STOCKS

News


ఫలితాలు, రూపాయి కదలికలే కీలకం..!

Monday 15th October 2018
Markets_main1539581584.png-21154

ముంబై: శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తరువాత వెల్లడైన సీపీఐ, ఐఐపీ డేటా సోమవారం మార్కెట్‌ దిశపై ప్రభావం చూపనుందని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు అంచనావేస్తున్నారు. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు 4.3 శాతంగా నమోదైంది. గడిచిన మూడు నెలల కాలంలో అత్యంత కనిష్ట స్థాయికి చేరుకుంది. ఐఐపీ గణాంకాలు నిరాశపరచగా.. సెప్టెంబర్‌ వినియోగ ధరల సూచీ  (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం సైతం ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. ఈ ఏడాది ఆగస్టులో  3.69 శాతంగా నమోదైన సీపీఐ.. గతనెలలో స్వల్పంగా పెరిగి 3.77 శాతంగా నమోదయ్యింది. ఈ డేటా ప్రభావం సోమవారం మార్కెట్‌ కదలికలపై ప్రభావం చూపనుందని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ అన్నారు. 15న (సోమవారం) విడుదలకానున్న సెప్టెంబరు టోకు ధరల ఆధారిత సూచీ(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం ఆధారంగా ఈరోజు మార్కెట్‌ కదలికలు ఉండవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఇక గురువారం (అక్టోబరు 18న) దసరా పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవు ఉండగా.. ఈ వారంలో ట్రేడింగ్‌ 4 రోజులకే పరిమితంకానుంది.   

ఆర్‌ఐఎల్‌, ఇన్ఫీ క్యూ2 ఫలితాలపై ఫోకస్‌..
ఈ వారంలో వెల్లడయ్యే పలు బ్లూచిప్‌ కంపెనీల జులై–సెప్టెంబర్‌ త్రైమాసిక (క్యూ2) ఫలితాలు ఆశాజనకంగా ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. మొత్తం 71 కంపెనీలు ఈవారంలో ఫలితాలను ప్రకటించనున్నాయి. అక్టోబరు 15న (సోమవారం) ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఫలితాలను వెల్లడించనుండగా.. మంగళవారం ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌, హీరోమోటో కార్ప్‌ ఫలితాలను ప్రకటించనున్నాయి. బుధవారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ఫలితాలను వెల్లడించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలు శనివారం వెల్లడికానున్నాయి. ఈవారంలో వెల్లడికానున్న ఫలితాలు మార్కెట్‌ దిశకు అత్యంత కీలకంగా ఉన్నాయని హెమ్‌ సెక్యూరిటీస్‌ విశ్లేషకులు ప్రతీక్‌ జైన్‌ అన్నారు. క్యూ2 ఫలితాల నేపథ్యంలో ఫండమెంటల్స్‌ అంచనాలకు అనుగుణంగా ఉన్నాయని ముస్తఫా నదీమ్‌ పేర్కొన్నారు.

ఫెడ్‌ మినిట్స్‌ ప్రభావం..
బుధవారం వెల్లడికానున్న అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) సెప్టెంబరు 25-26 సమావేశానికి సంబంధించిన మినిట్స్ మార్కెట్లకు అత్యంత కీలకంగా ఉందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధన విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. అమెరికా–చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం, పెరుగుతున్న ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ, ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా రాజకీయ అనిశ్చితి వంటి ప్రతికూల అంశాలు మార్కెట్‌ దిశపై స్వల్పకాలంలో ప్రతికూల ప్రభావం చూపవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. 

రూపాయి కదలికలపై దృష్టి..
ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌  మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం ఒకేరోజు 55 పైసలు లాభపడింది. గడచిన మూడు వారాల్లో ఒకేరోజు రూపాయి ఇంతలా రికవరీ సాధించడం ఇదే తొలిసారి కాగా, గతవారం చివరి మూడురోజుల్లో మొత్తంగా 82 పైసలు బలపడింది. ఈ నెల 11న చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.48 వద్దకు పతనమైనప్పటికీ.. వారంతాన మళ్లీ కోలుకుని 73.52 స్థాయికి చేరుకుంది. మరోవైపు బ్యారెల్‌ బ్రెంట్‌ ముడిచమురు ధర శుక్రవారం 80.50 వద్ద స్థిరపడింది. ఈ రెండు అంశాలు మార్కెట్‌కు ఇప్పుడు అత్యంత కీలకంగా మారిపోగా.. క్రూడ్‌ ధరలు ఏమాత్రం పెరిగినా, డాలరు విలువ బలపడి రూపాయి పతనమైనా మార్కెట్‌కు ఇది ప్రతికూలంగా మారుతుందని ఫండమెంటల్‌ నిపుణులు భావిస్తున్నారు.

