STOCKS

News


మార్కెట్‌ మాట.. మళ్లీ మోదీ!!

Thursday 14th March 2019
Markets_main1552544942.png-24599

సత్తా మార్కెట్‌లో జోరుగా బెట్టింగ్‌లు
బీజేపీకి సొంతంగా 251
ఎన్‌డీఏ పక్షాలకు కలిపి 300
బెట్టింగ్‌ రాయుళ్ల పందాలు

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ రానున్న ఎన్నికల్లో విజయఢంకా మోగించనుందన్న అంచనాలతో సత్తా మార్కెట్లో జోరుగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. చట్టవిరుద్ధంగా నడిచే ఈ బెట్టింగ్‌ మార్కెట్‌ను సత్తాబజార్‌గా పిలుస్తారు. పాకిస్థాన్‌లోని జైషే మహమ్మద్‌ ఉగ్రవాద స్థావరాలపై గత నెలలో భారత వాయుసేన మెరుపు దాడులతో బీజేపీ విజయావకాశాలు మెరుగుపడినట్టు సత్తా మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వాయుసేన దాడులకు ముందు వరకు త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీకి 200-230 సీట్ల వరకు రావచ్చన్న అంచనాలతో బుకీలు బెట్టింగ్‌ నడిపారు. ఈ అంచనాల ఆధారంగా ప్రతీ రూపాయి బెట్టింగ్‌పై రూపాయిని ఆఫర్‌ చేశారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్‌ చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలతో పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం బీజేపీకి సొంతంగా 245-251 సీట్ల వరకు రావచ్చని, ఎన్‌డీఏ పక్షాలతో కలుపుకుంటే ఈ స్కోరు 300 వరకు ఉంటుందని బుకీలు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్కు లభిస్తుందన్న అంచనాలు పెరిగాయి. మ్యాజిక్‌మార్క్‌ 272 సీట్లు అని తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ 200 లోక్‌సభ సీట్లు, అంతకంటే ఎక్కువ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న అంచనాలపై 7:1 నిష్పత్తిలో గత నెల వరకు బెట్టింగ్‌లు నడిచాయి. అంటే ఈ అంచనాలు నిజమైతే ప్రతీ రూపాయి బెట్టింగ్‌కు రూ.7 చెల్లిస్తారు. కానీ, తాజాగా ఇది 10:1కు పెరిగిపోయింది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడానికి ముందు వరకు బెట్టింగ్‌లు నిదానంగా కొనసాగగా, షెడ్యూల్‌ తర్వాత జోరు పెరిగింది. ఏప్రిల్‌ 11 నుంచి మే 19 వరకు మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. మే 23న ఫలితాలు వెల్లడవుతాయి. దీంతో సత్తా మార్కెట్‌లో బెట్టింగ్‌లు కూడా అదే రోజు గడువు తీరిపోతాయి.
మొదలైన ప్రీ-ఎలక‌్షన్‌ ర్యాలీ...
పాక్‌ ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపు దాడుల(సర్జికల్‌ స్ట్రైక్స్‌) తర్వాత ఎన్‌డీఏకు పరిస్థితులు మరింత సానుకూలంగా మారాయంటూ ఇటీవలి సర్వేలు కూడా తేల్చిచెబుతున్న సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే బీజేపీకి సొంతంగా కొన్ని స్థానాలు తగ్గినప్పటికీ.. కచ్చితంగా మళ్లీ ఏన్‌డీఏ సర్కారే ఏర్పాటు అవుతందని మెజారిటీ ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే స్టాక్ మార్కెట్లో ఎన్నికల ముందస్తు ర్యాలీ కూడా కొనసాగుతుండం గమనార్హం. మోదీ మరోసారి విజయం సాధించొచ్చనే విషయాన్ని మార్కెట్లు ముందుగానే డిస్కౌంట్‌ చేసుకుంటున్నాయనేదానికి ఈ ప్రీ-ఎలక‌్షన్‌ ర్యాలీ నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత(ఏప్రిల్‌ 10) నుంచి వరుసగా మూడు రోజులు మార్కెట్లు పరుగులు తీశాయి. నిఫ్టీ గడిచిన మూడు రోజుల్లో 300 పాయింట్లు పైగా, సెన్సెక్స్‌ 1,000 పాయింట్లు మించి దూసుకెళ్లాయి. బ్యాంక్‌ నిఫ్టీ ఇప్పటికే కొత్త ఆల్‌టైమ్‌ గరిష్టాలకు చేరింది కూడా. ఇదే జోరు కొనసాగితే ఎన్నికల ముందే నిఫ్టీ, సెన్సెక్స్‌ కూడా కొత్త ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిలను నమోదు చేయొచ్చని మార్కెట్‌ పండితులు జోరుగా అంచనా వేస్తున్నారు.
ఫలోడి టౌన్‌
క్రికెట్‌ బెట్టింగ్‌, ఈక్విటీలు, కమోడిటీలకుకు సంబంధించి డబ్బా ట్రేడింగ్‌ ఉన్నట్టే... ఎన్నికలకు సంబంధించిన బెట్టింగ్‌లు గ్రే మార్కెట్లో జరుగుతుంటాయి. ఎన్నికలకు సంబంధించిన స్పెక్యులేషన్‌కు రాజస్థాన్‌లోని ఫలోడి పట్టణం కేంద్రంగా కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీ మార్కెట్లకు సైతం ఫలోడి మార్క్‌టే దిశానిర్దేశం చేస్తుంటుంది. త్వరలో ఎన్నికలకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న బెట్టింగ్‌లన్నీ ప్రాథమిక అంచనాల స్థాయిలోనే ఉన్నాయి. త్వరలో రాష్ట్రాలు, నియోజకవర్గాల వారీగా బెట్టింగ్‌ ట్రేడ్స్‌ జరుగుతాయన్న అంచనాలు ఉన్నాయి. ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టోలను విడుదల చేయడంతోపాటు నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల జాబితా ఖరారైన తర్వాత బెట్టింగ్‌ల అంకం తుది దశకు చేరుకుంటుందని అంచనా. 
టేబుల్‌
బుకీల ఆఫర్‌: 
- బీజేపీ 245-251 స్థానాలు సాధిస్తుందన్న అంచనాలకు 1:1
- 300 సీట్లతో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది
- కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న అంచనాలకు 10:1
- రాజస్థాన్‌లోని ఫలోడి కేంద్రంగా బెట్టింగ్‌లు



