STOCKS

News


గణాంకాలు, ప్రపంచ పరిణామాలు  కీలకం

Monday 12th November 2018
Markets_main1541999629.png-21884

కంపెనీల క్యూ2 ఫలితాలు దాదాపు ముగింపు దశకు రావడంతో  దేశీ, అంతర్జాతీయ ఆర్థిక గణాంకాల ప్రభావం ఈ వారం స్టాక్‌ మార్కెట్‌పై ఉండనున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, ప్రపంచ మార్కెట్ల గమనం, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు వంటి  ప్రపంచ పరిణామాలు, రాష్ట్రాల ఎన్నికల సంబంధిత వార్తలు, డాలర్‌తో రూపాయి మారకం తదితర అంశాలు  కూడా స్టాక్‌సూచీల గమనాన్ని నిర్దశించనున్నాయి.

నేడు రిటైల్‌ గణాంకాలు..
గత  నెల రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు (సోమవారం) వెలువడతాయి. ఈ ఏడాది ఆగస్టులో 3.69 శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం ఈ సెప్టెంబర్‌లో 3.77 శాతానికి పెరిగింది. ఇదే రోజు ఈ ఏడాది సెప్టెంబర్‌ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కూడా వస్తాయి. ఈ ఏడాది జూలైలో 6.5 శాతంగా ఉన్న ఐఐపీ ఈ ఏడాది ఆగస్టులో 4.3 శాతానికి పడిపోయింది. ఈ నెల 14న (బుధవారం) గత నెలకు సంబంధించిన టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. ఈ ఏడాది ఆగస్టులో 4.53 శాతంగా ఉన్న టోకు ద్రవ్యోల్బణం ఈ సెప్టెంబర్‌లో 5.13 శాతానికి ఎగసింది. ఇక ఈ వారంలో 2,300 కంపెనీలు తమ క్యూ2 ఫలితాలను వెల్లడిస్తాయి. కీలక కంపెనీలు-సన్‌ఫార్మా, అరబిందో ఫార్మా, టాటా స్టీల్‌, సీఈఎస్‌సీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కోల్‌ ఇండియా, నాల్కో, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, అశోక్‌ లేలాండ్‌, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌, మహానగర్‌ గ్యాస్‌, ఎన్‌ఎమ్‌డీసీల ఫలితాలపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుంది. 

రిలీఫ్‌ ర్యాలీ...
 స్టాక్‌ మార్కెట్లో గత రెండు నెలల్లో భారీ కరెక్షన్‌ చోటు చేసుకుందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు. దీంతో సాంకేతిక కారణాల రీత్యా స్వల్ప కాలంలో రిలీఫ్‌ ర్యాలీ చోటుచేసుకునే అవకాశాలున్నాయని ఆయన అంచనా వేస్తున్నారు. ఇక ఈ వారంలో రిటైల్‌, టోకు ధరల ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కీలకం కానున్నాయని పేర్కొన్నారు. ఇటీవల వెలువడిన క్యూ2 ఫలితాలు మార్కెట్‌కు కొంత జోష్‌నిచ్చాయని శామ్‌కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోదీ చెప్పారు. ఫలితాల సీజన్‌ చివరకు రావడంతో రాష్ట్రాల ఎన్నికల పరిణామాలు ప్రధానం కానున్నాయని వివరించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తొలిగా చత్తీస్‌ఘర్‌లో నేటి నుంచి పోలింగ్‌ జరగనున్నది. ఇతర నాలుగు రాష్ట్రాలు-తెలంగాణ, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరమ్‌లో పోలింగ్‌ వచ్చే నెల 7న ముగుస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 11న వెల్లడవుతాయి. 

ఇక అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే, ఈ నెల 14న జపాన్‌ క్యూ3 జీడీపీ గణాంకాలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. ఈ నెల 15న(గురువారం) అమెరికా రిటైల్‌ గణాంకాలు వెల్లడవుతాయి. 

విదేశీ పెట్టుబడులకు చమురు జోష్‌ 
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగిరావడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడులు ఈ నెలలో పెరిగాయి. ఈ నెలలో ఇప్పటివరకూ జరిగిన ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్‌ మార్కెట్లో నికరంగా రూ.4,800 ‍కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. ఈక్విటీ మార్కెట్లో రూ.215 కోట్లు, డెట్‌ మార్కెట్లో రూ.4,557 కోట్లు చొప్పున విదేశీ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్‌ చేశారు. ముడిచమురు ధరలు తగ్గడంతో రూపాయి పెరగడం, బాండ్ల రాబడులు కూడా తగ్గడంతో లిక్విడిటీ కష్టాలు తగ్గుముఖం పట్టడం  దీనికి ప్రధాన కారణాలని విశ్లేషకులంటున్నారు.  గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి రూ.38,900 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి రూ.95,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.  దీంట్లో ఈక్విటీల వాటా రూ.41,900 కోట్లుగా, డెట్‌ మార్కెట్‌ వాటా రూ.53,600 కోట్లుగా ఉన్నాయి. 


 You may be interested

కేంద్రంతో ఆర్‌బీఐకి భిన్నాభిప్రాయాలు సహజమే..

Monday 12th November 2018

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్‌కి మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమేనని, ఇది ఆరోగ్యకరమైన ధోరణేనని ఆర్‌బీఐ మాజీ డిప్యుటీ గవర్నర్ ఆర్‌ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే, రెండు పక్షాలు తరచూ చర్చించుకుంటే ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఆర్‌బీఐ తమ డిమాండ్లకు తలొగ్గేలా చేసేందుకు కేంద్రం సెక్షన్ 7ని ప్రయోగించడమనేది తీవ్ర చర్చనీయాంశంగా మారడం దురదృష్టకరమని గాంధీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు స్వల్పకాలిక దృక్పథంతో ఆలోచిస్తే..

సెబీకి సాంకేతిక సేవలకు 7 సంస్థల షార్ట్‌లిస్ట్‌

Monday 12th November 2018

న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్లను మరింత మెరుగ్గా పర్యవేక్షించేందుకు అవసరమైన సాంకేతిక సేవలు అందించడం కోసం ఏడు ఐటీ సంస్థలను షార్ట్‌లిస్ట్ చేసినట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించింది. వీటిలో విప్రో, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, యాక్సెంచర్‌ సొల్యుషన్స్‌, క్యాప్‌జెమిని టెక్నాలజీ సర్వీసెస్ ఇండియా, హ్యులెట్ ‍ప్యాకార్డ్‌, ఈఐటీ సర్వీసెస్‌, తరవు టెక్నాలజీస్ ఉన్నాయి. విశ్లేషణ సామర్ధ్యాలను మెరుగుపర్చడం, ప్రైవేట్ క్లౌడ్‌ డేటా స్టోరేజీని రూపొందించడం, బ్రోకరేజి సంస్థల లావాదేవీలను ఆటోమేటిక్‌గా తనిఖీ

Most from this category