STOCKS

News


రూపాయి ‘బెస్ట్‌’

Wednesday 27th March 2019
Markets_main1553665661.png-24821

ఐదు వారాల్లో మారిన పరిస్థితులు
ఆసియాలోనే మెరుగైన కరెన్సీ
విదేశీ పెట్టుబడుల దన్ను
నరేంద్ర మోదీ విజయావకాశాలే కారణం
మరోసారి మోదీ వస్తే మరింత బలం
విశ్లేషకుల అంచనాలు

న్యూఢిల్లీ: మొన్నటి వరకు ఆసియా ప్రాంతంలో బలహీనంగా కనిపించిన రూపాయి ఇప్పుడు ఆకర్షణీయంగా మారింది. ఆసియాలోనే వరస్ట్‌ పనితీరు నుంచి అత్యుత్తమ పనితీరు చూపించే స్థాయికి మారిపోయింది. కేవలం ఐదు వారాల్లోనే రూపాయి తన దిశను మార్చుకోవడం వెనుక మోదీ ఫ్యాక్టరే ప్రధానంగా పనిచేయడం ఆసక్తిదాయకం. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ చేసిన దాడుల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల అనంతరం తిరిగి నరేంద్రమోదీ నాయకత్వంలోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు బలపడ్డాయి. ఇవే అంచనాలు దన్నుగా విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్‌ మార్కెట్లలోకి ఐదు వారాలుగా పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. దీంతో రూపాయి కళను సంతరించుకుంది. డాలర్‌ మారకంలో 70లోపునకు దిగొచ్చింది. మోదీ రెండోసారి విజయం సాధిస్తే రూపాయి మరింత బలపడుతుందని సింగపూర్‌లోని స్కాటియా బ్యాంకు కరెన్సీ స్ట్రాటజిస్ట్‌ గావోక్వి తెలిపారు. జూన్‌ చివరి నాటికి డాలర్‌తో రూపాయి 67 స్థాయికి పుంజుకుంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ వృద్ధి పడిపోతుండడంతో ప్రధాన సెంట్రల్‌ బ్యాంకులు డోవిష్‌ విధానాన్ని వ్యక్తీకరించడం కూడా విదేశీ ఇన్వెస్టర్లు వర్ధమాన ఆసియా కరెన్సీల్లో రాబడుల కోసం ఆసక్తి ప్రదర్శిస్తున్నట్టు ఆయన చెప్పారు.
విదేశీ పెట్టుబడుల వెల్లువ
మార్చి 18 నాటికి విదేశీ ఇన్వెస్టర్లు 3.3 (రూ.23వేల కోట్లు అంచనా) బిలియన్‌ డాలర్ల విలువ మేర భారత ఈక్విటీలపే కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన 5.6 బిలియన్‌ డాలర్లలో 50 శాతానికంటే ఎక్కువ కేవలం గత మూడు వారాల్లోనే రావడం గమనార్హం. బాండ్లలో ఈ నెలలో ఇప్పటి వరకు 1.4 బిలియన్‌ డాలర్ల మేర ఇన్వెస్ట్‌ చేశారు. డాలర్ల వెల్లువతో రూపాయి గతేడాది ఆగస్ట్‌ తర్వాత తిరిగి గరిష్ట స్థాయికి చేరుకుంది. గత నెల రోజుల్లో డాలర్లలో రుణాలు తీసుకుని రూపాయి ఆస్తులు కొనుగోలు చేయడం వల్ల వచ్చిన రాబడులు 3.8 శాతంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ క్యారీ ట్రేడింగ్‌ రాబడులు రూపాయిలోనే ఉండడం గమనార్హం. మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే త్వరలో జరిగే ఎన్నికల్లో 272 లోక్‌సభ స్థానాలను సాధిస్తుందని రెండు ఒపీనియన్‌ పోల్స్‌ అంచనాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ‘‘మార్కెట్లు మోదీ విజయాన్ని పరిగణనలోకి తీసుకున్నాయి. ఉన్నట్టుండి మార్కెట్‌ వాతావరణం మారేందుకు మరే ఇతర అంశం లేదు’’ అని కోటక్‌ సెక్యూరిటీస్‌ అనలిస్ట్‌ అనిద్య బెనర్జీ పేర్కొన్నారు. ఇక క్యారీ ట్రేడర్లు రూపాయిలో లాంగ్‌ పొజిషన్లకు వెళ్లడంతోపాటు డాలర్‌ సహా తక్కువ ఈల్డింగ్‌ కరెన్సీల్లో షార్ట్‌ల పట్ల మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రూపాయి పట్ల ఆశావహ పరిస్థితి డెరివేటివ్‌ మార్కెట్లపైనా ప్రతిఫలిస్తోంది. నెలవారీ ఆప్షన్లలో రూపాయి కొనుగోలు కంటే విక్రయం 19 బేసిస్‌ పాయింట్లు అధికంగా ఉండడం గమనార్హం. ‘‘అంతర్జాతీయ పరిస్థితులు ఫెడ్‌, ఈసీబీ డోవిష్‌ ధోరణి దేశీయంగా మరింత మద్దతుగా మారాయి. బీజేపీ విజయావకాశాలపై విశ్వాసం పెరగడం, అదే సమయంలో విదేశీ పోర్ట్‌ఫోలియో నిధుల్లో రికవరీ నెలకొనడం రూపాయిని నడపిస్తున్నాయి’’ అని నోమరా కరెన్సీ స్ట్రాటజిస్ట్‌ దుష్యంత్‌ పద్మనాభన్‌ తెలిపారు. రూపాయి మూడు నెలల అంతర్గత వోలటాలిటీ కూడా 5.87 శాతానికి పడిపోయింది. గతేడాది ఆగస్ట్‌ తర్వాత మళ్లీ ఇదే తక్కువ స్థాయి. ఇది రూపాయి బుల్లిష్‌ ధోరణిని తెలియజేస్తోంది. రూపాయి సమీప కాలంలో స్థిరంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు బార్క్‌లేస్‌ స్ట్రాటజిస్ట్‌ ఆశిష్‌ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. బీజేపీ కనుక మరలా విజయం సాధిస్తే ఈ ఏడాది మిగిలిన కాలంలో రూపాయి బలం చూపిస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. 



