STOCKS

News


బేర్‌ మార్కెట్లోనూ ప్రశాంతంగా ఉండాలనుకుంటే..

Tuesday 5th February 2019
Markets_main1549307212.png-24012

ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది సున్నిత మనస్కులే. చిన్న పాటి ఒడుదుడుకులకే షేక్‌ అయిపోతుంటారు. ఆందోళనతో తప్పుడు నిర్ణయాల వైపు అడుగులు వేస్తుంటారు. నిజానికి మంచి స్టాక్స్‌ లేదా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఉన్న వారు సైతం వరుసగా మార్కెట్లలో కరెక్షన్‌ చూసి కంగారు పడిపోతుంటారు. దీంతో వారికి బేర్‌ మార్కెట్లలో మానసిక ప్రశాంతత, కంటి నిండా నిద్ర కూడా కరువవుతుంది. మార్కెట్‌ ఆటుపోట్లకు కలత చెందకుండా ఉండాలంటే అందుకు కొన్ని మార్గాలను నిపుణులు తెలియజేస్తున్నారు. 

 

ప్రతీ రోజూ చూడొద్దు...
ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం కోసం ఉద్దేశించిన ప్రణాళికతో ఉన్నవారు తమ పెట్టుబడుల విలువ ఒకటి రెండు రోజుల్లో రెండు శాతం క్షీణించి, మరో రోజు ఒక శాతం పెరగడం చూసి కంగారేమీ పడనవసరం లేదు. ఎందుకంటే మీ లక్ష్యానికి ఎన్నో ఏళ్లు ఉంది. అప్పటి వరకు మీరు ఇన్వెస్ట్‌ చేస్తూనే ఉంటారు. కనుక మధ్య మధ్యలో వచ్చే ఈ హెచ్చు, తగ్గులు ఏమీ చేయలేవు. కనుక మీ దగ్గరున్న స్టాక్స్‌ విలువను లేదా ఫండ్స్‌ ఎన్‌ఏవీని ప్రతిరోజూ పరిశీలించకండి. మీ ఆభరణాలను బ్యాంకు లాకర్‌లో పెడితే ఎంత ప్రశాంతంగా ఉంటారో, ఓ ఇల్లు లేదా స్థలం కొనుక్కుంటే ఎంత నిశ్చింతగా ఉంటారో... దీర్ఘకాలం కోసం చేసిన ఈక్విటీ పెట్టుబడుల విషయంలోనూ అదే నిలకడ ప్రదర్శించాలి. నిజానికి మీ దగ్గరున్న బంగారం విలువ ఏ రోజుకారోజు మారుతుంటుంది. మరి ఆ విషయం ఎందుకు ఆలోచించరు? ఎందుకంటే... దాన్ని సొంతం చేసుకున్నామనే భావన. అలాగే, ఈక్విటీ పెట్టుబడులను కూడా చూడాలి. 

 

గరిష్ట విలువను చూసి...
ప్రతి రోజూ స్టాక్స్‌ ధరలు లేదా ఫండ్స్‌ ఎన్‌ఏవీలను గమనిస్తుండే వారికి... వాటి గరిష్ట ధరలపై ఐడియా ఉంటుంది. మార్కెట్ల బుల్‌ ర్యాలీలో వారి పెట్టుబడుల విలువ గణనీయంగా పెరుగుతుంది. కానీ, కరెక్షన్‌లోకి వెళితే క్షీణిస్తుంది. 2017 అక్టోబర్‌ నాటి విలువలు చూసిన వారికి... ఇప్పుడు వాటి విలువలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. గరిష్ట విలువల నుంచి ఎంతో దిద్దుబాటుకు గురయ్యాయి. మరి అలా గరిష్ట విలువలను గుర్తు చేసుకుని భారీ నష్టాలు వచ్చాయన్న భావన సరికాదు. అలాగే, బుల్‌ ర్యాలీ సమయంలో ఈక్విటీ ఫండ్స్‌ను అమ్మేసి లిక్విడ్‌ ఫండ్స్‌లోకి మారిపోవడం కూడా సూచనీయం కాదు. మార్కెట్లో తలపండిన ఇన్వెస్టర్లు సైతం తమ మొత్తం ఈక్విటీ పోర్ట్‌ఫోలియో నుంచి తప్పుకుని ఫండ్స్‌లో పెట్టడం చేయకపోవడాన్ని గమనించొచ్చు. మళ్లీ బుల్‌ మార్కెట్లో పెట్టుబడుల విలువ గత శిఖర స్థాయిని దాటిపోవచ్చు. 

