STOCKS

News


పతనమవుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌... ఏంటి కర్తవ్యం?

Monday 3rd September 2018
Markets_main1535915248.png-19889

జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ ఏడాది ఆరంభంలో రూ.870 స్థాయిలో ఉంది. తాజాగా ఇది రూ.282 స్థాయికి దిగొచ్చింది. సుమారు 68 శాతం షేరు విలువ ఐస్‌ ముక్కలా కరిగిపోయింది. ఇందులో వాటాదారులు ఈ మేర తమ సంపదను కోల్పోయారు. విమానయాన రంగంలో మొదటి నుంచి ఉన్న ప్రైవేటు కంపెనీగా, అంతర్జాతీయ రూట్లలో ముందు నుంచీ సర్వీసులు నడుపుతూ ప్రముఖ ఎయిర్‌లైన్‌గా ఉన్న జెట్‌ ఎయిర్‌ వేస్‌ షేరు ఈ స్థాయిలో పతనం అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ, ఏ కంపెనీ అయినా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్వహణ తీరులో మార్పులు చేస్తూ, సరైన అడుగులు వేయకపోతే కచ్చితంగా సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని ఎన్నో ఉదాహరణలు దేశ కార్పొరేట్‌ చరిత్రలో ఉన్నాయి. అయితే, జెట్‌ ఎయిర్‌ వేస్‌ తిరిగి మంచి రోజులను చూస్తుందా లేక మునిగిపోతుందా అన్నది కొంత కాలానికి తెలుస్తుంది. ఈ స్టాక్‌ విషయంలో విశ్లేషకులు, నిపుణుల అభిప్రాయాలను ఇన్వెస్టర్లు తెలుసుకోవడం ఎంతైనా మంచిది.

 

చమురు ధరలు పెరిగిపోవడం ఒక కారణంగా చెబుతున్నారు. పోటీ సంస్థలైన ఇండిగో, స్పైస్‌జెట్‌ సంస్థలు (ఈ రెండూ లిస్టెడ్‌ కంపెనీలే) పనితీరు ఇంత దారుణంగా లేదు మరి. ఇక కార్పొరేట్‌ గవర్నెన్స్‌ కూడా జెట్‌ ఎయిర్‌వేస్‌ దుస్థితికి కారణమన్నది విశ్లేషణ ఉంది. ఇది తీవ్రమైన అంశమే. ఎందుకంటే యాజమాన్యం పరంగా వైఫల్యమే ప్రస్తుత పరిస్థితికి ఎక్కువ కారణంగా కనిపిస్తోంది. ‘‘ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌తో భాగస్వామ్యం కూడా జెట్‌ ఎయిర్‌వేస్‌ పనితీరును దెబ్బతీసింది. ప్రమోటర్లు నిధులు నొక్కేశారన్న ఆరోపణలపై కార్పొరేట్‌ శాఖ తాజాగా దర్యాప్తునకు ఆదేశించడం, జూన్‌ త్రైమాసిక ఫలితాల వెల్లడి వాయిదా పడడం, ఆడిట్‌ కమిటీ చైర్మన్‌ ఫలితాలకు ముందు రాజీనామా చేయడం కార్పొరేట్‌ గవర్నెన్స్‌పై ప్రశ్నలను లేవనెత్తుతోంది’’ అని నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినీత్‌ శర్మ పేర్కొన్నారు.

 

మార్చి క్వార్టర్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌ రూ.1,045 కోట్లు, జూన్‌ క్వార్టర్‌లో రూ.1,323 కోట్ల మేర నష్టాలను ప్రకటించింది. బలహీన నిర్వహణ తీరు, అధిక ఇంధన వ్యయాలు కారణమని కంపెనీ నివేదికే తెలియజేస్తుంది. ఎబిటా 98 శాతం పడిపోయింది. ఇంధన ధరలు పెరగడానికి తోడు, విదేశీ మారకం రూపంలో నష్టాలను కూడా కంపెనీ జూన్‌ క్వార్టర్‌లో ఎదుర్కొంది. కానీ, జూన్‌ త్రైమాసికంలో స్పైస్‌జెట్‌ రూ.38 కోట్ల నష్టాలను ప్రకటించింది. దీనికంటే ముందు మార్చి క్వార్టర్‌లో ‍స్పైస్‌జెట్‌ రూ.46 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇక ఇండిగో జూన్‌ క్వార్టర్లో రూ.28 కోట్లు, మార్చి క్వార్టర్లో రూ.117 కోట్ల మేర లాభాలను నమోదు చేసుకుంది. ఇంధన వ్యయాల సెగ ఇతర ఎయిర్‌లైన్‌ కంపెనీలపైనా ఉంది. కాకపోతే జెట్‌ ఎయిర్‌వేస్‌ విషయంలో ఇతర అంశాలు కూడా తోడవడం భారీ నష్టాలకు దారితీసింది. పోటీ సంస్థలైన స్పైస్‌జెట్‌, ఇండిగో నుంచి జెట్‌ఎయిర్‌వేస్‌ తీవ్రంగా పోటీని ఎదుర్కొంటోంది. బ్యాలన్స్‌ షీటులో రుణ భారం పెరిగిపోవడం, చెల్లింపులు కష్టం కావడం వంటి అంశాలూ ఉన్నాయి. ఇక, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ సబ్సిడరీ అయిన గోద్రేజ్‌ బిల్డ్‌కాన్‌కు, జెట్‌ ఎయిర్‌వేస్‌కు మధ్య ఒప్పందంపై ఆదాయపన్ను శాఖ విచారణ చేస్తుందన్న వార్త కూడా బయటకు వచ్చింది. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ ఒప్పందంలో భాగంగా జెట్‌ ఎయిర్‌వేస్‌కు రూ.1,725 కోట్లు ముట్టాయన్నది ఆరోపణ.