ఎఫ్‌ఐఐల నికర విక్రయాలు... 
గడిచిన రెండువారాల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) భారత మార్కెట్‌ నుంచి రూ.26,600 కోట్లను వెనక్కు తీసుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. అక్టోబర్‌ 1–12 కాలంలో రూ.17,935 కోట్లను ఈక్విటీ మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్న వీరు.. రూ.8,645 కోట్లను డెట్‌ మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతుండడం.. పెరిగిన ముడిచమురు ధరలు, బలపడిన డాలరు విలువ కారణంగా ఎఫ్‌పీఐలు తమ పెట్టుబడులను భారత మార్కెట్‌ నుంచి వెనక్కు తీసుకుంటున్నారని ఫండ్స్‌ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ రీసెర్చ్‌ హెడ్‌ విద్యా బాలా పేర్కొన్నారు. ఈ అంశాలకు తోడు ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ కూడా విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా నిలవడానికి మరో ప్రధాన కారణంగా బజాజ్‌ క్యాపిటల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అలోక్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

రూ.లక్ష కోట్ల మార్కెట్‌ క్యాపిటల్‌ ఆవిరి
గడిచిన వారంలో టాప్‌-10 కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (ఎం క్యాప్‌) రూ.1,07,026 కోట్లు ఆవిరైపోయింది. మార్కెట్‌ క్యాప్‌లో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ.8 లక్షల కోట్ల మార్కును కోల్పోయింది. గతవారం ట్రేడింగ్‌లో రూ.85,330 కోట్లు నష్టపోయి రూ.7,19,857 వద్దకు పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(క్యూ1)లో కంపెనీ నికర లాభం రూ.7,360 కోట్లుగా నమోదుకాగా, శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో టీసీఎస్‌ షేరు ధర 3.03% నష్టంతో రూ.1,920 వద్ద ముగిసింది. ఇక మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.18,697 కోట్లు ఆవిరై రూ.2,96,635 కోట్లకు చేరింది. ఐటీసీ ఎం క్యాప్‌ రూ.2,999 కోట్లు నష్టపోయి రూ.3,36,285 కోట్లుకు పడిపోయింది. మార్కెట్‌ క్యాప్‌ పెరిగిన కంపెనీలలో.. ఆర్‌ఐఎల్‌ ఎం క్యాప్‌ రూ.48,524 కోట్లు పెరిగి రూ.7,13,966 కోట్లకు చేరుకుంది. కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎం క్యాప్‌ రూ.2,23,005 కోట్లకు, మారుతీ రూ.2,20,006 కోట్లకు చేరుకోగా.. ఎస్‌బీఐ ఎం క్యాప్‌ రూ.2,35,029 కోట్లకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.5,37,729 కోట్లకు, హెచ్‌డీఎఫ్‌సీ రూ.2,94,247 కోట్లకు, హిందుస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్‌ క్యాప్‌ రూ.3,39,557 కోట్లకు చేరుకున్నాయి. 


ఈ వారం ఈవెంట్స్‌
15        సోమ    సెప్టెంబరు డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 
17        బుధ    ఫెడ్‌ మినిట్స్‌ వెల్లడి
17        బుధ    ఆర్‌ఐఎల్‌ క్యూ2 ఫలితాలు
18        గురు    ‘దసరా పండుగ’ సెలవు
19        శుక్ర    చైనా క్యూ3 జీడీపీ డేటా
 

 You may be interested

ఖాతాదారులకు ఎస్‌బీఐ పండగ ఆఫర్లు

Monday 15th October 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పండుగ సీజన్ సందర్భంగా తమ ఖాతాదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. తమ యోనో (యూ ఓన్లీ నీడ్‌ వన్‌) యాప్ ద్వారా షాపింగ్ చేసినవారికి అదనంగా డిస్కౌంట్లు, క్యాష్‌ బ్యాంక్ అందిస్తున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 16-21 మధ్యలో ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో యోనో యాప్ ద్వారా షాపింగ్ చేస్తే 10 శాతం దాకా

డేటా లోకలైజేషన్‌కి నేటితో గడువు పూర్తి

Monday 15th October 2018

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు భారత్‌లోని తమ కస్టమర్లు నిర్వహించే లావాదేవీల డేటాను దేశీయంగానే స్టోర్ చేయాలంటూ (డేటా లోకలైజేషన్‌) రిజర్వ్ బ్యాంక్ విధించిన గడువు సోమవారంతో ముగుస్తోంది. ఆర్‌బీఐ దీన్ని మళ్లీ పొడిగించే అవకాశాలేమీ లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. డేటా లోకలైజేషన్‌ నిబంధనలను అమలు చేయడానికి అంతర్జాతీయ పేమెంట్ కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన ఆరు నెలల గడువు అక్టోబర్ 15తో ముగియనుంది. దేశీ సంస్థలు ఇందుకు

Most from this category