56శాతం క్షీణించి రూ. 909 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 12 శాతం వృద్ధి చెంది రూ.6417 కోట్లను ఆర్జించింది. నికర వడ్డీ మార్జిన్లు 3.19 శాతం నుంచి 3.33 శాతానికి పెరిగాయి. ఎన్‌పీఏలు 8.81 శాతం నుంచి 8.54 శాతానికి తగ్గాయి.  చివరకు 11శాతం లాభంతో రూ.350ల వద్ద ముగిసింది. నేడు నిఫ్టీ ఆర్జించిన మొత్తం పాయింట్లలో ఒ‍క్క ఐసీఐసీఐ బ్యాంకు షేరువే 57 పాయింట్ల కావడం విశేషం.
 భారతీఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, ఐషర్‌ మోటర్స్‌, ఇండస్‌ఇండ్‌ షేర్లు 1.50శాతం నుంచి 2.50శాతం నష్టపోగా, డాక్టర్‌రెడ్డీస్‌, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండియబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు 6నుంచి 12.50శాతం లాభపడ్డాయి.



You may be interested

మార్కెట్‌ గమనం ఎటు?

Tuesday 30th October 2018

నిఫ్టీ 200 పాయింట్ల ర్యాలీతో కనిష్ట స్థాయిని నమోదు చేసిందా? లేక ఇంకా పడిపోతుందా? అన్న సందేహం చాలా మందికి ఉంది. మరి సమీప కాలంలో సూచీల కదలికలు ఎలా ఉంటాయన్న దానిపై నిపుణుల అభిప్రాయాలు చూద్దాం.    నిఫ్టీ రోజువారీ చార్ట్‌ 2018లో రెండు టాప్‌లను సూచిస్తోంది. ఈ ఏడాది జనవరి 29న 11,130 ఒకటి కాగా, ఆగస్ట్‌ 28న 11,738 మరొకటి. ఇక ఈ ఏడాది ఆరంభంలో మార్కెట్‌ 38

క్యు2 ఎర్నింగ్స్‌ ఎలా ఉన్నాయ్‌?

Monday 29th October 2018

సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల విశ్లేషణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీలు మిశ్రమ ఫలితాలు ప్రకటించాయి. - ఇప్పటివరకు నిఫ్టీ 50లో 27 కంపెనీలు క్యు2 రిజల్ట్స్‌ వెలువరించాయి. - ఇందులో 16 కంపెనీల ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉండగా ఐదు కంపెనీలు అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించాయి. - ఆరు కంపెనీలు పేలవ ఫలితాలిచ్చాయి. ఈ దఫా అంచనాలను అందుకోని ఫలితాలు ప్రకటించినవాటిలో ఫైనాన్షియల్‌ సేవల రంగాలకు చెందిన

Most from this category