STOCKS

News


సెన్సెక్స్‌ 464 పాయింట్లు డౌన్‌

Friday 19th October 2018
Markets_main1539944611.png-21294

లిక్విడిటీ భయాలు మళ్లీ తలెత్తడంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది. దసరా  (గురువారం) సెలవు కారణంగా ఒక్క రోజు విరామం తర్వాత ఆరంభమైన స్టాక్‌ సూచీలు చెరో ఒక శాతానికి పైగా క్షీణించాయి. ఫెడ్‌ రేట్ల పెంపు భయాలు, చైనా వృద్ధి మందగించడం వంటి కారణాల వల్ల ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. దీనికి తోడు  వీసా నిబంధనలు మరింత కఠినతరం కానుండటం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌  ఇండెక్స్‌ హెవీ వెయిట్‌ షేర్లు 4 శాతం వరకూ నష్టపోవడం  వంటి ప్రతికూలాంశాల కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతిన్నది. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు సంబంధించిన లిక్విడిటీ కవరేజ్‌ రేషియో నిబంధనలను ఆర్‌బీఐ సరళీకరించినా, ఎలాంటి ప్రయోజనం దక్కలేదు.  ఇంట్రాడేలో నిఫ్టీ కీలకమైన 10,250 పాయింట్ల దిగువకు పడిపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 464 పాయింట్లు క్షీణించి 34,316 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 150 పాయింట్లు నష్టపోయి 10,304 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక వారం పరంగా చూస్తే, స్టాక్‌ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఈ వారంలో సెన్సెక్స్‌  418 పాయింట్లు, నిఫ్టీ 169 పాయింట్లు చొప్పున క్షీణించాయి. ఇంధన, ఐటీ, ఆర్థిక, వాహన రంగ షేర్లు నష్టపోయాయి. ఒక్క ఎఫ్‌ఎమ్‌సీజీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. 
ఇంట్రాడేలో 639 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌
ఆసియా మార్కెట్ల బలహీనతతో సెన్సెక్స్‌ నష్టాల్లోనే ప్రారంభమైంది. అన్నీ ప్రతికూలాంశాలే ఉండటంతో నష్టాలు అంతకంతకూ పెరిగాయి. ఇంట్రాడేలో 639 పాయింట్లు క్షీణించి 34,140 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకింది. ఇక నిఫ్టీ ఒక దశలో 203 పాయింట్ల వరకూ నష్టపోయింది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా వృద్ధి మందగిస్తుందనే ఆందోళన మార్కెట్లలలో ఒడిదుడుకులకు కారణమైందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. బుధవారం వెల్లడైన అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశ వివరాలు రేట్ల పెంపు అంచనాలను మరింత బలపడేట్లు చేశాయని పేర్కొన్నారు. కాగా నిఫ్టీకి 10,300 పాయింట్లు కీలకమైన మద్దతని నిపుణులంటున్నారు. నిఫ్టీ ఈ స్థాయి దిగువకు పడిపోతే స్టాక్‌ మార్కెట్‌ మరింతగా బలహీనపడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. నిఫ్టీ తదుపరి కీలక మద్దతు 10,100 పాయింట్లని టెక్నికల్‌ ఎనలిస్ట్‌లు అంటున్నారు. 
ఐటీ షేర్లు డౌన్‌...
రూపాయి పతనమైనప్పటకీ ఐటీ షేర్లు క్షీణించాయి. హెచ్‌-1 వీసా నిబంధనలను సవరించనున్నామని అమెరికా వెల్లడించడం ఐటీ షేర్లను నష్టాల పాలు చేసింది. రూపాయి పతనం కారణంగా ఇప్పటివరకూ ఐటీ షేర్లు లాభపడుతూ వచ్చాయి.  వీసా నిబంధనలు కఠినతరం కానున్నాయన్న వార్తల కారణంగా ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఇన్ఫోసిస్‌ 3.1 శాతం, టీసీఎస్‌ 1 శాతం,  విప్రో 0.2 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 6 శాతం, టెక్‌ మహీంద్రా 4 శాతం వరకూ నష్టపోయాయి. మైండ్‌ట్రీ 16 శాతం వరకూ నష్టపోయింది. 
రూ.1.60 లక్షల కోట్లు ఆవిరి 
సెన్సెక్స్‌ భారీ పతనం కారణంగా రూ.1.60 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.138.64 లక్షల కోట్ల  నుంచి రూ.137.04 లక్షల కోట్లకు తగ్గింది. 
కొనసాగిన ఎన్‌బీఎఫ్‌సీల నష్టాలు 
ఎన్‌బీఎఫ్‌సీలు ముఖ్యంగా హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల షేర్ల నష్టాలు కొనసాగాయి. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల నిధుల నిబంధనలను ఆర్‌బీఐ సరళీకరించింది. అయినప్పటికీ, ఎన్‌బీఎఫ్‌సీల పతనం ఆగలేదు. హెచ్‌డీఎఫ్‌సీ 4.3 శాతం క్షీణించి రూ.1,661 వద్ద ముగిసింది.  పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 19 శాతం, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 17 శాతం, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 10 శాతం, రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌ 8 శాతం, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌​ సర్వీసెస్‌ 3.2 శాతం చొప్పున నష్టపోయాయి. మరోవైపు ప్రొపర్టీ డెవలపర్‌ సూపర్‌ టెక్‌, సంబంధిత సంస్థలు డిఫాల్ట్‌ అయ్యాయన్న వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళనను పెంచాయి. ఈ సంస్థలు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ.500 కోట్ల మేర రుణాలు చెల్లించాల్సి ఉందని సమాచారం. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కంపెనీ రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్‌ కావడంతో ఆరంభమైన ఎన్‌బీఎఫ్‌సీల షేర్ల పతనం.. ఎన్ని దిద్దుబాటు చర్యలు తీసుకున్నా ఆగడం లేదు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఇండియాబుల్స్‌ వెంచర్స్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, పీఎన్‌బీ హౌసింగ్‌, రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌, ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ షేర్లు ఒక్క నెల రోజుల్లోనే 35-65 శాతం రేంజ్‌లో నష్టపోయాయి. 
నష్టాలు ఎందుకంటే.... 
1. ప్రపంచ మార్కెట్ల పతనం: అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల పెంపు అంచనాలు మరింత బలపడడటం, ఇటలీలో భౌగోళిక, రాజకీయ ఆందోళనలు చెలరేగడం, చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళన తదితర అంశాల కారణంగా ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. గురువారం అమెరికా స్టాక్‌ సూచీలు భారీగా పతనం కావడం, ఆ ప్రభావంతో శుక్రవారం ఆసియా, యూరప్‌ మార్కెట్లు నష్టపోవడం..మన మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావాన్నే చూపించాయి. 
2.తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు: రూపాయి పతనం, ముడి చమురు ధరలు పెరుగుతుండటం, అమెరికాలో బాండ్ల రాబడులు పెరుగుతుండటంతో విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్‌ నుంచి వారి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ నెలలో ఇప్పటిదాకా మన మార్కెట్‌ నుంచి రూ.20,000 కోట్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. 
3. షాకిచ్చిన ఎస్‌బీఐ నివేదిక: రూపాయి పతనం వల్ల దిగుమతులు తగ్గలేదని, ఎగుమతులు కూడా పెరగలేదని, కానీ వాణిజ్య లోటు మరింతగా పెరిగిందని ఎస్‌బీఐ ఎకనామిక్‌ రీసెర్చ్‌ వెల్లడించడం ప్రతికూల ప్రభావం చూపించింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ రూపాయి 15 శాతం వరకూ పతనమైంది. 
4. హెవీ వెయిట్‌ షేర్లకు నష్టాలు: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌ షేర్లు 3-4 శాతం వరకూ నష్టపోయాయి. సెన్సెక్స్‌ మొత్తం 464 పాయింట్ల నష్టంలో ఈ మూడు షేర్ల వాటాయే 360 పాయింట్ల వరకూ ఉంది. రిలయన్స్‌ వాటా 154 పాయింట్లు, హెచ్‌డీఎఫ్‌సీ వాటా 127 పాయింట్లు, ఇన్పోసిస్‌ వాటా 84 పాయింట్లుగా ఉన్నాయి.
మరిన్ని విశేషాలు...
♦ ఈ క్యూ2లో రికార్డ్‌ స్థాయి లాభాలను సాధించినా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నష్టపోయింది. రిటైల్‌, టెలికం విభాగాలు మంచి వృద్ధినే సాధించినా, కీలకమైన పెట్రో కెమికల్స్‌ విభాగం ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఈ షేర్‌ 4 శాతం నష్టంతో రూ.1,102 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.29,945 కోట్లు తగ్గి రూ.6,98,278 కోట్లకు పడిపోయింది. 
♦ యస్‌ బ్యాంక్‌ సీఈఓ రాణా కపూర్‌ పదవీ కాలాన్ని వచ్చే జనవరి తర్వాత కనీసం మూడు నెలలు పొడిగించాలన్న డైరెక్టర్ల బోర్డ్‌ అభ్యర్థనను ఆర్‌బీఐ మన్నించలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 కల్లా కొత్త సీఈఓ నియామకం జరగాల్సిందేనని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. దీంతో ఈ షేర్‌ 6 శాతం నష్టంతో రూ.218 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. 
♦ ఏసీసీ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో సిమెంట్‌ షేర్లు క్షీణించాయి. ఏసీసీ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, అంబుజా సిమెంట్‌ తదితర షేర్లు 3-8 శాతం రేంజ్‌లో పతనమయ్యాయి. దాల్మియా భారత్‌, శ్రీ సిమెంట్‌ షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలను తాకాయి. 
♦ మార్కెట్‌ బలహీనంగా ఉన్నప్పటికీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ 4 శాతం లాభపడి రూ.168కు చేరింది. గత నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో ఈ షేర్‌ 15 శాతానికి పైగా పెరిగింది. ఈ కంపెనీ భారత్‌లో ఇంధన రిటైల్‌ నెట్‌వర్క్‌ కోసం ఫ్రాన్స్‌ ఇంధన దిగ్గజం టోటల్‌ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకోవడమే దీనికి ప్రధాన కారణం. 
♦ దాదాపు వందకు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. హీరో మోటొకార్ప్‌,  బజాజ్‌ ఆటో, క్రిసిల్‌, దిలిప్‌ బిల్డ్‌కాన్‌, డిష్‌ టీవీ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, యూనిటెక్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. You may be interested

