STOCKS

News


పంచదార స్టాక్స్‌తో ఎల్‌ఐసీకి లాభాల మిఠాయి

Sunday 21st April 2019
Markets_main1555868876.png-25254

వ్యాల్యూ ఇన్వెస్టర్‌ అనిల్‌కుమార్‌ గోయల్‌, ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ పంచదార స్టాక్స్‌లో పెట్టుబడులతో భారీ లాభాలను మూటగట్టుకున్నాయి!. గతేడాది షుగర్‌ స్టాక్స్‌లో గోయల్‌ అదే పనిగా పెట్టుబడులు పెడుతూ వచ్చారు. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు, బ్రెజిల్‌లో ఉత్పత్తి తగ్గడం పంచదార స్టాక్స్‌ ఫిబ్రవరి-మార్చి మధ్య ర్యాలీ జరపడానికి కారణమయ్యాయి. 26 షుగర్‌ కంపెనీల్లో 22 కంపెనీలు 40 శాతం వరకు పెరిగాయి. అయితే అంతకుముందు అంటే 2018 జనవరి నుంచి 2019 ఫిబ్రవరి 18 మధ్య ఈ షేర్లు భారీ నష్టాలను కూడా ఇచ్చాయన్న అంశాన్ని మర్చిపోరాదు. 

 

గోయల్‌తో పాటు ఎల్‌ఐసీకీ షుగర్‌ స్టాక్స్‌లో పెద్ద ఎత్తునే పెట్టుబడులు ఉన్నాయి. ఒక్క గోయల్‌కే డిసెంబర్‌ త్రైమాసికం చివరి నాటికి రూ.250 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. త్రివేణి ఇంజనీరింగ్‌, ఉత్తమ్‌ షుగర్‌, ద్వారికేష్‌ షుగర్‌, ధంపూర్‌ షుగర్‌, అవధ్‌ షుగర్‌ రెండు నెలల్లోనే 10 నుంచి 30 శాతం మధ్య పెరిగాయి. గోయల్‌ అవధ్‌ షుగర్‌లో వాటాలను 4 శాతానికి పెంచుకోగా, ధంపూర్‌ షుగర్‌లో 14.2 శాతం, ద్వారికేష్‌ షుగర్‌లో 6.20 శాతం చొప్పున వాటాలు స్థిరంగా ఉన్నాయి. ఎల్‌ఐసీ పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో సర్‌ షాదిలాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఈఐడీ ప్యారీ, బలరామ్‌పూర్‌ చినీ మిల్స్‌, దాల్మియా భారత్‌ 40 శాతం వరకూ పెరిగాయి. ‘‘మహారాష్ట్రలో రానున్న సీజన్‌లో ఉత్పత్తి తగ్గుతుందన్న అంచనాలు, కనీస మద్దతు ధర కిలోకు రూ.31.50కు పెరుగుతుందన్న ఆశాభావం షుగర్‌ స్టాక్స్‌ ర్యాలీకి కారణం. కొన్ని కంపెనీలు షేర్ల బైబ్యాక్‌ దిశగా తీసుకున్న నిర్ణయాలు ఆయా కౌంటర్లలో సెంటిమెంట్‌ను మెరుగుపరిచాయి’’ అని యస్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ అమర్‌అంబానీ పేర్కొన్నారు. బలరామ్‌పూర్‌ చినీ ఏప్రిల్‌ 5న బైబ్యాక్‌ నిర్ణయం తీసుకుంది. ఒక్కో షేరును రూ.148 చొప్పున 84 లక్షల షేర్లను బైబ్యాక్‌ చేయనుంది. 

