STOCKS

News


మైండ్‌ట్రీపై మైండ్‌గేమ్‌!!

Tuesday 19th March 2019
Markets_main1552978060.png-24686

– పట్టు కోసం వ్యవస్థాపకుల యత్నాలు
– టేకోవర్‌ కోసం ఎల్‌అండ్‌టీ వ్యూహాలు
– ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటన
– 1 బిలియన్‌ డాలర్లపైగా వ్యయం 

    ఐటీ సంస్థ మైండ్‌ట్రీ కోసం ఇటు వ్యవస్థాపకులు, అటు దిగ్గజ సంస్థ ఎల్‌అండ్‌టీ మధ్య పోరు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. కంపెనీపై పట్టు కోల్పోకుండా చూసుకునేందుకు ఇటు వ్యవస్థాపకులు ప్రయత్నిస్తుండగా..  టేకోవర్‌ చేసేందుకు అటు ఎల్‌అండ్‌టీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీంతో కంపెనీ చేజారిపోకుండా కాపాడుకునేందుకు మైండ్‌ట్రీ వ్యవస్థాపకుల్లో ఒకరైన సుబ్రతో బాగ్చీ.. తాజాగా (మార్చి 17న) ఒడిషా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పదవికి రాజీనామా చేసి వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. ’మైండ్‌ట్రీని బలవంతంగా టేకోవర్‌ చేసే ముప్పు ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వ పదవికి రాజీనామా చేసి, కంపెనీని కాపాడుకునేందుకు వెళ్లక తప్పడం లేదు. చెట్టును (ట్రీ) నరికేసి ఆ స్థానంలో షాపింగ్‌ మాల్‌ కట్టేందుకు బుల్‌డోజర్లు, రంపాలతో వచ్చిన వాళ్ల నుంచి కంపెనీని కాపాడుకోవాల్సి ఉంది’ అంటూ ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. మరోవైపు, వ్యవస్థాపకుల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ.. సంస్థను కొనుగోలు చేసేందుకు (హోస్టైల్‌ టేకోవర్‌) ఎల్‌అండ్‌టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం దాదాపు 1 బిలియన్‌ డాలర్లు వెచ్చించాలని కంపెనీ భావిస్తోంది. ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటిస్తున్నట్లు సోమవారం ఎక్సే‍్ఛంజీలకు కూడా ఎల్‌అండ్‌టీ తెలిపింది. ఒకవేళ మైండ్‌ట్రీని గానీ ఎల్‌అండ్‌టీ చేజిక్కించుకోగలిగిందంటే.. దేశీ ఐటీ రంగంలో ఇది తొలి హోస్టైల్‌ టేకోవర్‌ కానుంది. 

ఎల్‌అండ్‌టీ ఆఫర్‌ ...
మైండ్‌ట్రీలో అతిపెద్ద వాటాదారైన వీజీ సిద్ధార్థ నుంచి సుమారు 20.32 శాతం వాటాలను రూ. 3,269 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ఎల్‌అండ్‌టీ పేర్కొంది. ఇది పూర్తి నగదు డీల్‌గా ఉంటుంది. ఇక, ఓపెన్ ఆఫర్‌లో షేరు ఒక్కింటికి రూ. 980 రేటు చొప్పున 31 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం సుమారు రూ. 5,030 వెచ్చించనుంది. ఈ ఆఫర్‌కు యాక్సిస్‌ క్యాపిటల్, సిటీగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా సంస్థలు మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
మొత్తం మీద మైండ్‌ట్రీలో 51 శాతం వాటాల కొనుగోలు కోసం ఎల్‌అండ్‌టీ దాదాపు 1 బిలియన్‌ డాలర్లు పైగా (సుమారు రూ. 7,000 కోట్లు) వెచ్చించినట్లవుతుంది. మరోవైపు, టేకోవర్‌ యత్నాలను ఎదుర్కొనేందుకు వ్యవస్థాపకులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సిద్ధార్థ నుంచి వాటాలను బైబ్యాక్‌ చేయడంపైనా దృష్టి పెడుతున్నారు. ఇందుకోసం గత రెండు నెలలుగా కేకేఆర్, బేరింగ్‌ ఏషియా, క్రిస్‌క్యాపిటల్‌ తదితర ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నారు. అయితే, ఇవి పెద్దగా ముందుకు సాగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇందుకు మూడు ప్రధాన కారణాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. కంపెనీ యాజమాన్య అధికారాన్ని ఎక్కువగా వదులుకునేందుకు వ్యవస్థాపకులు సిద్ధంగా లేకపోవడం, ఎల్‌అండ్‌టీ ఇచ్చే ఆఫర్‌కి దీటుగా చాలా మటుకు ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్లు నిధులు వెచ్చించే అవకాశాలు లేకపోవడం ఇందులో ఉన్నాయి. ఇక ఏకంగా రూ. 1.2 లక్షల కోట్ల దిగ్గజమైన ఎల్‌అండ్‌టీతో పోరాటమంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం కూడా పీఈ ఇన్వెస్టర్లు అంతగా ముందుకు రాకపోవడానికి కారణమన్నట్లుగా తెలుస్తోంది. 