పడుతున్న కత్తులను పట్టుకున్న రిటైల్‌ ఇన్వెస్టర్లు!

Friday 19th October 2018

ఇటీవలి కాలంలో బాగా పతనమవుతున్న స్టాక్స్‌ను రిస్క్‌ చేసి మరీ రిటైల్‌ ఇన్వెస్టర్లు కొంటున్నట్టు స్టాక్‌ ఎక్సేంజ్‌ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అధిక పెట్టుబడులు పెట్టే హెచ్‌ఎన్‌ఐలతోపాటు రిటైల్‌ ఇన్వెస్టర్లు నష్ట జాతక స్టాక్స్‌ వెంట అడుగులు వేస్తుండడాన్ని గమనించొచ్చు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇలాంటి స్టాక్స్‌ చాలానే కొన్నారు. ఆ షేర్లు ఒక్క సెప్టెంబర్‌ త్రైమాసికంలోనే 45 శాతం వరకు పడిపోయాయి.    మన్‌పసంద్‌ బెవరేజెస్‌ ఇందులో ఒకటి. ఈ కంపెనీలో రిటైల్‌ ఇన్వెస్టర్ల

ఈ పతనం చాలదు!

Friday 19th October 2018

దేశీ సూచీలపై సీఎల్‌ఎస్‌ఏ కొద్దికాలంగా భారత సూచీల్లో కొనసాగుతున్న కరెక‌్షన్‌ సరిపోదని, మార్కెట్లు మరికొంత పతనం చూడాల్సిఉందని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయపడింది. నిఫ్టీ గత ఒకటిరెండు నెలల్లో 11170 పాయింట్ల నుంచి 10170 పాయింట్ల వరకు పతనమైన సంగతి తెలిసిందే. శుక్రవారం సైతం సూచీలు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ మరోమారు 150 పాయింట్ల నష్టంతో 10300 పాయింట్లకు చేరింది. ఈ డౌన్‌ ట్రెండ్‌ ఇప్పుడు ఆగదని సీఎల్‌ఎస్‌ఏ భారత్‌

Most from this category