STOCKS

News


క్యూ4 ఫలితాలతో దిశా నిర్దేశం

Monday 22nd April 2019
Markets_main1555913058.png-25258

- ఏప్రిల్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు ఈవారంలోనే..
- కొనసాగుతున్న పోలింగ్‌పై మార్కెట్‌ దృష్టి
- యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, ఏసీసీ ఫలితాల వెల్లడి

ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 116 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న (మంగళవారం) 3వ దశ పోలింగ్‌ జరగనుంది. కొనసాగుతున్న సాధారణ ఎన్నికల వేడి, కంపెనీలు ప్రకటించనున్న క్యూ4 (జనవరి–మార్చి) ఫలితాలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నట్లు దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎర్నింగ్స్‌ సీజన్‌లో భాగంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ శుక్రవారం ఫలితాలను ప్రకటించగా.. ఆరోజు గుడ్‌ఫ్రైడే కారణంగా మార్కెట్‌కు సెలవు అయినందున ఈ ప్రభావం సోమవారం ట్రేడింగ్‌పై స్పష్టంగా కనిపించనుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. చమురు శుద్ధి, పెట్రో కెమికల్‌ విభాగాల్లో బలహీనంగా ఉన్నప్పటికీ.. రిటైల్, టెలికం విభాగాల జోరు కారణంగా ఆర్‌ఐఎల్‌ రికార్డ్‌ స్థాయి లాభాలను ఆర్జించగా.. గత ఏడాది క్యూ4తో పోలిస్తే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభాల్లో 22.63 శాతం వృద్ధి కనబర్చింది. ఈ దిగ్గజాల ఫలితాల ప్రభావంతో పాటు.. ఇక నుంచి వెల్లడికానున్న ఎర్నింగ్స్‌ ప్రస్తుత వారంలో మార్కెట్‌కు కీలకంకానున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం చీఫ్‌ వినోద్‌ నాయర్‌ వ్యాఖ్యానించారు. ‘స్వల్పకాలానికి ఇన్వెస్టర్లు క్యూ4 ఫలితాలపై దృష్టిసారించారు. నిఫ్టీ 50 కంపెనీల ఎర్నింగ్స్‌ ఏడాది ప్రాతిపదికన 20 శాతం మేర వృద్ధిని సాధించేందుకు అవకాశం ఉంది. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో బ్యాంకింగ్‌ రంగ లోబేస్‌ కారణంగా ఈ అంచనాను తీసుకున్నాం. ఇక ఈవారంలో కార్పొరేట్‌ బ్యాంకింగ్‌ రంగాన్ని కలుపుకుని ఇండెక్స్‌ హెవీవెయిట్స్‌ ఫలితాల సీజన్‌ ట్రెండ్‌కు అద్దంపట్టనున్నాయి.’ అని విశ్లేషించారు. ఎన్నికల వేడి నేపథ్యంలో ఒడిదుడుకులకు ఆస్కారం అధికంగా ఉందన్నారు.

ఆర్థిక సేవల రంగంపై దృష్టి
అధిక శాతం ఆర్థిక సేవల కంపెనీలు ఈవారంలోనే నాల్గవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఏయూ స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్ (సోమవారం).. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్,  ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్, ఎం అండ్ ఎం ఫైనాన్షియల్ (బుధవారం) ఫలితాలను వెల్లడించనున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ లైఫ్‌ (గురువారం).. యస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ (శుక్రవారం) ఫలితాలను ప్రకటించనున్నాయి. వాహన రంగానికి చెందిన దిగ్గజ కంపెనీల్లో మారుతి సుజుకి (గురువారం), హీరో మోటోకార్ప్(శుక్రవారం) ఫలితాలను ప్రకటించనుండగా.. ఇతర రంగాల దిగ్గజాల్లో ఏసీసీ (మంగళవారం), ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, భారతీ ఇన్‌ఫ్రా టెల్‌ (బుధవారం) టాటా స్టీల్‌ (గురువారం) వెల్లడించనున్నాయి. ఈ ఫలితాలతో పాటు అమెరికా–చైనా వాణిజ్య చర్చలు సైతం సూచీలకు సంకేతాలను ఇవ్వనున్నాయని ఎస్‌ఎమ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ అడ్వైజర్స్‌ చైర్మన్‌ డీ కే అగర్వాల్‌ అన్నారు. ఏప్రిల్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు ఈవారంలోనే ఉన్నందున లార్జ్‌క్యాప్‌ షేర్ల కదలికలు ఈ అంశంపైనే ఆధారపడి ఉన్నట్లు ఎడిల్‌వీస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ చీఫ్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ సాహిల్‌ కపూర్‌ విశ్లేషించారు. 

