STOCKS

News


ఆర్‌బీఐ సమీక్ష, క్యూ3 ఫలితాలే కీలకం..!

Monday 4th February 2019
Markets_main1549261733.png-23996

- గురువారం ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం...
- నికాయ్‌ సర్వీసెస్‌ పీఎంఐ డేటా ఈవారంలోనే..
- టాటా మోటార్స్‌, కోల్‌ ఇండియా, లుపిన్‌, సిప్లా క్యూ3 ఫలితాలు
- అమెరికా ఉద్యోగల గణంకాలు, జీడీపీపై దృష్టి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ప్రభావం ఈవారంలో కూడా మార్కెట్‌పై ఉండనుందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రభావం కొనసాగనున్నప్పటికీ.. ఫిబ్రవరి 7న వెల్లడికానున్న ఆర్‌బీఐ ఆరవ ద్వైమాసిక పాలసీ సమీక్ష నిర్ణయం దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనుందని భావిస్తున్నారు. ఈ ప్రధాన అంశానికి తోడు అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక అంశాల వెల్లడి, క్యూ3 గణాంకాలపై ఈవారం ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు ఎస్సెల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఐఓ విరల్‌ బెరవాలా విశ్లేషించారు. విదేశీ నిధుల ప్రవాహం కూడా ఈవారంలో కీలక పాత్ర పోషిందనుందని చెప్పారాయన. ‘కేంద్ర ప్రభుత్వ పరిమిత ద్రవ్యోల్బణ వైఖరిని బడ్జెట్‌ వెల్లడించిన నేపథ్యంలో ప్రత్యేకించి గ్రామీణ వ్యవసాయ రంగం.. రిటైల్, గృహా రుణాల కార్పొరేట్ ఆదాయాలు పెరిగేందుకు అవకాశం ఉంది.’ అని ఎమ్కే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఆర్థికవేత్త ధనన్జయ్ సిన్హా పేర్కొన్నారు.

వడ్డీ రేట్లు తగ్గేనా..?
2018–19 ఆర్థిక సంవత్సరానికి ఆరవ ద్వైమాసిక పాలసీ సమీక్షను ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఫిబ్రవరి 7న (గురువారం) ప్రకటించనుంది. మంగళవారం నుంచి గురువారం వరకు జరిగే ఈ మూడు రోజుల సమావేశంలో కీలక వడ్డీ రేట్లు తగ్గేందుకు అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. ప్రస్తుతం సీఆర్‌ఆర్‌ 4 శాతం, రెపో రేటు 6.5 శాతం వద్ద ఉండగా.. ద్రవ్యోల్బణం తగ్గిన కారణంగా వడ్డీ రేట్లలో పావు శాతం మేర కోత ఉండేందుకు అవకాశం ఉందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ గోల్డ్‌మాన్‌ శాక్స్‌ అంచనావేసింది. మరోవైపు.. ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంతదాస్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి సమావేశంలో ‘తటస్థ’ వైఖరి వెల్లడికానుందని, జూన్‌ సమావేశంలో వడ్డీ రేట్లకోత ఉండవచ్చని భావిస్తున్నట్లు రాయిటర్స్‌ సర్వేలో వెల్లడైంది.

ఫార్మా ఫలితాలు..
పలు దిగ్గజ ఫార్మా కంపెనీలు ఈవారంలో వెల్లడికానున్నాయి. బుధవారం లుపిన్‌ సిఫ్లా.. గురువారం అరబిందో ఫార్మా, కాడిలా హెల్త్‌కేర్‌ క్యూ3 గణాంకాలను ప్రకటించనున్నాయి. ఇతర దిగ్గర కంపెనీల్లో సోమవారం (4న) కోల్‌ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్‌, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఫలితాలను ప్రకటించనుండగా.. మంగళవారం (5న) టెక్ మహీంద్రా, గెయిల్, హెచ్‌పీసీఎల్, ఏసీసీ, బీహెచ్ఈఎల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, డీఎల్ఎఫ్, అపోలో టైర్స్, టాటా గ్లోబల్, డిష్ టీవీ గణాంకాలు వెల్లడికానున్నాయి. బుధవారం (6న) అదానీ పోర్ట్స్, అదానీ పవర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అలహాబాద్ బ్యాంక్‌.. గురువారం (7న) టాటా మోటార్స్‌, బ్రిటానియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, కాఫీ డే, గ్రాసిమ్ ఫలితాలు వెల్లడికానున్నాయి. శుక్రవారం (8న) మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్‌హెచ్‌పీసీ, బీపీసీఎల్‌, ఇంజనీర్స్ ఇండియా ఫలితాలను ప్రకటించనున్నాయి.