You may be interested

ఐవోసీ, ఓఎన్‌జీసీపై డివిడెండ్ ఒత్తిడి

Thursday 14th March 2019

- రెండోసారి మధ్యంతర డివిడెండ్ కావాలంటున్న కేంద్రం న్యూఢిల్లీ:  పన్ను ఆదాయాలు ఆశించినంత స్థాయిలో కనిపించని నేపథ్యంలో ఆ లోటును భర్తీ చేసుకునే మార్గాలపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండోసారి మధ్యంతర డివిడెండ్ ఇచ్చేలా ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఇండియన్ ఆయిల్‌ కార్పొరేషన్ (ఐవోసీ), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ)లపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశంపై చర్చించేందుకు మార్చి

ఉద్యోగార్థుల్లో కొరవడుతున్న నైపుణ్యాలు

Thursday 14th March 2019

ఐబీఎం చీఫ్ రోమెటీ ముంబై: టెక్నాలజీ రంగంలో కొంగొత్త ఉద్యోగావకాశాలు కుప్పతెప్పలుగా వస్తున్నా.. వాటికి అవసరమైన నైపుణ్యాలు ఉద్యోగార్థుల్లో ఉండటం లేదని అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం సీఈవో గినీ రోమెటీ చెప్పారు. విద్యపరంగా కేవలం డిగ్రీ పట్టా సంపాదించడం మాత్రమే కాకుండా నైపుణ్యాలను పెంచుకోవడంపై ఉద్యోగార్థులు దృష్టి సారించాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉందని కంపెనీ సమావేశంలో

Most from this category