 

పంచదార మిల్లులు చెరకు రైతుల బకాయిలను చెల్లించేందుకు గాను రూ.10,540 కోట్ల సాఫ్ట్‌లోన్స్‌కు కేంద్రం ఫిబ్రవరిలో తీసుకున్న నిర్ణయం సైతం పంచదార షేర్ల ర్యాలీకి తోడ్పడ్డాయి. బ్రెజిల్‌లో తక్కువ ఉత్పత్తి పంచదార స్టాక్స్‌కు ఇక ముందూ మద్దతుగా నిలుస్తుందంటున్నారు విశ్లేషకులు. ‘‘బ్రెజిల్‌ పంచదార ఉత్పత్తి తక్కువగానే ఉండనుంది. దీంతో రానున్న రోజుల్లోనూ పంచదార ధరలు స్థిరంగా కొనసాగుతాయి. ఇథనాల్‌ ఉత్పత్తి పాలసీలో చేసిన మార్పులతో పంచదార మిల్లులు అవసరమైతే తమ నిల్వలను నియంత్రించుకునే అవకాశం కలుగుతుంది’’ అని మార్కెట్‌ నిపుణుడు అంబరీష్‌ బలిగ పేర్కొన్నారు. బలరామ్‌పూర్‌ చినీ మిల్స్‌, కేసీపీ షుగర్‌ స్టాక్స్‌ పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. బ్రెజిల్‌లో పంచదార ఉత్పత్తి తగ్గడానికి కారణం అక్కడ ఇథనాల్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేయడమే. అక్కడ విక్రయించే పెట్రోల్‌లో 25 శాతం ఇథనాల్‌ కలపాలన్నది అక్కడి విధానం. మన ప్రభుత్వం సైతం పంచదార నిల్వలు, ధరలకు అనుగుణంగా ఇథనాల్‌ ఉత్పత్తికి అవకాశం కల్పించడం పంచదార కంపెనీలకు సానుకూలించనుంది. అయితే, ఈక్వినామిక్స్‌ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ వ్యవస్థాపకులు జి.చొక్కలింగం మాత్రం బేరిష్‌నెస్‌ ప్రకటించారు. దేశీయ మార్కెట్లో అధిక సరఫరా పరిస్థితులు ఇంకా ముగియలేదని, కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి కొసాగుతుందన్నారు. దీంతో రైతుల బకాయిలు తీర్చడం కష్టమవుతుందన్నారు. వచ్చే సంవత్సరం ఉత్పత్తి 35 శాతం తగ్గకపోతే, ఈ స్టాక్స్‌ పట్ల బేరిష్‌ అని పేర్కొన్నారు.You may be interested

భారీ నష్టంతో ఆరంభం

Monday 22nd April 2019

మూడు రోజుల విరామం అనంతరం ప్రారంభమైన మార్కెట్‌ సోమవారం భారీ నష్టంతో ప్రారంభమైంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బ్యాంకింగ్‌, అటో షేర్ల పతనం ఇందుకు కారణమైంది. సెన్సెక్స్‌ 100 పాయింట్లు పతనమైన 39, 040 వద్ద నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 11,727.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈవారంలో పలు కీలక కంపెనీలు తమ క్యూ4 ఫలితాలను ప్రకటించనుండం, సాదారణం ఎన్నికల్లో భాగంగా రేపు(మంగళవారం) పలు రాష్ట్రాల్లో​3వ విడుతలో 116 లోక్‌సభ

ఐపీవోకు రెండు కంపెనీలు

Sunday 21st April 2019

నియోజెన్‌ కెమికల్స్‌ రూ.132 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ఈ వారంలోనే ఐపీవోకు రానుంది. బుధవారం ఇది ప్రారంభమవుతుంది. తాజా ఇష్యూ పరిమాణం రూ.70 కోట్లు. ప్రమోటర్లు హరిదాస్‌ తకర్షి కనాని, బీనా హరిదాస్‌ కనాని 29 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ధరల శ్రేణి రూ.212-215.    నియోజెన్‌ కంపెనీ ఆర్గానిక్‌ కెమికల్‌ కాంపౌండ్స్‌, బ్రోమిన్‌ కాంపౌండ్స్‌, ఇతర ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ అయిన క్లోరిన్‌, ఫ్లోరిన్‌, ఐయోడిన్‌ తదితర రసాయనాలను ఫార్మాస్యూటికల్స్‌, ఆగ్రోకెమికల్‌,

Most from this category