స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి
నికాయ్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ జనవరి డేటా మంగళవారం వెల్లడికానుంది. అంతర్జాతీయ అంశాల పరంగా.. అమెరికా  ఉద్యోగ గణంకాలు, జీడీపీ గణాంకాలు, పర్చేజ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ ఈవారంలోనే వెల్లడికానున్నాయి. వీటితోపాటు అమెరికా–చైనా వాణిజ్య యుద్ద అంశం, వెనిజులాలో సంక్షోభం వంటి అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశాలతో ముడిపడి.. ముడిచమురు, రూపాయి కదలికలు ఆధారపడి ఉండగా.. ఈ ప్రభావం మార్కెట్‌పై ఉండనుందని తెలిపారు. గత నెల్లో 30 శాతం పతనాన్ని నమోదుచేసిన బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌.. మళ్లీ ఎగువస్థాయిల వైపు ప్రయాణం కొనసాగిస్తున్నాయి. 62 డాలర్ల సమీపానికి చేరుకున్నాయి. ధరలు మరింత పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉన్న నేపథ్యంలో ఈ కదలికలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ‘క్రూడ్‌ ధరలు పెరిగిన కారణంగా డాలరుతో రూపాయి మారకం విలువ 71 వద్దకు చేరుకుంది. 70.80 వద్ద ఉన్నటువంటి కీలక నిరోధాన్ని రూపాయి విలువ చేధించిన నేపథ్యంలో ఆ తరువాత రెసిస్టెన్స్‌ 72.60 వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. సమీపకాలంలో రూపాయి విలువపై ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కీలక మద్దతు స్థాయి 70.40–69.90 వద్ద కొనసాగుతోంది.’ అని అబియన్స్ గ్రూప్ చైర్మన్ అభిషేక్ బన్సల్ విశ్లేషించారు.
ఎఫ్‌ఐఐల నికర విక్రయాలు..
గత నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.5,300 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.5,264 కోట్లు, డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.97 కోట్లను జనవరిలో వెనక్కి తీసుకున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా.. ఎఫ్‌పీఐలు వేచిచూసే వైఖరిని ప్రదర్శిస్తున్నారని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం చీఫ్‌ వినోద్‌ నాయర్‌ వ్యాఖ్యానించారు.You may be interested

వడ్డీరేట్లు యథాతథమే..!

Monday 4th February 2019

- తటస్థ విధానానికి మారొచ్చు... - ఆర్‌బీఐ పాలసీ సమీక్షపై నిపుణుల అంచనా... - ఈ నెల7న నిర్ణయం... న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం తగ్గుదల నేపథ్యంలో ఈ వారంలో జరిగే ద్వైమాసిక సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ .. పాలసీ రేట్లను క్రమానుగతంగా కఠినతరం చేసే విధానం నుంచి తటస్థ విధానానికి మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు రేట్ల పెరుగుదల, ద్రవ్యలోటుపరమైన సవాళ్ల కారణంగా కీలక పాలసీ రేట్లను తగ్గించకపోవచ్చని చెబుతున్నారు.

అడాగ్‌ షేర్లకు ఆర్‌కామ్‌ దెబ్బ..!

Monday 4th February 2019

రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ షేర్ల భారీ పతనం అడాగ్‌ షేర్లను నష్టాల బాట పట్టించింది.  దివాళా పరిష్కార ప్రక్రియకు జాతీయ కంపెనీ లా ట్రెబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)ను ఆశ్రయించడంతో నేడు ఆర్‌కామ్‌ షేరు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఏకంగా 48శాతం నష్టపోయిన సంగతి తెలిసిందే. ఆర్‌కామ్‌ పతనం దెబ్బకు అడాగ్‌ కంపెనీలో దాదాపు షేర్లనీ 52-వారాల కనిష్టానికి చేరుకున్నాయి. ఈ గ్రూప్‌ కంపెనీలోని రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ నావెల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, రిలయన్స్‌

Most from this category