ముడిచమురు ధరల ప్రభావం..
గతవారంలో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ మరింత పెరిగి 72 డాలర్ల స్థాయికి చేరింది. శుక్రవారం 71.95 వద్ద ముగిసింది. ఈ ప్రధాన అంశం ఆధారంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ 68.90–69.80 శ్రేణిలో కదలాడవచ్చని ఎడిల్‌వీస్‌ సెక్యూరిటీస్‌ ఫారెక్స్‌ హెడ్‌ సజల్‌ గుప్తా విశ్లేషించారు. మరోవైపు ఏప్రిల్‌ 19తో అంతమయ్యే వారానికి విదేశీ మారక నిల్వల డేటాతో పాటు ఏప్రిల్‌ 12 నాటికి డిపాజిట్లు, బ్యాంకు రుణ పెరుగుదల గణాంకాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. 

కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ
దేశీ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లు, మార్చిలో రూ.45,981 కోట్లు పెట్టుబడి పెట్టిన వీరు ఏప్రిల్‌లోనూ ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తున్నారు. గడిచిన రెండు నెలల్లో నికర కొనుగోలుదారులుగా నిలిచిన ఎఫ్‌పీఐలు.. ఈనెల్లో ఇప్పటివరకు (ఏప్రిల్‌ 1–16 కాలంలో) నికరంగా రూ.11,012 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈకాలంలో మొత్తంగా రూ.14,300 కోట్లు పెట్టుబడి పెట్టిన వీరు.. డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.3,288 కోట్లను ఉపసంహరించుకున్నారు. దీంతో నికరంగా రూ.11,012 కోట్లు ఇన్వెస్ట్‌చేసినట్లు నమోదైంది. పలు సెంట్రల్‌ బ్యాంకులు ద్రవ్య విధాన దృక్పథంపై వైఖరి మారడం, అంతర్జాతీయంగా ద్రవ్య లభ్యత మెరుగుపడిన కారణంగా ఫిబ్రవరి నుంచి విదేశీ నిధుల వెల్లువ కొనసాగుతుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘భారత్‌లో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకానుందన్న సానుకూలత కారణంగా పెట్టుబడులు కొనసాగుతున్నాయి’ అని గ్రో సీఈఓ హర్ష్ జైన్ అన్నారు. ఇతర ఎమర్జింగ్‌ మార్కెట్లతో పోల్చితే భారత్‌ మరింత ఆకర్షణీయంగా ఉన్నందున పెట్టుబడులు పెరుగుతున్నాయని మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ ఇండియా సీనియర్‌ అనలిస్ట్‌ హిమంషు శ్రీవాత్సవ వివరించారు.You may be interested

తక్షణ మద్దతు శ్రేణి 39,040-38,975 పాయింట్లు

Monday 22nd April 2019

ఎట్టకేలకు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గతవారం డబుల్‌టాప్‌ను అధిగమించి, భారత్‌ మార్కెట్‌ దీర్ఘకాలిక అప్‌ట్రెండ్‌ ఇంకా కొనసాగుతుందని రుజువుచేసింది. అంటే..సమీప భవిష్యత్తులో వివిధ అంశాల కారణంగా మార్కెట్‌ ఒడుదుడుకులకు లోనైనా, రానున్న నెలల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను భారత్‌ సూచీలు చేరతాయనే విశ్వాసాన్ని ఇన్వెస్టర్లకు గతవారం ట్రెండ్‌ కల్పించింది. కార్పొరేట​ దిగ్గజం రిలయన​‍్స ఇండస్ట్రీస​...శుక్రవారం మార్కెట్‌​ ముగిసిన తర్వాత వెల్లడించిన ఫలితాలపై  షేరు స్పందన సోమవారం తెలుస్తుంది. మరిన్ని కీలక కంపెనీల

కీలక మద్దతుల వద్ద కొనుగోళ్లకు ఛాన్స్‌

Monday 22nd April 2019

సుదీర్ఘ విరామం అనంతరం సోమవారం సూచీలు నష్టాల్లో ఆరంభమ్యాయి. నిఫ్టీ కీలక 11700 పాయింట్లకు దిగువన ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధర పతనం, ఎన్నికల అస్థిరత తదితర అంశాలు సూచీలను కుంగదీస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సమయంలో నిఫ్టీ కీలక మద్దతు స్థాయిల వద్దకు వచ్చినప్పుడల్లా కొనుగోళ్లకు అవకాశంగా పరిగణించాలని సూచిస్తున్నారు. అదేవిధంగా లాంగ్‌ పొజిషన్లకు 11550 పాయింట్లను స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలని సలహా ఇస్తున్నారు. షార్ట్‌ పొజిషన్లకు 11860

Most from this category