టేకోవర్‌కు బీజం..
1999లో సుబ్రతో బాగ్చీ, అశోక్‌ సూతా, నమకల్‌ పార్థసారథి, కృష్ణకుమార్‌ నటరాజన్, స్కాట్‌ స్టేపుల్స్‌ తదితరులు 10 మంది కలిసి మైండ్‌ట్రీ కన్సల్టింగ్‌ సంస్థను ఏర్పాటు చేశారు. 2000లో అమాల్గమేటెడ్‌ హోల్డింగ్స్‌కి చెందిన వీజీ సిద్ధార్థ నుంచి తొలి విడతగా కొంత మేర పెట్టుబడులు సమీకరించారు. 2008లో మైండ్‌ట్రీ కన్సల్టింగ్‌ పేరు మైండ్‌ట్రీగా మారింది. 2011లో వ్యవస్థాపక చైర్మన్‌ అశోక్‌ సూతా రాజీనామా చేసినప్పుడు ఆయన వాటాలను కూడా కొనుగోలు చేసిన సిద్ధార్థ.. అతి పెద్ద షేర్‌హోల్డర్‌గా మారారు. 2018లో మైండ్‌ట్రీ డైరెక్టర్‌ పదవి నుంచి తప్పుకున్న సిద్ధార్థ.. తన వాటాలను విక్రయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఐటీæ కార్యకలాపాల విభాగం (ఎల్‌అండ్‌టీ  ఇన్ఫోటెక్‌ –ఎల్‌టీఐ) కూడా ఉన్న ఎల్‌అండ్‌టీ అప్పుడే ఇతర సంస్థల కొనుగోలు ప్రయత్నాల్లో ఉండటంతో.. దీనిపైనా దృష్టి సారించింది. ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ ఏఎం నాయక్‌తో సిద్ధార్థ చర్చలు కూడా జరిపారు. మిగతా వ్యవస్థాపకులను కూడా ఒప్పించగలిగితే.. మరింత అధిక రేటు ఇస్తామంటూ నాయక్‌ ఆఫర్‌ ఇవ్వడంతో.. సిద్ధార్థ ఆ ప్రయత్నాలూ చేశారు. కానీ, వ్యవస్థాపకులు ఇందుకు ఇష్టపడటం లేదు. రెండు సంస్థల నిర్వహణ తీరు, పని సంస్కృతిలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని వారు భావిస్తుండటమే ఇందుకు కారణం. ఇవే కారణాలతో సంస్థాగత ఇన్వెస్టర్లు, క్లయింట్లు, ఉద్యోగులు ఈ డీల్‌పై విముఖంగా ఉన్నారంటూ ఇటీవలే ఎల్‌అండ్‌టీ బోర్డుకు కూడా వారు లేఖ రాసినట్లు సమాచారం. 