 

ఊహల్లో...
సంక్షోభ సమయాల్లో ఇన్వెస్టర్లు నిలకడగా వ్యవహరించాలి. ఇటీవలి ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభ సమయంలో ఏ ఈక్విటీ ఫండ్‌కు ఎన్‌బీఎఫ్‌సీల్లో అధిక పెట్టుబడులు ఉన్నాయనే అన్వేషణ అవసరం లేదు. ఒక కంపెనీలో పరిపాలన సంక్షోభం ఏర్పడితే అది స్టాక్‌పై ప్రభావం చూపిస్తుంది. ఓ ఫండ్‌ కొనుగోలు, అమ్మకానికి... సంబంధిత పథకం ఏ స్టాక్‌లో ఇన్వెస్ట్‌ చేసిందన్నది సరైన ఎంపిక కాబోదు. ఉదాహరణకు ఓ పథకం ఇన్ఫీబీమ్‌ లేదా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ లాంటి ఓ సంక్షోభ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల... 5-10 ఏళ్ల పాటు దీర్ఘకాలం ఇన్వెస్ట్‌ చేసే వారి పెట్టుబడులపై ఏమంత ప్రభావం చూపించదు. రోజువారీ ధరల పరంగా హెచ్చుతగ్గులు, కంపెనీల గురించి సమగ్రంగా తెలుసుకుని విశ్లేషించే సామర్థ్యాలు, ఇతర నైపుణ్యాలు లేకపోవడం వల్లే ఫండ్స్‌ మేనేజర్లపై ఆధారపడతామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 

 

పొరుగువారి గురించి పట్టించుకోవద్దు...
కొంత మంది స్టాక్స్‌ కొనడాన్ని కారు లేదా ఇల్లు కొనుగోలుగానే గొప్పగా భావిస్తుంటారు. దీన్ని తమ ఇంట్లోనూ, శుభ కార్యక్రమాల్లోనూ తమ సన్నిహితుల వద్ద గొప్పగా చెబుతుంటారు. ఇది విన్న వారు వెంటనే ఆవేశంతో తాము కూడా అవే స్టాక్స్‌ను కొనుగోలు చేయడం సరికాదు. సాధారణ ఇన్వెస్టర్లు సొంతంగా ఇన్వెస్ట్‌ చేసే వారు, వార్షికంగా 15 శాతం రాబడులను ఆర్జిస్తే అదొక పెద్ద విజయమే అవుతుంది. ఎదుటి వారు కొంటున్నారని, అమ్ముతున్నారని వారి నిర్ణయాలను కాపీ కొట్టొద్దు. తోటి వారిని ఫాలో అవకుండా, తమ సొంత అవసరాలు, పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.You may be interested

 ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 32 పాయింట్లు అప్‌

Tuesday 5th February 2019

వడ్డీ రేట్ల పెంపునకు అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ బ్రేక్‌వేయడం, అమెరికా ఆర్థిక గణాంకాలు సానుకూలంగా వుండటం తదితర అంశాల నేపథ్యంలో  ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 32 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ మంగళవారం ఉదయం 8.35  గంటలకు 10,969  పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,937 పాయింట్ల వద్ద ముగిసింది. గత వారం  ఫెడ్‌ నిర్ణయం వెలువడిన తర్వాత

రియల్టీపై ఓ కన్నేయండి!

Tuesday 5th February 2019

మధ్యంతర బడ్జెట్‌లో రియాలిటీ రంగానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు వీటిపై ఓ సారి దృష్టి సారించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, సంక్షోభంలో ఉన్న  రియల్టీ రంగాన్ని గాడిన పెట్టే ప్రయత్నంగా పేర్కొంటున్నారు. రెండు ఇళ్లను కొనుగోలు చేసినా మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం, రెండో ఇంటి అద్దె ఆదాయానికి పన్ను మినహాయింపు, అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు, ఫ్లాట్లపై పన్ను రాయితీలు సహా

Most from this category