 

ఇన్ని అంశాల నేపథ్యంలో జెట్‌ఎయిర్‌వేస్‌ మరికొంత దిద్దుబాటుకు గురికావచ్చని కొందరు విశ్లేషకులు అంటుంటే, బోటమ్‌ అవుట్‌ సమీపంలో ఉందన్నది మరికొందరి అభిప్రాయం. ‘‘రెండేళ్లలో రుణాలను తగ్గించుకోవడం, రూ.2,000 కోట్ల మేర వ్యయ నియంత్రణలతో కంపెనీ ప్రణాళికను ప్రకటించినప్పటికీ, ఈ స్టాక్‌ బోటమింగ్‌ అవుట్‌కు మరికొంత సమయం పడుతుందన్నది మా అభిప్రాయం’’ అని హేమ్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ ఆస్థాజైన్‌ పేర్కొన్నారు. ఈ స్టాక్‌ రూ.260 స్థాయిని బ్రేక్‌ చేస్తే రూ.200-210 స్థాయి వరకు జారొచ్చని, తాజా పొజిషన్‌ తీసుకునే వారు కాస్త వేచి చూడడం మంచిదని ఆమె సూచించారు. ఈ స్టాక్‌ గత నెల 10న రూ.261.60 వద్ద కనిష్ట స్థాయిని నమోదు చేసి 8 శాతం పైన చలిస్తోంది. ఈ స్టాక్‌ వీక్లీ ట్రెండ్‌ లైన్‌, ఆర్‌ఎస్‌ఐ ప్రకారం ఓవర్‌సోల్డ్‌ జోన్‌లో ఉందని, ఈ స్థాయి నుంచి స్టాక్‌ పైకి వెళ్లొచ్చని, అధిక అమ్మకాల జోన్‌కు వెళ్లిన ప్రతీసారీ స్టాక్‌కు బలమైన పుల్‌బ్యాక్‌ ర్యాలీ ఉంటుందని మెహతా ఈక్విటీస్‌ ఏవీపీ రీసెర్చ్‌ ప్రశాంత్‌ తాప్సే పేర్కొన్నారు. ‘‘జెట్‌ ఎయిర్‌వేస్‌ లాభాలను ఆర్జించడం కష్టమే. నష్టాలు పెరిగిపోతూ, అధిక రుణాలున్న స్థితిలో నిధులు వెచ్చించడం ద్వారా టర్న్‌ అరౌండ్‌ కావడం కష్టమే’’ అని ఐడీబీఐ క్యాపిటిల్‌ మార్కెట్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఏకే ప్రభాకర్‌ అభిప్రాయపడ్డారు.



You may be interested

విదేశాల్లో క్రెడిట్‌ కార్డులు వాడడం మంచిది కాదా?

Monday 3rd September 2018

క్రెడిట్‌ కార్డు ఎక్కడైనా పనిచేసే సాధనమే. దేశంలోనే కాదు, విదేశాలకు వెళ్లినప్పుడు సైతం ఇది మంచి సాధనమే. కానీ, క్రెడిట్‌ కార్డు సేవలు ఉచితం అయితే కాదు. ఎక్కడ పడితే అక్కడ వాడితే చార్జీలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే క్రెడిట్‌ కార్డు వాడే వారు తప్పకుండా చార్జీల గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎందుకైనా మంచిది.   విదేశాల్లో ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌ ఎక్కడ క్రెడిట్‌ కార్డును వినియోగించినా గానీ నెట్‌వర్క్‌ ఆధారిత చార్జీలను

ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు... కొన్ని విషయాలు

Monday 3rd September 2018

తపాలా శాఖ పేమెంట్స్‌ బ్యాంకు కార్యకలాపాలు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ నెల 1న మొదలయ్యాయి. ఇంటి వద్దకే బ్యాంకింగ్‌ సేవలను పోస్ట్‌మ్యాన్‌ల ద్వారా అందిస్తామని ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు ప్రకటించింది. పోస్టల్‌ విభాగానికి మూడు లక్షల మంది పోస్ట్‌మ్యాన్లు ఉన్నారు. దీంతో మారుమూల ప్రాంతాల్లోనూ, బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో లేని ప్రజలకు ఆ సేవలను చేరువ చేయాలన్నది తపాలా శాఖ ప్రణాళిక. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌

Most from this category