రెండూ కలిస్తే...
దాదాపు 1 బిలియన్‌ డాలర్ల ఆదాయాలు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. క్లౌడ్, బిగ్‌ డేటా వంటి కొంగొత్త టెక్నాలజీల్లో నైపుణ్యాలు మైండ్‌ట్రీకి ప్లస్‌పాయింట్స్‌గా ఉండటంతో .. ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ (ఎల్‌టీఐ) దీనిపై ఆసక్తిగా కనపరుస్తోంది. ఎల్‌టీఐ నికర విలువ దాదాపు రూ. 4,387 కోట్లుగా ఉండగా.. 2018 డిసెంబర్‌ ఆఖరు నాటికి సంస్థ దగ్గర సుమారు రూ. 2,032 కోట్ల మేర నగదు, లిక్విడ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉన్నాయి. మైండ్‌ట్రీలో 51 శాతం వాటాలు దక్కించుకున్న పక్షంలో.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే ఎల్‌టీఐకి అదనంగా మైండ్‌ట్రీ నుంచి రూ. 460 కోట్ల దాకా లాభాలు దఖలుపడతాయి. రెండూ కలిశాయంటే.. ఆదాయాలు 1.7 బిలియన్‌ డాలర్ల దాకా ఉంటాయని అంచనా. తద్వారా దేశీ ఐటీలో ఆరు పెద్ద సంస్థ ఏర్పాటైనట్లవుతుంది. రెండింటికీ అమెరికా, యూరప్‌లే ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి. టెక్నాలజీ, మీడియా, సర్వీసెస్‌ విభాగాల్లో మైండ్‌ట్రీ పటిష్టంగా ఉండటం.. ఎల్‌టీఐకి లాభించనుంది. మైండ్‌ట్రీ మొత్తం వ్యాపారంలో డిజిటల్‌ వాటా 49.5 శాతం కాగా ఎల్‌టీఐకి 37 శాతమే ఉంది. అంతేకాకుండా ఉద్యోగిపై సగటు ఆదాయాన్ని చూస్తే ఎల్‌టీఐ కన్నా మైండ్‌ట్రీదే పైచేయిగా ఉంది. మైండ్‌ట్రీకి ప్రస్తుతం 19,908 మంది ఉద్యోగులు, 340 మంది క్లయింట్స్‌ ఉన్నారు. 

వ్యవస్థాపకులకు 13 శాతం వాటాలు...
ప్రస్తుతం ప్రమోటర్ల గ్రూప్‌లో భాగమైన బాగ్చీ, పార్థసారథి, నటరాజన్, మైండ్‌ట్రీ సీఈవో రోస్టో రవనన్‌ తదితరులకు 13 శాతం వాటాలు ఉన్నాయి. నటరాజన్‌కు 3.72 శాతం, పార్థసారథికి 1.43 శాతం, రవనన్‌కు 0.71 శాతం, బాగ్చీకి 3.1 శాతం వాటాలు ఉన్నాయి. 



You may be interested

ఎస్సార్‌ స్టీల్‌ టేకోవర్‌కు షరతులతో కూడిన ఆమోదం

Tuesday 19th March 2019

 తెలిపిన ఎన్‌సీఎల్‌టీ -తదుపరి విచారణ ఈ నెల 27న  న్యూఢిల్లీ: ఎస్సార్‌ స్టీల్‌ టేకోవర్‌కు ఆర్సెలర్‌ మిట్టల్‌ కంపెనీకి ఎన్‌సీఎల్‌టీ షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. దీంతో  స్వదేశంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్న బిలియనీర్‌ లక్ష్మీ మిట్టల్‌ చిరకాల స్వప్నం సాకారం కానున్నది. దివాళా ప్రక్రియను ఎదుర్కొంటున్న ఎస్సార్‌ స్టీల్‌ టేకోవర్‌ కోసం ఆర్సెలర్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్‌ అండ్‌ సుమిటొమో మెటల్‌ కార్ప్‌లు రూ.42,000 కోట్ల ఆఫర్‌ను ఇచ్చాయి. ఎస్సార్‌ స్టీల్‌

ఫేమ్ పథకం అమలుకు ప్రత్యేక కమిటీ

Tuesday 19th March 2019

- భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి సారథ్యంలో ఏర్పాటు న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల తయారీ, వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్‌-2 పథకం అమలును పర్యవేక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా అంతర్‌-మంత్రిత్వ శాఖల కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. నీతి ఆయోగ్ సీఈవో, పారిశ్రామిక ప్రోత్సాహం.. అంతర్గత వాణిజ్య వ్యవహారాల విభాగం కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శితో పాటు విద్యుత్‌..

Most from this category