STOCKS

News


అంతర్జాతీయ పరిణామాలు, క్రూడ్‌ ధరలే కీలకం..!

Monday 18th February 2019
Markets_main1550471389.png-24236

  • సోమవారం చైనా వాహన విక్రయ గణాంకాలు
  • మంగళవారం యూరో కరెంట్‌ అకౌంట్‌ బ్యాలెన్స్‌, నిర్మాణ డేటా వెల్లడి
  • బుధవారం వెల్లడికానున్న యూఎస్‌ ఎంబీఏ మార్టిగేజ్‌ అప్లికేషన్‌ డేటా
  • గురువారం ఎఫ్‌ఓఎంసీ మినిట్స్‌, ఏపీఐ క్రూడ్‌ వివరాలు
  • ఈవారంలోనే జీఎస్‌టీ కౌన్సిల్‌, ఆర్‌బీఐ సమావేశాలు
  • పుల్వామా ఉగ్రదాడి అంశంపై ఇన్వెస్టర్ల దృష్టి

ముంబై: ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, అమెరికా–చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య పరమైన చర్చలు వంటి పలు కీలక అంతర్జాతీయ అంశాలకు తోడు డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘ఈవారంలో మార్కెట్లను ప్రభావితం చేసే దేశీ ఆర్థిక అంశాలు ఏమీ లేనందున.. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, క్రూడ్‌ ఆయిల్‌ ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ కదలికలు సూచీలపై ప్రభావం చూపనున్నాయి.’ అని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ వెల్లడించారు. మార్కెట్‌ను ప్రభావితం చేసే సానుకూల అంశాలు లేకపోవడం, ముడిచమురు ధరలు పెరుగుతుండడం వంటి ప్రతికూలతలు ఉన్న కారణంగా ఈవారంలో అధిక శాతం ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం చీఫ్‌ వినోద్‌ నాయర్‌ వ్యాఖ్యానించారు.  

అంతర్జాతీయ పరిణామాల ప్రభావం!
మంగళవారం హౌసింగ్ మార్కెట్ ఇండెక్స్ డేటా వెల్లడితో ఈవారం అమెరికా స్థూల ఆర్థిక గణాంకాలు ప్రారంభంకానున్నాయి. 20న (బుధవారం) రెడ్‌బుక్‌ ఈ-కామర్స్ రిటైల్ సేల్స్‌, ఫిబ్రవరి 15తో ముగిసే వారానికి యూఎస్‌ ఎంబీఏ మార్టిగేజ్‌ అప్లికేషన్‌ డేటా వెల్లడికానుంది. గురువారం ఎఫ్‌ఓఎంసీ మినిట్స్‌, ఏపీఐ క్రూడ్‌ వివరాలు... ఫిబ్రవరి 16తో ముగిసే వారానికి జాబ్‌లెస్‌ క్లెయిమ్స్, డ్యూరబుల్‌ గూడ్స్‌ ఆర్డర్స్‌ వెల్లడికానున్నాయి. అదే రోజున ఇప్పటికే ఉన్న గృహ అమ్మకాల గణాంకాలు, ఫిబ్రవరి కాంపోజిట్‌ అండ్‌ సర్వీసెస్‌ పీఎంఐ డేటా కూడా గురువారమే వెల్లడికానుంది. ఇతర ప్రధాన దేశాల స్థూల ఆర్థిక అంశాల విషయానికి వస్తే.. సోమవారం జనవరి నెలకు సంబంధించిన చైనా వాహన విక్రయ గణాంకాలు, జపాన్‌ డిసెంబర్‌ మెషినరీ ఆర్డర్స్‌ వెలువడనుండగా.. మంగళవారం యూరో కరెంట్‌ అకౌంట్‌ బ్యాలెన్స్‌, డిసెంబర్‌ నిర్మాణ డేటా వెల్లడికానుంది. గురువారం యూరో జోన్‌ ఫిబ్రవరి తయారీ, కాంపోజిట్‌ అండ్‌ సర్వీసెస్‌ పీఎంఐ వెల్లడికానుంది. ఈ ప్రాంత జనవరి ద్రవ్యోల్బణం శుక్రవారం విడుదలకానుంది. ఇదే రోజున చైనా జనవరి నెల గృహ ధరల సూచీ, జపాన్‌ జనవరి ద్రవ్యోల్బణం వెల్లడికానున్నాయి. ఈ ప్రధాన అంతర్జాతీయ అంశాలకు తోడు ఇండో–పాక్ ఉద్రిక్తతలపై ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊరట..!
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కౌన్సిల్ ఈనెల 20న (బుధవారం) సమావేశంకానుంది. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ అధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో మంత్రుల బృందం సిఫార్సుల మేరకు రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊరట లభించనుందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. సిమెంట్‌పై ప్రస్తుతం ఉన్నటువంటి 28 శాతం పన్నురేటును 18 శాతానికి తగ్గించాలని ప్రతిపాదన ఉండగా.. అందుబాటు గృహాల విభాగానికి చెందిన ప్రాజెక్టులపై అమల్లో ఉన్న 8 శాతం పన్నును 3 శాతానికి తగ్గించాలనే సిఫార్సులను కౌన్సిల్‌ పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. 

మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వాలా వద్దా..?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐని విజ్ఞప్తి చేస్తుండగా.. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని కేంద్ర బ్యాంక్‌ సోమవారం వెల్లడించనుంది. న్యూఢిల్లీలో సమావేశంకానున్న ఆర్‌బీఐ.. డివిడెండ్‌ ఇవ్వాలా వద్దా అనే అంశంపై తన నిర్ణయాన్ని తెలియజేయనుంది. ఇక ఫిబ్రవరి 15తో ముగిసే వారానికి విదేశీ మారక ద్రవ్య డేటా శుక్రవారం విడుదలకానుంది.

ముడిచమురు ధరల ప్రభావం..
గతేడాది డిసెంబర్‌లో 50 డాలర్ల కనిష్టస్థాయిని నమోదుచేసిన బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర.. ఆ స్థాయి నుంచి గతవారం చివరినాటికి 31 శాతం పెరుగుదలను నమోదుచేసింది. గతవారంలో 6.7 శాతం పెరిగి 66.25 డాలర్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో డాలరుతో రూపాయి మారకం విలువ గతవారం 9 పైసలు బలహీనపడింది. ఈవారంలో మారకం విలువ 71.60 – 70.90 స్థాయిలో ఉండేందుకు అవకాశం ఉందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఫారెక్స్‌ నిపుణులు అమిత్‌ గుప్తా అన్నారు.

20 కంపెనీల ఫలితాలు..
ఈ ఏడాది క్యూ3 (అక్టోబర్‌–డిసెంబర్‌) ఫలితాల సీజన్‌ దాదాపుగా చివరి దశకుచేరుకుంది. ఈవారంలో 20 వరకు కంపెనీలు ఫలితాలను ప్రకటించనుండగా.. వీటిలో ప్రధానంగా అంబుజా సిమెంట్స్‌ సోమవారం, నితిన్‌ ఫైర్‌ వర్క్స్‌ మంగళవారం... మహీంద్రా సీఐఈ ఆటోమోటీవ్‌, వరుణ్‌ బేవరేజెస్‌ బుధవారం, తిలక్‌నగర్‌ ఇండస్ట్రీస్‌ శుక్రవారం ఫలితాలను ప్రకటించనున్నాయి.

ఎఫ్‌ఐఐల నికర కొనుగోళ్లు
ఫిబ్రవరి 1–15 కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.5,322 కోట్ల పెట్టుబడులను భారత స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. అయితే ఇదే సమయంలో రూ.248 కోట్లను వీరు డెట్‌ మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారు. నికరంగా రూ.5,074 కోట్లను ఈ 15 రోజుల్లో ఎఫ్‌పీఐలు పెట్టుబడి పెట్టారు. ఇకపై వీరి ఎటువంటి ధోరణి అవలంభిస్తారనే అంశం లోక్‌ సభ ఎన్నికలు, క్రూడ్‌ ఆయిల్‌ ధరలపై ఆధారపడి ఉందని బజాజ్‌ కాపిటల్‌ హెడ్‌ అలోక్‌ అగర్వాల్‌ అన్నారు.



You may be interested

సెప్టెంబర్‌ వరకూ తనఖా షేర్ల విక్రయం ఉండదు

Monday 18th February 2019

సెప్టెంబర్‌ వరకూ తనఖా షేర్ల విక్రయం ఉండదు రుణ దాతలతో ఒప్పందం కుదుర్చుకున్న రిలయన్స్‌ గ్రూప్‌  షెడ్యూల్‌ ప్రకారమే అసలు, వడ్డీ  చెల్లింపులు జరుపుతాం రిలయన్స్‌ పవర్‌లో వాటా విక్రయానికి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్ల నియామకం  న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూప్‌ కంపెనీలకు ఊరట లభించింది. ప్రమోటర్‌ తనఖా పెట్టిన షేర్లను ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకూ విక్రయించకుండా రుణదాతలతో ఒక ఒప్పందాన్ని రిలయన్స్‌ గ్రూప్‌ కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి రుణదాతల్లో దాదాపు 90

ఫ్లాట్‌ ప్రారంభం.. అంతలోనే నష్టాల్లోకి..!

Monday 18th February 2019

ప్రపంచమార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాల అందిపుచ్చుకున్న మార్కెట్‌ సోమవారం ఫ్లాట్‌గా మొదలైంది. సెన్సెక్స్‌ 22 పాయింట్ల లాభంతో 35,831 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల స్వల్ప లాభంతో 10,738 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే దేశీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు మార్కెట్‌ను నష్టాల్లోకి నెట్టాయి. డాలర్‌ మారకంలో రూపాయి వరుసగా 4రోజూ బలపడంతో ఐటీ షేర్లలో విక్రయాలతో పాటు, అటో, ఎఫ్‌ఎమ్‌జీసీ షేర్లలో అమ్మకాల కారణంగా సూచీల తిరిగి

Most from this category