STOCKS

News


39 శాతం పెరిగిన ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లాభం

Friday 19th April 2019
Markets_main1555651831.png-25218

- రూ.247 కోట్లకు నికర లాభం 
- ఒక్కో షేర్‌కు రూ.2.70 మధ్యంతర డివిడెండ్‌ 
- రూ.3,500 కోట్లు సమీకరణ

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 39 శాతం పెరిగింది. అంతకుముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.178 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ4లో రూ.247 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం రూ.812 కోట్ల నుంచి 41 శాతం వృద్ధితో రూ.1,148 కోట్లకు పెరిగిందని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తెలిపింది. నికర వడ్డీ ఆదాయం రూ.500 కోట్ల నుంచి 48 శాతం వృద్ధితో రూ.739 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ 4.10 శాతం నుంచి 4.23 శాతానికి ఎగబాకింది.
సమస్యాత్మక సంవత్సరమైనా....!  
గత ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్‌ రంగానికి చాలా సమస్యాత్మకమని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ విశ్వవీర్‌ అహుజా వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, పటిష్టమైన వృద్ధి జోరును కొనసాగించామన్నారు. ‘‘కొన్ని విభాగాల్లో మంచి పనితీరు కనబరిచాం. రుణ నాణ్యత మెరుగుపడింది. ఒక్కో షేర్‌కు రూ.2.70 మధ్యంతర డివిడెండ్‌ను ఇస్తున్నాం. వివిధ సెక్యూరిటీల జారీ ద్వారా రూ.3,500 కోట్లు సమీకరించనున్నాం’’ అని చెప్పారాయన.
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.635 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 37 శాతం వృద్ధితో రూ.739 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం రూ.2,835 కోట్ల నుంచి 40 శాతం వృద్ధితో రూ.3,982 కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం రూ.383 కోట్ల నుంచి 46 శాతం వృద్ధితో రూ.560 కోట్లకు పెరగ్గా... స్థూల మొండి బకాయిలు 1.40 శాతం నుంచి 1.38 శాతానికి, నికర మొండి బకాయిలు 0.78 శాతం నుంచి 0,69 శాతానికి తగ్గాయి.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేర్‌ 0.7 శాతం నష్టంతో రూ.676 వద్ద ముగిసింది. ఏడాది కాలంలో ఈషేర్‌ 33 శాతం లాభపడింది. 
----
 



You may be interested

ఆన్‌లైన్‌ రిటైల్‌... ఆకాశమే హద్దు!!

Friday 19th April 2019

- 2030 నాటికి 170 బిలియన్‌ డాలర్లకు - ప్రస్తుత మార్కెట్‌ 18 బిలియన్‌ డాలర్లు - సౌకర్యం, తగ్గింపు ధరలు సానుకూలతలు - ఒక్కో షాపర్‌ నుంచి రూ.12,800: జెఫ్రీస్‌ ముంబై: దేశ ఆన్‌లైన్‌ రిటైల్‌ మార్కెట్‌ చాలా వేగంగా ప్రగతి సాధిస్తోందని, 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 170 బిలియన్‌ డాలర్లకు విస్తరిస్తుందని జెఫ్రీస్‌ నివేదిక పేర్కొంది. కాంపౌండెడ్‌గా 23 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం దేశ వ్యవస్థీకృత రిటైల్‌

జెట్ ‍బిడ్డింగ్ విజయవంతమవుతుంది

Friday 19th April 2019

- రుణదాతల ఆశాభావం - షేరు 32 శాతం పతనం న్యూఢిల్లీ:  ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌లో వాటాల విక్రయానికి సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియ విజయవంతమవుతుందని రుణాలిచ్చిన సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయి. "సంస్థ విలువను సముచితంగా, పారదర్శకంగా మదింపు చేసేలా బిడ్ ప్రక్రియ విజయవంతం అవుతుందని రుణదాతలు ఆశావహంగా ఉన్నారు" అని బ్యాంకర్ల కన్సార్షియం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. దాదాపు రూ. 8,000

Most from this category