STOCKS

News


సెన్సెక్స్‌ 665 పాయింట్లు, నిఫ్టీ 180 పాయింట్లు జంప్‌

Thursday 31st January 2019
Markets_main1548929384.png-23930

-బ్యాంక్‌, ,ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు నేతృత్వం

-బడ్జెట్‌పై పెరిగిన అంచనాలు

-ప్రపంచ మార్కెట్లకు ఫెడ్‌ ఊపు

 

పలు సానుకూల అంశాలు, బడ్జెట్‌పై మెరుగుపడిన అంచనాల ప్రభావంతో గురువారం భారత్‌ మార్కెట్‌ భారీ ర్యాలీ జరిపింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 665 పాయింట్లు పెరిగి 36,256 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 179 పాయింట్లు లాభపడి 10,831 పాయింట్ల వద్ద ముగిసింది. సూచీలకిది నాలుగు రోజుల గరిష్టస్థాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాజిటివ్‌గా ప్రారంభమైన మార్కెట్‌కు రాష్ట్రపతి పార్లమెంటులో చేసిన ప్రసంగం మరింత జోష్‌నిచ్చి రేపటి బడ్జెట్‌పై ఆశావహ అంచనాలు కలిగించింది. 35,850 పాయింట్ల సమీపంలో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఉదయం సెషన్‌లో కాస్త హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, తదుపరి రోజంతా పెరుగుతూ పోయి 36,277 పాయింట్ల గరిష్టస్థాయిని నమోదు చేసింది. అలాగే జనవరి డెరివేటివ్‌ సిరీస్‌కు చివరిరోజుకావడంతో భారీ షార్ట్‌ కవరింగ్‌ ప్రభావంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రోజులో కనిష్టస్థాయి 10,678 పాయింట్ల నుంచి ఎకాఎకిన 10,838 పాయింట్ల గరిష్టస్థాయికి ఎగబాకింది. తాజా ర్యాలీని ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లు ముందుండి నడిపించాయి. ఇందుకు ఎఫ్‌ఎంసీజీ షేర్లు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా తోడ్పాటునందించాయి.  బ్యాంక్‌ నిఫ్టీ 1.7 శాతం (470 పాయింట్లు) పెరిగి 27,300 పాయింట్ల సమీపంలో ముగిసింది. వివిధ రంగాల సూచీల్లో అత్యధికంగా పెరిగిన ఇండెక్స్‌ ఇదే. ఐటీ, ఫైనాన్షియల్‌ సర్వీసుల సూచీలు 1.5 శాతం జంప్‌చేసాయి. అన్ని రంగాల సూచీలూ లాభాల్లో ముగియడం విశేషం. 

యాక్సిస్‌ బ్యాంక్‌ కొత్త రికార్డుస్థాయికి...

రెండు రోజుల క్రితం బ్లాక్‌బస్టర్‌ ఫలితాల్ని ప్రకటించిన యాక్సిస్‌ బ్యాంక్‌ 4 శాతంపైగా పెరిగి సరికొత్త రికార్డుస్థాయి రూ. 721 వద్ద ముగిసింది. నిఫ్టీ-50లో ఇదే అత్యధికంగా లాభపడిన షేరు. ఇన్ఫోసిస్‌, గెయిల​, టైటాన్‌, టాటా మోటార్స్‌ షేర్లు 3 శాతంపైగా పెరగ్గా, కొటక్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 2.5 శాతం మేర జంప్‌చేశాయి. హిందుస్తాన్‌ యూనీలీవర్‌, ఐటీసీ, టీసీఎస్‌లు సైతం 1 శాతం వరకూ పెరిగాయి. మరోవైపు యస్‌బ్యాంక్‌, జీ ఎంటర్‌ప్రైజెస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌లు 1 శాతంపైగా నష్టపోయాయి. 

మార్కెట్‌ భారీ ర్యాలీకి కారణాలివే...

రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్‌పై సానుకూల అంచనాలు

పార్లమెంటు ప్రారంభ సమావేశాల్లో రాష్ట్రపతి కోవిద్‌ ప్రసంగం మార్కెట్‌కు ఊపునిచ్చింది. రైతులు, పేదలు, మధ్యతరగతిపై ప్రభుత్వం దృష్టిపెడుతుందన్న సంకేతాలు రాష్ట్రపతి ప్రసంగంలో వెల్లడికావడంతో బడ్జెట్లో ఆ వర్గాలపై వరాల జల్లు వుండవచ్చని, దాంతో వినియోగం, పొదుపు పెరిగి, స్టాక్‌ మార్కెట్‌కు ఊతమిస్తుందన్న అంచనాలు మొదలయ్యాయి.రేపటి బడ్జెట్‌ ప్రోత్సాహకంగా వుండవచ్చన్న అంచనాలు మార్కెట్లో మొదలయ్యాయని, అందుకుతోడు జనవరి డెరివేటివ్‌ సిరీస్‌కు గురువారం చివరిరోజైనందున, షార్ట్‌ కవరింగ్‌ కూడా తాజా మార్కెట్‌ ర్యాలీకి కారణమని అషికా స్టాక్‌ బ్రోకింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌జైన్‌ అన్నారు. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లపై సరళవ్యాఖ్యానాలు కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను మెరుగుపర్చాయన్నారు. 

ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరవచ్చు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరవచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఈ లోటు 3.2 శాతానికి పరిమితం కావొచ్చంటూ ఎస్‌బీఐ రీసెర్చ్‌ ఎకానమిస్టులు విడుదల చేసిన తాజా నోట్‌లో పేర్కొనడం కూడా ఇన్వెస్టర్ల ఉత్సాహానికి కారణమని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. 

అంతర్జాతీయ మార్కెట్ల బాసట
వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియకు ఈ ఏడాది బ్రేక్‌వేసే సంకేతాల్ని ఫెడ్‌ అందించడంతో ప్రపంచ మార్కెట్ల పాజిటివ్‌ ట్రేడింగ్‌ కూడా దేశీయ ట్రెండ్‌ను మార్చింది. గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 2 శాతం పెరగడంతో పాటు ఈ రోజు పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తూ అమెరికా స్టాక్‌ ఫ్యూచర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. ఆసియా సూచీలన్నీ లాభాలతో ముగిసాయి. అలాగే యూరప్‌ మార్కెట్లు కూడా పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి.

రూపాయి ర్యాలీ
వివిధ దేశాల కరెన్సీలతో డాలరు బలహీనపడిన నేపథ్యంలో రూపాయి సైతం ర్యాలీ జరిపింది. భారత్‌ కరెన్సీ 20 పైసలుపైగా లాభపడి 70.86 వద్దకు చేరడం కూడా తాజా స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీకి ఒక కారణం. 

హెవీవెయిట్‌ షేర్లలో కొనుగోళ్లు
రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి హెవీవెయిట్‌ షేర్లలో జరిగిన భారీ కొనుగోళ్లు స్టాక్‌ సూచీల పెద్ద ర్యాలీకి కారణమయ్యాయి. ఈ నాలుగు షేర్లూ సెన్సెక్స్‌ను 320 పాయింట్లు లాభపడేలా చేసాయి. 
 You may be interested

ఏప్రిల్‌ నాటికి నిఫ్టీ@12,000!

Thursday 31st January 2019

సంజీవ్‌ భాసిన్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ఫిబ్రవరిలో నిఫ్టీ 11000- 11200 పాయింట్ల వరకు, ఏప్రిల్‌నాటికి దాదాపు 12,000 పాయింట్ల వరకు దూసుకుపోవచ్చని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి సంజీవ్‌ భాసిన్‌ అంచనా వేశారు. దేశీయ మార్కెట్‌పై పాజిటివ్‌గా ఉన్నామన్నారు. కొన్ని కంపెనీల ఫలితాలు పేలవంగా ఉన్నా, కొన్ని నెగిటివ్‌ వార్తలు చుట్టుముట్టినా ఇవన్నీ రాబోయే బుల్‌ర్యాలీలో సమసిపోతాయన్నారు. ఏప్రిల్‌ నాటికి కొత్త గరిష్ఠాలను చూస్తామని అభిప్రాయపడ్డారు. ఈ దఫా ర్యాలీలో మిడ్‌క్యాప్స్‌, కొన్ని

డీహెచ్‌ఎఫ్‌ఎల్ గ్రూప్‌లో ఫండ్స్‌ పెట్టుబడులు రూ. 8,650 కోట్లు

Thursday 31st January 2019

తీవ్ర ఆందోళనలో మ్యూచువల్‌ ఫండ్స్‌ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పలు మ్యూచువల్‌ ఫండ్స్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. గతేడాది చివర్లో ఐల్‌ఎల్‌అండ్‌ఎఫ్‌సీ సంక్షోభంలో దెబ్బతిన్న ఫండ్స్‌...ఈ ఏడాది ప్రారంభం‍లోనే డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ గ్రూప్‌ మీద రూ.31వేల కోట్ల నిధుల అక్రమ మళ్లింపు ఆరోపణలు రావడంతో ఈ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోంటున్నాయి.  డిసెంబర్‌ త్రైమాసికం నాటికి పలు 22  మ్యూచువల్‌ ఫండ్లు

Most from this category