STOCKS

News


టీసీఎస్‌ టార్గెట్‌ ధర పెంచిన బ్రోకరేజ్‌లు

Wednesday 11th July 2018
Markets_main1531293189.png-18202

క్యు1 ఎర్నింగ్స్‌పై పాజిటివ్‌ స్పందన
అద్భుతమైన జూన్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం పలు అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థలు టీసీఎస్‌పై మరింత పాజిటివ్‌గా మారాయి. వివిధ బ్రోకరేజ్‌లు టీసీఎస్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడం, టార్గెట్‌ను పెంచడం చేశాయి. ఆ వివరాలు..
- మాక్క్వైరీ సంస్థ టీసీఎస్‌ రేటింగ్‌ను న్యూట్రల్‌ నుంచి అవుట్‌పెర్ఫామ్‌కు పెంచింది. టార్గెట్‌ ధరను రూ. 2015గా నిర్ణయించింది. బీఎఫ్‌ఎస్‌ఐ విభాగ మందగమనానికి మందువేసేందుకు కంపెనీ చర్యలు చేపడుతోందని, అవి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపింది. ఈపీఎస్‌ అంచనాలను 10- 14 శాతం మేర పెంచింది.
- జెఫర్రీస్‌ సంస్థ టీసీఎస్‌ రేటింగ్‌ను హోల్డ్‌ నుంచి కొనొచ్చుకు అప్‌గ్రేడ్‌ చేసింది. టార్గెట్‌ ధరను రూ. 2140గా నిర్ణయించింది. ఉత్తర అమెరికాలో కంపెనీ వ్యాపారం పుంజుకుంటోందని, అందుకే మార్జిన్లు, వృద్ధి అంచనాలను పెంచుతున్నామని తెలిపింది. 
- సీఎల్‌ఎస్‌ఏ సంస్థ టీసీఎస్‌కు కొనొచ్చు రేటింగ్‌ కొనసాగిస్తున్నట్లు తెలిపింది. టార్గెట్‌ ధర రూ. 2200గా నిర్ణయించింది. అన్ని విభాగాల్లో అదరగొట్టే ఫలితాలను టీసీఎస్‌ ప్రకటించిందని, డీల్స్‌ సైతం భారీగా కుదుర్చుకుందని పేర్కొంది.
- సీటీ గ్రూప్‌ మాత్రం టీసీఎస్‌పై అమ్మొచ్చు రేటింగ్‌ ఇస్తూ రూ. 1645 టార్గెట్‌ ధరగా పేర్కొంది. 
అదరగొట్టే ఫలితాలు...
బీఎఫ్‌ఎస్‌ఐ దన్నుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ‍క్యూ1లో టీసీఎస్‌ నికర లాభం 23 శాతం దూసుకుపోయి రూ. 7,340 కోట్లుగా నమోదైంది. మార్కెట్‌ వర్గాల అంచనా రూ. 6,957 కోట్ల కన్నా ఇది దాదాపు రూ. 400 కోట్లు అధికం. కంపెనీ ఆదాయం 15.8 శాతం వృద్ధితో రూ. 29,584 కోట్ల నుంచి రూ. 34,261 కోట్లకు ఎగిసింది. షేరు ఒక్కింటికి రూ. 4 మేర మధ్యంతర డివిడెండ్ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. టాటా గ్రూప్‌ లాభాల్లో సింహభాగం వాటా టీసీఎస్‌దే. "మెరుగైన ఆర్థిక ఫలితాలతో కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. బ్యాంకింగ్ విభాగం ఈ క్వార్టర్‌లో గణనీయంగా కోలుకుంది. మిగతా వ్యాపార విభాగాలు కూడా మెరుగైన పనితీరే కొనసాగిస్తున్నాయి. నిలకడగా మెరుగైన వృద్ధి రేటును కొనసాగించగలం" అని టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేశ్ గోపీనాథన్ ధీమా వ్యక్తం చేశారు. స్థిర కరెన్సీ మారకం విలువ ప్రాతిపదికన 9.3 శాతం మేర ఆదాయ వృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో  పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ వార్షిక లక్ష్యానికి మించి రెండంకెల స్థాయి వృద్ధిని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. కీలక క్లయింట్లు.. టెక్నాలజీపై పెట్టుబడులు గణనీయంగా పెంచుకుంటుండటం, పెద్ద సంఖ్యలో డీల్స్‌ ఇందుకు తోడ్పడగలవని గోపీనాథన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య బీమా పథకానికి డిజైన్ చేసిన నమూనానే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు ఆయుష్మాన్ భారత్ పథకానికి కూడా ఉపయోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్యూ1లో కొత్తగా 100 మిలియన్ డాలర్ల పైబడిన డీల్స్ రెండు దక్కించుకున్నట్లు టీసీఎస్ పేర్కొంది. అలాగే 5 మిలియన్ డాలర్ల పైబడిన కేటగిరీలో కొత్తగా 13 క్లయింట్స్ జతయినట్లు వివరించింది. ఐటీ సర్వీసుల విభాగంలో ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్‌) స్వల్పంగా 0.1 శాతం తగ్గి 10.9 శాతానికి పరిమితమైంది. జూన్ క్వార్టర్ ఆఖరు నాటికి సంస్థలో ఉద్యోగుల సంఖ్య (కన్సాలిడేటెడ్) 4 లక్షల మార్కును దాటి 4,00,875గా ఉంది. గత క్యూ1తో పోలిస్తే ప్రస్తుత క్యూ1లో రిక్రూట్‌మెంట్ నికరంగా 5,800 మంది ఉద్యోగుల మేర పెరిగింది. సిబ్బందిలో మహిళా ఉద్యోగుల సంఖ్య 35.6 శాతానికి చేరింది. జూన్ త్రైమాసికంలో కొత్తగా 62 పేటెంట్లకు దరఖాస్తు చేసినట్లు, దీంతో మొత్తం పేటెంట్ల దరఖాస్తుల సంఖ్య 3,978కి చేరినట్లు సంస్థ తెలిపింది. 715 పేటెంట్లు మంజూరు అయినట్లు వివరించింది. 
రూపాయి క్షీణత కలిసివచ్చింది..
తొలి త్రైమాసికంలో వేతనాల పెంపు, వీసా వ్యయాల పెరుగుదల రూపంలో ప్రతికూల అంశాలు ఎదురైనప్పటికీ.. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం నాలుగు శాతం క్షీణించిన నేపథ్యంలో ఆ ప్రభావం కొంత తగ్గినట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) వి. రామకృష్ణన్ తెలిపారు. ఉద్యోగుల టెక్నాలజీ నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు శిక్షణపై మరింతగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. కరెన్సీ ప్రభావాలు ఎలా ఉన్నప్పటికీ.. యూరప్ వంటి డాలర్‌యేతర ఎకానమీల్లో వ్యాపార అవకాశాల అన్వేషణ కొనసాగుతుందన్నారు. మరోవైపు, సొంత ఉత్పత్తులను మెరుగుపర్చుకోవడంతో పాటు కొత్త ఉత్పత్తుల కొనుగోలుకు కూడా ప్రాధాన్యమివ్వనున్నట్లు టీసీఎస్ సీవోవో ఎన్‌జీ సుబ్రమణియం చెప్పారు. బీఎఫ్‌ఎస్‌ఐ విభాగం వ్యాపారం 4.1 శాతం వృద్ధి నమోదు చేసింది. గడిచిన 15 త్రైమాసికాల్లో ఇదే అత్యధికం. ఇక,  ఇతర విభాగాల్లో ఎనర్జీ అత్యధికంగా 30.9 శాతం, తయారీ 6.9 శాతం, రిటైల్ అండ్ కన్జూమర్ బిజినెస్ 12.7 శాతం, కమ్యూనికేషన్ 9.5 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. క్రితం త్రైమాసికంతో పోలిస్తే డిజిటల్ విభాగం ఆదాయ వృద్ధి ఏకంగా 44 శాతం ఎగిసింది. మొత్తం ఆదాయంలో దీని వాటా నాలుగో వంతుగా ఉంటోంది. ఆటోమేషన్‌, వీసాలపై ఆంక్షలు మొదలైన అంశాల కారణంగా కీలకమైన ఉత్తర అమెరికా వ్యాపారం కొన్నాళ్లుగా మందగించింది. అయితే, తాజాగా ఇది గణనీయంగా పుంజుకోవడం కూడా టీసీఎస్ మెరుగైన ఆర్థిక ఫలితాలకు తోడ్పడింది. గడిచిన మూడేళ్లలో ఉత్తర అమెరికా యూనిట్ అత్యధిక వృద్ధి నమోదు చేసినట్లు గోపీనాథన్ తెలిపారు. ఉత్తర అమెరికాలో వ్యాపారం 7 శాతం మేర పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఇది మరింతగా మెరుగుపడగలదన్నారు. మరోవైపు, బ్రిటన్‌ వ్యాపారం 18.7 శాతం, యూరప్ 18.6 శాతం, ఆసియా పసిఫిక్ 10.8 శాతం మేర వృద్ధి చెందాయి. You may be interested