You may be interested

కొత్త ఇన్వెస్టర్‌ రూ.4,500 కోట్లు తేవాలి

Wednesday 27th March 2019

జెట్‌ ఎయిర్‌వేస్‌ నిర్వహణకు ఈ మేరకు అవసరం న్యూఢిల్లీ: నిధుల కటకటతో బ్యాంకుల ఆధీనంలోకి వెళ్లిన జెట్‌ ఎయిర్‌వేస్‌ నిర్వహణకు కొత్త ఇన్వెస్టర్‌ కనీసం రూ.4,500 కోట్లను తీసుకురావాల్సి ఉంటుందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని 26 బ్యాంకుల కమిటీ వచ్చే నెలలో జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించనున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ చక్కని సంస్థ అని, ఇన్వెస్టర్ల నుంచి ఎంతో ఆసక్తి ఉన్నట్టు రజనీష్‌

కింగ్‌ఫిషర్‌ను కూల్చేశారు... జెట్‌ను గట్టెక్కిస్తున్నారు

Wednesday 27th March 2019

బ్యాంకుల ద్వంద ప్రమాణాలపై మాల్యా మండిపాటు న్యూఢిల్లీ: మాజీ లిక్కర్‌ కింగ్‌, వ్యాపారవేత్త విజయ్‌మాల్యా బ్యాంకుల ద్వంద ప్రమాణాలపై మండిపడ్డారు. ఒకప్పుడు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ నిర్దాక్షిణ్యంగా విఫలమయ్యేందుకు కారణమైన బ్యాంకులు... ఇప్పుడు అదే విధమైన పరిస్థితిలో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను మాత్రం ఒడ్డెక్కిస్తున్నాయని ఎత్తిచూపారు. సమస్యల్లో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ తన నియంత్రణలోకి తీసుకోవడంపై వరుస ట్వీట్లతో మాల్యా తన స్పందన తెలియజేశారు. కింగ్‌ఫిషర్‌ విషయంలోనూ

Most from this category