STOCKS

News


విప్రో ఏడీఆర్‌ 2 శాతం అప్‌

Saturday 19th January 2019
Markets_main1547877384.png-23673

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. విప్రో, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, వేదాంత ఏడీఆర్‌లు లాభాల్లోనూ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటామోటర్స్‌ ఏడీఆర్‌లు నష్టాలతో ముగిశాయి. అత్యధికంగా  విప్రో కంపెనీ షేరు కంపెనీ 2శాతం లాభపడింది. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం వెలువరించిన మూడో త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదు కావడం, బోనస్‌ ఇష్యూను ప్రకటించడంతో ఈ ఏడీఆర్‌ పెరిగింది. అలాగే  వేదాంత 1.5 శాతం పెరగ్గా, ఇన్ఫోసిస్‌ 1శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ అరశాతం లాభపడ్డాయి. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ 0.75శాతం నష్టపోగా, అదేబాటలో టాటా మోటర్స్‌ 0.15శాతం క్షీణించింది.
నాలుగోరోజూ లాభాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు
అమెరికా- చైనా దేశాల మధ్య వాణిజ్య చర్చలు మరోసారి తెరపైకి రావడంతో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. వచ్చే ఆరేళ్లలో అమెరికా దిగుమతులను 1ట్రిలియన్‌ డాలర్లకు పెంచడంతో తద్వారా 2024నాటికి చైనాతో యూఎస్‌ వాణిజ్యలోటును సున్నాకి తీసుకురావాలని చైనా అధికారులు భావిస్తున్నారు. ఫలితంగా రాత్రి అమెరికా మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి డోజోన్స్‌ 336 పాయింట్లు లాభపడి 24,706.35 వద్ద, ఎస్‌అండ్‌పీ 34 పాయింట్లు లాభపడి 2,670.71 వద్ద, నాస్‌డాక్‌ కాంపోజిట్‌ 72 పాయింట్లు లాభపడి 7157 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ వర్థంతి సందర్భంగా సోమవారం(జనవరి 21న) అమెరికా మార్కెట్లకు సెలవురోజు.



You may be interested

భారీ లాభంతో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 19th January 2019

విదేశీ మార్కెట్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ శుక్రవారం రాత్రి భారీ లాభంతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన గతముగింపు(10920)తో పోలిస్తే 63 పాయింట్ల లాభంతో 10,983 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 10,927 పాయింట్లతో పోలిస్తే 56 పాయింట్ల లాభంతో ఉంది. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ లాభంతో ముగిసిన నేపథ్యంలో సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

స్వల్పలాభాలతో ముగింపు

Friday 18th January 2019

ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతతో స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం కూడా అక్కడక్కడే ముగిసింది. సెన్సెక్స్‌ 12 పాయింట్ల లాభపడి 36,386.61 వద్ద, ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్లు పెరిగి 10,907 వద్ద ముగిసింది. సూచీలకు ఈ వారంలో ఇది నాలుగో లాభాల ముగింపు కావడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుకున్న సానుకూల సంకేతాలతో నేడు దేశీయ మార్కెట్‌ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది.

Most from this category