STOCKS

News


క్రూడ్‌, విదేశీ పెట్టుబడులు కీలకం

Monday 19th November 2018
Markets_main1542604804.png-22170

ముంబై: చమురు ధరలు, విదేశీ నిధుల ప్రవాహం ఈ వారం మార్కెట్‌ పయనాన్ని నిర్ణయించనున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం ఏ విధంగా ఉంటుంది? లిక్విడిటీ సమస్య నివారణకు ఆర్‌బీఐ సోమవారం (ఈ నెల 19న) నాటి భేటీలో తీసుకునే నిర్ణయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్రాల ఎన్నికల ప్రభావంతో ఒడిదుడుకులు ఉంటాయని భావిస్తున్నారు. ‘‘రూపాయి కదలిక, చమురు ధరలు, విదేశీ పెట్టుబడులను ఇన్వెస్టర్లు గమనించాల్సి ఉంటుంది. నిఫ్టీ 10,500-10,900 మధ్య ట్రేడ్‌ కావొచ్చు. బ్యాంకు నిఫ్టీ 25,800-26,600 పాయింట్ల మధ్య చలించొచ్చు’’ అని ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అడ్వైజర్స్‌ చైర్మన్‌, ఎండీ డీకే అగర్వాల్‌ తెలిపారు. అధిక నిల్వలు, ప్రపంచ ఆర్థిక వృద్ధి నిదానించొచ్చన్న ఆందోళనలతో గత వారం చమురు బ్యారెల్‌ 67.74 డాలర్లకు పడిపోయింది. అక్టోబర్‌ ప్రారంభంలో 86 డాలర్లు ఉండగా, చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గడంతో ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటుపై ఆందోళనలు తగ్గి, మన స్టాక్‌ మార్కెట్లలో రికవరీకి దారితీసింది. ప్రపంచంలో మన దేశం మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న విషయం తెలిసిందే. గత వారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,502 కోట్ల మేర విలువైన షేర్లను కొన్నారు. అంతకముందు వారంతో పోలిస్తే 22 రెట్లు అధికం. గత వారంలో రూపాయి 57 పైసలు లాభపడి 71.92కు చేరింది. ‘‘ఆదాయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో తగ్గుతాయన్న విషయాన్ని మార్కెట్లు ఇప్పటికే సర్దుబాటు చేసుకున్నాయి. అయితే, నిఫ్టీ కీలకమైన 10,700 పాయింట్లను బ్రేక్‌ చేసి పైకి వెళుతుందా? రూపాయి, చమురు ధరల్లో స్థిరత్వం అన్నవి మార్కెట్‌ దిశను నిర్దేశిస్తాయి’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌నాయర్‌ పేర్కొన్నారు. ఈ వారం నిఫ్టీకి 10,755 పాయింట్లు నిరోధంగా, 10,440 పాయింట్లు మద్దతు స్థాయిగా పనిచేస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జసాని తెలిపారు.
ఎఫ్‌పీఐల పెట్టుబడులు బిలియన్‌ డాలర్లు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఈ నెలలో ఇప్పటి వరకు దేశీయ క్యాపిటల్‌ మార్కెట్లలో నికరంగా రూ.8,285 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. అక్టోబర్‌లో రూ.38,900 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్న తర్వాత తిరిగి వారు నికర పెట్టుబడిదారులగా మారడం గమనార్హం. సెప్టెంబర్‌లోనూ ఈక్విటీ, డెట్‌ మార్కెట్లో కలిపి ఎఫ్‌పీఐలు రూ.21,000 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఇక ఈ నెల 16వ తేదీ వరకు చూస్తే... ఈక్విటీల్లో రూ.3,862 కోట్లు, డెట్‌ విభాగంలో రూ.4,423 కోట్ల మేర నికరంగా పెట్టుబడులు పెట్టారు. చమురు ధరలు తగ్గడంతోపాటు డాలర్‌తో రూపాయి రికవరీ కావడం, లిక్విడిటీ పరిస్థితులు మెరుగుపడడం ఎఫ్‌పీఐల తాజా పెట్టుబడులకు కారణాలుగా మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ ఇండియా సీనియర్‌ అనలిస్ట్‌ హిమాన్హు శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఈ ఏడాది మిగిలిన కాలంలో ఎఫ్‌పీఐల నిధులు గణనీంయగా వస్తాయని తాను భావించడం లేదన్నారు. డాలర్‌తో రూపాయి, చమురు ధరలు, రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, తర్వాత వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలను ఎఫ్‌పీఐలు జాగ్రత్తగా పరిశీలిస్తారని పేర్కొ‍న్నారు. 



You may be interested

ప్రభుత్వరంగ బ్యాంకుల నష్టాలు మూడింతలు

Monday 19th November 2018

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసికంలో 21 ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీ) నష్టాలు మూడున్నర రెట్లు పెరిగి రూ.14,716 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో పీఎస్‌బీల నష్టాలు రూ.4,284 కోట్లుగానే ఉండడం గమనార్హం. త్రైమాసికం వారీగా చూస్తే... జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరు కాస్తంత మెరుగైంది. జూన్‌ క్వార్టర్లో రూ.16,615 కోట్ల మేర పీఎస్‌బీలు నష్టాలు చవిచూశాయి. వీటితో పోలిస్తే సెప్టెంబర్‌

పీనోట్‌ పెట్టుబడులు రూ.66,587 కోట్లు

Monday 19th November 2018

న్యూఢిల్లీ: పార్టిసిపేటరీ నోట్స్‌ ద్వారా మన క్యాపిటల్‌ మార్కెట్లలోకి వచ్చే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తగ్గుతూనే ఉన్నాయి.  సెబీ గణాంకాలను పరిశీలిస్తే పీనోట్‌ పెట్టుబడులు (ఈక్విటీ, డెట్‌, డెరివేటివ్స్‌) ఈ ఏడాది సెప్టెంబర్‌ చివరి నాటికి రూ.79,548 కోట్లుగా ఉండగా, అక్టోబర్‌ చివరి నాటికి రూ.66,587 కోట్లకు తగ్గిపోయాయి. తొమ్మిదేళ్ల కాలంలోనే 2009 మార్చి తర్వాత ఇది కనిష్ట స్థాయి కావడం గమనార్హం. రిజిస్ట్రేషన్‌ చేసుకోని విదేశీ ఇన్వెస్టర్లు మన

Most from this category