ఒడిదుడుకుల మార్కెట్‌లో 10 సేఫ్‌ బెట్స్‌..!

Wednesday 11th July 2018

ముంబై: డివిడెండ్‌ ఈల్డ్‌ పరంగా ఆకర్షణీయంగా ఉన్న కంపెనీలు ఒడిదుడుకుల మార్కెట్‌లో సురక్షిత బెట్స్‌గా నిలుస్తాయని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా డివిడెండ్‌ చెల్లిస్తున్న కంపెనీల షేర్లను కొనుగోలు చేయడం ద్వారా రిస్క్‌ను పూర్తిగా తగ్గించవచ్చని చెబుతున్న వీరు.. ఇటువంటి వాటిలో మల్టీబ్యాగర్లు సైతం ఉండేందుకు అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఫండమెంటల్‌ పరంగా చూస్తే.. ఆర్జించిన లాభాలను ఇన్వెస్టర్లకు డివిడెండ్‌ రూపంలో నిలకడగా చెల్లింపులు చేస్తున్న కంపెనీల

తగ్గుముఖం పట్టిన పసిడి ధర

Wednesday 11th July 2018

ముంబై:- డాలర్‌ పటిష్టమైన ర్యాలీతో బుధవారం పసిడి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. చైనా నుంచి దిగుమతిమయ్యే వస్తువులపై ఇప్పటికే దిగుమతి సుంకాలను విధించిన అమెరికా తాజాగా మరోసారి సుంకాల విధింపునకు సిద్ధమైంది. ఇప్పుడు అదనంగా మరో 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై  పది శాతం సుంకాలు పెంచనున్నట్లు అమెరికా స్పష్టంచేసింది. ఫలితంగా ఆరు ప్రపంచ కరెన్సీ విలువతో పోలిస్తే డాలర్‌ విలువ పెరిగింది. నేడు ఆసియా

Most from this category